ముంగిట్లో మట్టి నమూనా పరీక్షలు
ABN, First Publish Date - 2022-10-07T06:06:08+05:30
జిల్లా రైతులకు మట్టి నమూనా, సాగునీటి పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి.
- చింతపల్లిలో రీసెర్చ్ కాంప్లెక్స్, ల్యాబ్ ప్రారంభంతో తీరిన కష్టాలు
- అనకాపల్లి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సేవలు
చింతపల్లి, అక్టోబరు 6:
జిల్లా రైతులకు మట్టి నమూనా, సాగునీటి పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ సేవలు అందుబాటులోకి రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పాడేరు డివిజన్ పరిధిలోని మట్టి నమూనా, సాగునీటి పరీక్షలు అనకాపల్లి రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించేవారు. ఇప్పుడు చింతపల్లిలో రీసెర్చ్ కాంప్లెక్స్, ల్యాబ్ ప్రారంభంకావడంతో జిల్లా రైతుల కష్టాలు తీరాయి.
---
చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నూతనంగా నిర్మించిన రీసెర్చ్ కాంప్లెక్స్, ల్యాబ్‌ను ఇటీవల ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాయం అధికారులు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. దీంతో స్థానిక శాస్త్రవేత్తలు మట్టి నమూనా(భూసారం), సాగునీరు పరీక్షలను ఐదు రోజుల క్రితం ప్రారంభించారు. ఆదివాసీ రైతులు వ్యవసాయంలో రాణించేందుకు అవసరమైన పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని 2018లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అధికారులు అత్యాధునిక రీసెర్చ్ కాంప్లెక్స్, ల్యాబ్ నిర్మాణానికి రూ.కోటి నిధులను చింతపల్లి పరిశోధన స్థానానికి మంజూరుచేసిన విషయం తెలిసిందే. ఏడాది కిందట ల్యాబ్ నిర్మాణం పూర్తి కావడంతో విశ్వవిద్యాలయం అధికారులు తాజాగా రూ.50లక్షల విలువైన వివిధ పరీక్షలు నిర్వహించే యంత్రసామగ్రిని మంజూరుచేయడంతో శాస్త్రవేత్తలు ఇన్స్టాల్ చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లో కేవలం ఎరువులు, విత్తనాలకు సంబంధించి పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. రైతులకు అత్యంత అవసరమైన భూసారం, సాగునీరు పరీక్షలు నిర్వహించడం లేదు. ఇప్పటి వరకు పాడేరు డివిజన్ పరిధిలోని మట్టి నమూనాల భూసారం, సాగునీటి పరీక్షలు అనకాపల్లి రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. అయితే చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో భూసారం, సాగునీటి పరీక్షలు అందుబాటులోకి రావడంతో జిల్లా రైతులకు సంబంధించిన పరీక్షలు చింతపల్లిలోనే నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. పరిశోధన స్థానంలో అందుబాటులోకి వచ్చిన ల్యాబ్‌ను జిల్లా వ్యవసాయశాఖ, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో రైతుల మట్టి నమూనాల భూసారం, సాగునీటి పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తే సకాలంలో ఫలితాలు అందించే అవకాశం ఉంటుంది.
భూసార పరీక్షల ఫలితాలు
పరిశోధన స్థానంలో నిర్వహించే భూసార పరీక్షల్లో ఆరు రకాల ప్రధాన ఫలితాలను శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. భూమి(మట్టి)లోని ఉదజని సూచిక(పీహెచ్) లవణ సాంద్రత(ఈసీ), సేంద్రియ కర్బనం(ఓసీ శాతం), నత్రజని లభ్యత(కేజీ/హెక్టారు), భాస్వరం లభ్యత(కేజీ/హెక్టార్), పొటాషియం లభ్యత(కేజీ/హెక్టారు) ఫలితాలను అందజేస్తున్నారు.
సాగునీటి ఫలితాలు
సాగునీటిలో ప్రధానమైన పది రకాల ఫలితాలను పరీక్షించి శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. ఉదజని సూచిక(పీహెచ్), లవణ సాంద్రత(ఈసీ), సోడియం(ఎంఈ(మిల్లీలీటర్ ఈక్వలెంట్)/లీటర్), పొటాషియం(ఎంఈ/లీటర్), కాల్షియం(ఎంఈ/లీటర్), మెగ్నీషియం(ఎంఈ/లీటర్), కార్బొనేట్స్(ఎంఈ/ లీటర్), బైకార్బోనేట్స్(ఎంఈ/లీటర్), క్లోరైడ్(ఎంఈ/లీటర్), సోడియం ఎడ్సప్సిన్ రేషియో(ఎంఈ/లీటర్) ఫలితాలను వెల్లడిస్తున్నారు.
ధరలు ఇలా..
భూసారం, సాగునీటి పరీక్షలకు విశ్వవిద్యాలయం వేర్వేరు ధరలను నిర్ణయించింది. భూసార పరీక్ష ఒక మట్టి నమూనాకు రూ.300, సాగునీరు ఒక నమూనాకు రూ.250 నామమాత్రపు ధరను నిర్ణయించారు. రైతులు మట్టి నమూనా, సాగునీటి పరీక్షలు చేయించుకునేందుకు విశ్వవిద్యాలయం నిర్ణయించిన ధరలు చెల్లించాలి.
---------
ల్యాబ్ సేవలను వినియోగించుకోవాలి (ఫొటో- 6సీటీపీ5)
పరిశోధన స్థానంలో అందుబాటులోకి వచ్చిన ల్యాబ్ సేవలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంట పొలాల్లో మట్టిని పరీక్షించడం వల్ల నేలలోని పోషకాల లోపం తెలుస్తుంది. దీంతో పంటకు అవసరమైన పోషకాలను ఎరువుల రూపంలో అందించుకోవడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. సాగునీటి పరీక్షలు కూడా చేయించుకోవడం మంచిది.
- ఎం.సురేశ్‌కుమార్, ఏడీఆర్, చింతపల్లి
Updated Date - 2022-10-07T06:06:08+05:30 IST