విద్యుత్ శాఖ నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2022-06-03T06:16:03+05:30
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మునగపాక, గణపర్తి గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత నెల 24న ఈదురు గాలులకు విరిగిన విద్యుత్ స్తంభాలు
మునగపాక, గణపర్తిల్లో వ్యవసాయానికి నిలిచిన సరఫరా
ఇంతవరకు పునరుద్ధరించని అధికారులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపణ
నీరు లేక ఎండిపోతున్న పంటలు
మునగపాక, జూన్ 2:
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మునగపాక, గణపర్తి గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పది రోజుల క్రితం ఈదురు గాలులకు చెట్లు కూలి విద్యుత్ వైర్లపై పడడంతో స్తంభాలు విరిగిపోగా, కొన్నిచోట్ల పక్కకు ఒరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంతవరకు పురుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, పశువులకు నీటి కోసం శారదా నదికి వెళ్లాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. గణపర్తి గ్రామం అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి దత్తత ఊరు కావడం ఈ సందర్భంగా గమనార్హం.
మండలంలో గత నెల 24వ తేదీ సాయంత్రం వీచిన ఈదురు గాలులకు అనేకచోట్ల చెట్లు కూలి విద్యుత్ వైర్లపై పడడంతో కొన్ని స్తంభాలు విరిగిపోయాయి. మరికొన్నిచోట్ల స్తంభాలు నేలకూలాయి. దీంతో మండల కేంద్రమైన మునగపాకతోపాటు గణపర్తి గ్రామాల్లో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మునగపాక పురిటిగెడ్డ ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్-19 పరిధిలోని వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా కావడం లేదు. ఒంపోలు- మునగపాక సరిహద్దులో ఉన్న వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్-9 పరిధిలో స్తంభం విరిగిపోయి పక్కకు ఒరిగిపోయింది. విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు వేయాలి. అదే విధంగా పక్కకు ఒరిగిన స్తంభాలను సరిచేయాలి. కానీ పది రోజులు అవుతున్నప్పటికీ విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో పొలాలకు నీరు పెట్టలేకపోతున్నామని, ఎండలు మండుతుండడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పొలాల్లో పశువులశాలలు వుంటాయి. మోటార్లకు కరెంటు లేకపోవడంతో పశువులను సమీపంలోని శారదా నది ఒడ్డుకు తీసుకెళ్లి నీరు పెట్టాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
పశువులకు నీటికోసం ఇక్కట్లు
కర్రి రామనాగేశ్వరరావు, గణపర్తి
గతంలో హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చాలా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అయినప్పటికే మూడు రోజుల్లోనే వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి పది రోజులు అవుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. పశువులకు తాగునీటి కోసం శారదా నదిని ఆశ్రయించాల్సి వస్తున్నది.
సిబ్బంది కొరతతో ఆలస్యం
గోపి, విద్యుత్ ఏఈ, మునగపాక సెక్షన్
సిబ్బంది కొరత వల్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో జాప్యం జరిగింది. వేరే ప్రాంతం నుంచి సిబ్బందిని రప్పించి స్తంభాలు, లైన్లను సరిచేసేందుకు చర్యలు చేపట్టాం. మునగపాకలో ట్రాన్స్‌ఫార్మర్-19 మరమ్మతులకు గురైంది. దీనిని బాగు చేయాలి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2022-06-03T06:16:03+05:30 IST