గౌరవ వేతనాలు ఏవీ?
ABN, First Publish Date - 2022-12-15T00:37:36+05:30
ఎంపీటీసీ సభ్యులుగా గెలిచినప్పటికీ తమకు గౌరవ వేతనాలు కూడా రావడం లేదని, సమావేశాలకు వచ్చేందుకు, వెళ్లేందుకుతమ సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వస్తోందని మండల పరిషత్ సభ్యులు అధికారుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు.
బడ్జెట్ సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల ఆవేదన
చోడవరం, డిసెంబరు14: ఎంపీటీసీ సభ్యులుగా గెలిచినప్పటికీ తమకు గౌరవ వేతనాలు కూడా రావడం లేదని, సమావేశాలకు వచ్చేందుకు, వెళ్లేందుకుతమ సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వస్తోందని మండల పరిషత్ సభ్యులు అధికారుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ గాడి కాసు అధ్యక్షతన మండల పరిషత్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీటీసీ సభ్యులు తమ గౌరవ వేతనాల మాటేమిటని ఎండీవో ను ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశంలో సభ్యుల గౌరవ వేతనం, ఇతర ఖర్చుల కింద రూ.14లక్షలు చూపించారని, అయినప్పటికీ తమకు మాత్రం గౌరవ వేతనాలు ఎందకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఎండీవో శ్యాంసుందర్ సమాధానమిస్తూ ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే సభ్యుల ఖాతాలకు వాటిని జమ చేస్తామని, మండల పరిషత్ నిధుల నుంచి వేతనాలు చెల్లించేందుకు అవకాశం లేదని సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో ప్రతి ఎంపీ టీసీ సభ్యునికి రూ.4లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్టు ఎంపీపీ గాడి కాసు వెల్లడించారు. ఈ నిధులతో గ్రావెల్ రోడ్ల నిర్మాణం లేదా పంట కాల్వల అభివృద్ధి తదితర పనులకు వెచ్చించవచ్చని సూచించారు. సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4.95 కోట్లతో అంచనా బడ్జెట్ను రూపొందించడంతో పాటు, 2022-23 సంవత్సరం బడ్జెట్ను ఆమోదించారు. మండలంలోని 26 పంచాయతీలలో ఉపాధి పథకం కింద 259 పనులకు రూ.16 కోట్ల 5 లక్షల నిఽధులు మంజూరైనట్టు ఎండీవో శ్యాం సుందర్ వివరించారు. ఈ నెల 23న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీలు బుద్ధ గంగరాజు, బైన ఈశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు గూనూ రు రాజు, మంగా జగన్నాధరావు, శరగడం నాగేశ్వరరావు, వై. రమేష్, సన్యాసిదేముడు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:37:40+05:30 IST