డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి ఆకస్మిక బదిలీ
ABN, First Publish Date - 2022-12-03T00:54:55+05:30
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ విజయలక్ష్మిని ప్రభుత్వం శుక్రవారం ఆకస్మికంగా బదిలీ చేసింది.
గుంటూరు రీజనల్ ల్యాబ్‌కు పంపుతూ ఉత్తర్వులు
నియామకాలు, పదోన్నతుల్లో ఫిర్యాదులే స్థాన చలనానికి కారణం?
కొత్త డీఎంఅండ్‌హెచ్‌వోగా డాక్టర్ జగదీశ్వరరావు
విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ విజయలక్ష్మిని ప్రభుత్వం శుక్రవారం ఆకస్మికంగా బదిలీ చేసింది. సుమారు ఏడాది కాలంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణిగా పనిచేస్తున్న ఆమెను గుంటూరులోని రీజనల్ ల్యాబ్‌కు బదిలీ చేసినట్టు సమాచారం. ఆరోగ్య శాఖ పరిధిలో జరిగిన నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆమెపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో బదిలీ వేటు పడిందని తెలిసింది. రెండు రోజుల కిందట ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ సిబ్బంది సోదాలు జరపడం, తాజాగా డీఎంహెచ్‌వోపై బదిలీ వేటు పడడంతో ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ పి.జగదీశ్వరరావును నియమిస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం కె.కోటపాడు పీహెచ్‌సీలో పీడియాట్రిక్ స్పెషలిస్టుగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ...జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా నియామకం కావడం ఆనందంగా ఉందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషిచేస్తానన్నారు. అవినీతి, అడ్డగోలు వ్యవహారాలకు తాను దూరంగా ఉండడంతోపాటు సిబ్బంది వుండేలా చేస్తానన్నారు. తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చిన అనంతరం బాధ్యతలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు.
ఇదీ వృత్తి జీవితం
డాక్టర్ జగదీశ్వరరావు 1996లో నర్సీపట్నంలో మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 2003 వరకు అక్కడ విధులు నిర్వర్తించారు. 2003-05 మధ్య పెందుర్తి, 2005-2007 వరకు రీజనల్ ల్యాబ్‌లో పనిచేశారు. 2007-09 మధ్యకాలంలో పీజీ (పీడియాట్రిక్) చేశారు. ఆ తరువాత డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పదోన్నతిపై ఇచ్ఛాపురం పీహెచ్‌సీకి వెళ్లారు. అనంతరం విశాఖలోని సెంట్రల్ జైలులో రెండున్నరేళ్లు, 20015-16 మధ్య చోడవరంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేశారు. 2016లో డిప్యుటేషన్‌పై గోపాలపట్నం వచ్చి 2022 వరకు పనిచేశారు. డిప్యుటేషన్లు రద్దు చేయడంతో సెప్టెంబరులో చోడవరం పీహెచ్‌సీకి వెళ్లారు. వైద్య, ఆరోగ్యశాఖ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా సెప్టెంబరులో కె.కోటపాడు పీహెచ్‌సీ వెళ్లిన ఆయన తాజాగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా నియమితులయ్యారు.
Updated Date - 2022-12-03T00:54:56+05:30 IST