ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊయల ఊసేదీ!?

ABN, First Publish Date - 2022-11-11T01:30:40+05:30

రైల్వే స్టేషన్‌లోని బాత్‌రూమ్‌ సింక్‌లో ఇటీవల ఓ మహిళ బిడ్డను వదిలి వెళ్లిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లులు వదిలేస్తున్న బిడ్డల రక్షణ ఈ పథకం ఉద్దేశం

నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఊయలలు ఏర్పాటుచేయాలని నిర్ణయం

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు బాధ్యతలు అప్పగింత

నిధులు లేకపోవడంతో కార్యరూపం దాల్చని వైనం

ఏటా పదుల సంఖ్యలో పసికందులు మృతి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రైల్వే స్టేషన్‌లోని బాత్‌రూమ్‌ సింక్‌లో ఇటీవల ఓ మహిళ బిడ్డను వదిలి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తరువాత శిశువును సిబ్బంది గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా చిన్నారి ప్రాణాలను కోల్పోయింది.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఒక పరిశ్రమలో పనిచేస్తున్న మహిళ అక్కడ బాత్‌రూమ్‌లో ప్రసవించి, బిడ్డను వదిలి వెళ్లిపోయింది. సిబ్బంది గుర్తించి కేజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ పసికందు మృతిచెందింది.

...ఈమధ్య ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నాయి. బిడ్డలను వద్దనుకుంటున్న తల్లులు నిర్దాక్షిణ్యంగా ముళ్ల పొదల్లో పడేస్తున్నారు. ఇటువంటి చిన్నారులను రక్షించే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఊయల’ పేరుతో కొన్నేళ్ల కిందట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని అమలుచేసే బాధ్యతను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది. అయితే, ఆ పథకం కార్యరూపం దాల్చలేదు.

ఎందుకీ ఊయల..?

పుట్టిన పిల్లలను వద్దనుకునే తల్లులు ఈ ఊయలలో వదిలేసి వెళితే మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు వారి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటారు. ఆ బిడ్డలను ఎవరు వదిలివెళ్లారు, ఎందుకు వదిలివెళ్లారనే విషయాలను ఆరా తీయరు. ఈ విధంగా చేయడం వల్ల శిశువుల ప్రాణాలు రక్షించేందుకు అవకాశముంది. ఈ ఊయల ఏర్పాటుచేసేందుకు ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించారు. నగర పరిధిలోని ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌, కేజీహెచ్‌, ఘోషాతోపాటు పలు ఆస్పత్రులు, కీలక కూడళ్లు వద్ద ఊయలలు ఏర్పాటుచేయాలని భావించారు. అయితే, ఊయలలు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ పథకం అమలుకు నోచుకోలేదు.

ఏటా పది మందికిపైగా చిన్నారులు..

ముళ్ల పొదల్లో, రోడ్ల పక్కన, ఆస్పత్రి ఆవరణల్లో...ఇలా అనేకచోట్ల పసికందులను వదిలేసి వెళుతున్నారు. ఏటా పది నుంచి 15 మంది చిన్నారులు ఈ విధంగా వదిలేయబడుతు న్నారని అధికారులు చెబుతున్నారు. స్థానికులు సమాచారంతో అధికారులు వెళ్లి సదరు చిన్నారులను ఆస్పత్రుల్లో చేర్చి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఆ చిన్నారులను గుర్తించడం ఆలస్యం కావడం, సకాలంలో వైద్యం అందించే అవకాశం లేకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇన్‌ఫెక్షన్ల ముప్పు..

కాలువల్లో పడేసిన చిన్నారులను ప్రాణాలు కోల్పోయిన తరువాత గుర్తిస్తుండగా, ముళ్ల పొదల్లో, ఇతర ప్రాంతాల్లో వదిలేస్తున్న చిన్నారుల్లో ఎక్కువ మంది ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందుతున్నట్టు చెబుతున్నారు. తాజాగా గుర్తించిన ఇద్దరు చిన్నారులు ఇన్‌ఫెక్షన్లు వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. ఈ ఇద్దరు చిన్నారులను బాత్‌రూమ్‌లో గుర్తించారు.

కారణాలు అనేకం..

గత ఆరేళ్లలో సుమారు 50 మంది శిశువులను అధికారులు గుర్తించారు. ఎక్కువ మంది అవాంఛిత గర్భం వల్లే జన్మించినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. ఎవరో చేసి న తప్పిదాలకు చిన్నారులు బలి అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొందరు చిన్నారులను శారీరక వైకల్యం వుండడంతో వదిలి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. మరి కొందరు ఆడపిల్ల కావడంతో పెంచలేమన్న భయంతో వదిలి వెళుతున్నట్టుగా చెబుతున్నారు. కారణం ఏదైనా వద్దనుకునే బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు ఊయల పథకం ఉపయోగపడుతుందని, దాన్ని అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.

ఆసరానిచ్చే శిశు గృహం

తల్లిదండ్రులు వదిలేస్తున్న చిన్నారులకు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించిన తరువాత మర్రిపాలెంలోని శిశుగృహ అండగా నిలుస్తోంది. బిడ్డలను వదిలేసేవారు తల్లులకు 60 రోజుల వరకు అధికారులు అవకాశమిస్తున్నారు. అరవై రోజుల్లోగా వస్తే వారి బిడ్డను వారికి అప్పగిస్తారు. అలా, రానట్టయితే వారిని శిశు గృహలోనే ఉంచి ఆలనాపాలనా చూస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులకు దత్తత ఇస్తున్నారు.

Updated Date - 2022-11-11T01:30:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising