ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎల్‌సీ పిడుగు

ABN, First Publish Date - 2022-03-05T06:23:20+05:30

ఆదాయ మార్గాల అన్వేషణలో వున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యూఎల్‌సీ) కింద లోగడ గుర్తించిన భూములపై దృష్టిసారించింది.

గోపాలపట్నం రామకృష్ణానగర్‌లో ప్రాంతంలో నోటీసులు ఇస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

86 హెక్టార్లలో 3,883 నిర్మాణాలు ఉన్నట్టు గుర్తింపు

క్రమబద్ధీకరించుకోవాలంటూ ప్రభుత్వం నోటీసులు

రిజిస్ట్రేషన్‌ విలువకు ఒకటిన్నర రెట్లు చెల్లించాలని ఆదేశం

ఆదాయ లక్ష్యం రూ.400 కోట్లు

జూన్‌ 30 వరకూ గడువు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆదాయ మార్గాల అన్వేషణలో వున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యూఎల్‌సీ) కింద  లోగడ గుర్తించిన భూములపై దృష్టిసారించింది. ఆయా భూముల్లో గల నిర్మాణాల క్రమబద్ధీకరణ పేరిట రూ.400 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెగ్యులరైజేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ విలువ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా చెల్లించాలంటూ నోటీసులు జారీచేస్తోంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1976లో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి గరిష్ఠంగా నగర ప్రాంతంలో 1,500 చదరపు మీటర్లు (37 సెంట్లు) భూమి మాత్రమే ఉండాలి. అంతకుమించి వున్న భూమిని ప్రభుత్వానికి అప్పగించాలి. అయితే యూఎల్‌సీ చట్టం పూర్తిస్థాయిలో అమలుచేసే సమయానికి నగరంలో అనేకచోట్ల భూములు చేతులు మారిపోయాయి. ఆ తరువాత వాటిలో నిర్మాణాలు మొదలయ్యాయి. ఇదిలావుండగా 2002 తరువాత కేంద్ర ప్రభుత్వం యూఎల్‌సీ చట్టంలో సవరణలు చేసి కొంత వెసులుబాటు ఇవ్వడంతో  అక్రమ లావాదేవీలు పెరిగాయి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం నగరంలో 266 హెక్టార్ల మేర యూఎల్‌సీ భూములు ఉన్నాయి. ఇందులో 86 హెక్టార్లలో ఆక్రమణలున్నట్టు ఇప్పటికే గుర్తించారు. మరో 100 హెక్టార్ల భూమిని ఇంకా గుర్తించాల్సి ఉండగా, మిగిలిన 80 హెక్టార్లలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, సామాజిక భవనాలు వున్నాయని నిర్ధారించారు. ఇప్పటికే గుర్తించిన 86 హెక్టార్లలో గల ఆక్రమణదారులకు నోటీసులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆక్రమణలో వున్న స్థలం రిజిస్ట్రేషన్‌ విలువకు ఒకటిన్నర రెట్లు లెక్కించి అందులో 50 శాతానికి డీడీ తీసి జూన్‌ 30వ తేదీలోగా తమకు అందజేయాలంటూ సీతమ్మధార, గోపాలపట్నం, మహారాణిపేట, గాజువాక, ములగాడ, పెదగంట్యాడ, పెందుర్తి, విశాఖ రూరల్‌ తహసీల్దార్ల పరిధిలో వీఆర్వోలు, వార్డు సచివాలయ సిబ్బంది అక్రమణదారులకు నోటీసులు ఇస్తున్నారు. ఆక్రమణదారుడి దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించిన నెల రోజుల్లో మిగిలిన 50 శాతం చెల్లించి తరువాత సొంత ఖర్చుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఆ నోటీసులో పేర్కొంటున్నారు. 


నాలుగు మండలాల్లోనే ఎక్కువ..

నగరంలోని సీతమ్మధార, గోపాలపట్నం, మహారాణిపేట, గాజువాక మండలాల్లో ఎక్కువగా యూఎల్‌సీ భూములు ఉన్నాయి. మాధవధార, మురళీనగర్‌, కరాస, మర్రిపాలెం, దొండపర్తి, రైల్వే న్యూకాలనీ, తాటిచెట్లపాలెం, కేఆర్‌ఎం కాలనీ, గోపాలపట్నం, ఫకీర్‌ తకియా, చినగంట్యాడ, కూర్మన్నపాలెం, ఎల్లపువానిపాలెం, పుల్లంబట్లపాలెం, కొత్తపాలెం, డాబాగార్డెన్స్‌, వన్‌టౌన్‌, మురళీనగర్‌, రుషికొండ, మధురవాడ, ములగాడ తదితర ప్రాంతాల్లో ఎక్కువ  నిర్మాణాలు గుర్తించారు. 


కొత్తగా కొనుక్కున్నట్టే...

యూఎల్‌సీ భూములున్న తాటిచెట్లపాలెం, దొండపర్తి, మాధవధార, మురళీనగర్‌లలో రిజిస్ట్రేషన్‌ విలువ చదరపు గజం రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది.  ఆక్రమణల క్రమబద్ధీకరకుగాను ఒకటిన్నర రెట్లు చెల్లించాలి. ఉదాహరణకు దొండపర్తి ప్రాంతంలో యూఎల్‌సీ భూమిలో 100 గజాల నివాసం వున్నట్టు అధికారులు నిర్ధారిస్తే సదరు యజమాని రూ.60 లక్షల నుంచి నుంచి 75 లక్షల వరకు చెల్లించాలి. దీనికి రిజిస్ట్రేషన్‌ చార్జీలు అదనం. అంటే కొత్తగా ఇళ్లు కొనుకున్నట్టేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నగరంలో 86 హెక్టార్లలో 3,883 కట్టడాలు  ఉన్నాయని, వాటి క్రమబద్ధీకరణ ద్వారా రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  


గతంలో ఇచ్చిన దరఖాస్తుల మాటేమిటీ...

యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణపై 2008 మార్చి 27న అప్పటి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దీని ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన వున్న ఆక్రమణదారులకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్టు ప్రకటించారు. ఎగువ ఆదాయ వర్గాలకు అప్పటి రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం రెగ్యులర్‌ చేయాలని ప్రతిపాదించారు. దీంతో నగరంలో అనేక మంది సొమ్ములు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. కొందరికి మాత్రమే ఎన్‌వోసీ ఇచ్చిన అధికారులు, మిగిలిన వాటిని పెండింగ్‌లో పెట్టేశారు. తాజాగా ఇచ్చిన జీవో ప్రకారం గతంలో దరఖాస్తు చేసి సొమ్ములు చెల్లించిన వారంతా ప్రస్తుతం క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడున్న విలువను లెక్కించి దాంట్లో...గతంలో చెల్లించిన సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తానికి డీడీ తీయాలని అధికారులు చెబుతున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 


వ్యవసాయ భూములకు యూఎల్‌సీ..

గోపాలపట్నం తహసీల్దార్‌ కార్యాలయ పరిధిలోని కొత్తపాలెం, ఎల్లపువానిపాలెం, పొర్లుపాలెం, పుల్లంబట్లపాలెం, గాజువాక పరిధిలో ఫకీర్‌తకియా, పెందుర్తి పరిధిలోని కొన్ని గ్రామాల్లో వ్యవసాయ భూములు యూఎల్‌సీలో వున్నట్టు గుర్తించారు. ఈ భూములను క్రమబద్ధీకరించుకోవాలంటే రూ.కోట్లలో చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 


దశాబ్దాల కిందటి ఇళ్లకు ఇప్పుడు నోటీసులా

గగ్గోలు పెడుతున్న జనం

గోపాలపట్నం, మార్చి 4: గోపాలపట్నంలోని 91వ వార్డు పరిధిలో గల సర్వే నంబర్‌ 1/2లో సుమారు 35 ఎకరాల యూఎల్‌సీ భూమి ఆక్రమణకు గురైనట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ సర్వే నంబర్‌ పరిధిలోని రామకృష్ణానగర్‌ ప్రాంతంలో 217 మందికి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. దశాబ్దాల క్రితం నాటి ఇళ్లకు ఇప్పుడు నగదు చెల్లించమని నోటీసులు జారీ చేయడంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


పాతికేళ్ల క్రితం ఇల్లు కొన్నాం

మేం పాతికేళ్ల క్రితం ఇల్లు కొన్నాం. ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి ఇది ఆక్రమించిన స్థలం మీరు డబ్బులు కట్టాలని చెబితే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. పూట గడవడమే కష్టంగా ఉంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా చెల్లించాలి.

- కరణం మణి


దిక్కుతోచని స్థితిలో ఉన్నాం

ఇరవై సంవత్సరాల క్రితమే ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు మళ్లీ ఇంటి కోసం డబ్బులు కట్టమని నోటీసులు ఇస్తే ఏం చేయాలో పాలుపోవడం లేదు. కూలి పని చేసుకునే మాకు కుటుంబం గడవటమే కష్టంగా ఉంటే ఇల్లు కోసం మళ్లీ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలి? ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి.

- గిరడ లక్ష్మి

Updated Date - 2022-03-05T06:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising