శిశు మృత్యు ఘోష
ABN, First Publish Date - 2022-12-16T01:03:22+05:30
మన్యంలో శిశు మరణాలు అరికట్టడడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో మాతాశిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పాలకులు చెబుతున్న మాటలకు... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు కనీసం పొంతన ఉండడం లేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందిని కలెక్టర్ పలుమార్లు హెచ్చరించినా సేవలు మెరుగుపడడం లేదు. ఫలితంగా శిశు మరణాలు ఆగడం లేదు.
- మన్యంలో కొనసాగుతున్న చిన్నారుల మరణాలు
- తాజాగా జి.మాడుగుల మండలంలో మూడు రోజుల్లో ముగ్గురు మృతి
- వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సేవల్లో లోపం
- కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
- ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 280 మంది మృత్యువాత
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో శిశు మరణాలు అరికట్టడడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో మాతాశిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పాలకులు చెబుతున్న మాటలకు... క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు కనీసం పొంతన ఉండడం లేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందిని కలెక్టర్ పలుమార్లు హెచ్చరించినా సేవలు మెరుగుపడడం లేదు. ఫలితంగా శిశు మరణాలు ఆగడం లేదు.
ప్రతి ఏడాది ఏజెన్సీలో 350 మంది శిశువులు మృతి చెందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు 280 మంది శిశువులు వివిధ అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడ్డారు. తాజాగా మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సోమవారం జి.మాడుగుల మండలం బీరంపంచాయతీ వనల్భ గ్రామానికి చెందిన రవిబాబు, మణిల మూడు నెలల మగ శిశువు, గెమ్మెలి పంచాయతీ కూనేటి గ్రామానికి చెందిన నాగేశ్వరావు, మత్స్యకొండమ్మకు పుట్టిన మూడు నెలల మరో మగ శిశువు ప్రాణాలు కోల్పోయారు. దీనిని మరవక ముందే బుధవారం గెమ్మెలి పంచాయతీ వరిగెలపాలం గ్రామానికి చెందిన మాతే రవి, సోమలమ్మ రెండో సంతానంగా పుట్టిన మూడు నెలల మగ శిశువు మృతి చెందింది. తాజా ఘటనలతో మన్యంలో శిశు మరణాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. గిరిజన ప్రాంతంలో మాతాశిశు మరణాల నివారణకు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ పదే పదే చెబుతున్న మాటలు వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ అఽధికారుల చెవికి ఎక్కడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
మారుమూల ప్రాంతాల్లో సేవల్లో డొల్లతనం
ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లోని వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సేవల్లో డొల్లతనమే శిశు మరణాలకు కారణమనే వాదన వినిపిస్తున్నది. పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో పెద్దాస్పత్రులు, పదకొండు మండలాల్లో మరో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అరకులోయ, చింతపల్లి, పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో గర్భిణుల వసతి గృహాలున్నాయి. అయినప్పటికీ మారుమూల ప్రాంత గర్భిణులను గుర్తించి, వారికి సకాలంలో ఆస్పత్రులకు చేర్పించి, సుఖ ప్రసవం చేయించలేకపోవడం గమనార్హం. గర్భిణులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందించకపోవడం వల్లే శిశుమరణాలు చోటు చేసుకుంటున్నాయనే మర్మం తెలుసుకున్న అధికారులు, ఈ సమస్యను పరిష్కరించేందుకు మెరుగైన సేవలు అందించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఫలితంగా ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో నేటికీ శిశు మరణాలు జరగుతున్నాయని తెలుస్తున్నది.
జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
ఈ ఏడాది జూలై నెలలో ఏజెన్సీలో పెదబయలు మండలం రూడకోట, హుకుంపేట మండలం సూకూరు ప్రాంతాల్లో, సెప్టెంబరు నెలలో హుకుంపేట మండలం గడుగుపల్లి పంచాయతీ పరిధిలో శిశు మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ అప్పట్లో స్పందించారు. వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ అధికారులతో పలు మార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, మన్యంలో మాతా శిశు మరణాలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ అధికారులు కలెక్టర్ ఆదేశాలను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఫలితంగా మన్యంలో నిత్యం ఏదో ఒక చోట శిశు మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే శిశు మరణాల జరిగినప్పుడు వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ అధికారులు హడావుడి చేసి, ఆ శిశువుల మృతికి తమ వైఫల్యం కాదని అధికారికంగా విచారణ నివేదికలు సమర్పిస్తూ తమ పనైపోయిందనిపించుకుంటున్నారు. దీంతో శిశు మరణాలను అరికట్టేందుకు వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోగా, వాటిని సీరియస్‌గా తీసుకోని దుస్థితి కొనసాగుతున్నది. దీని వల్ల మన్యంలో శిశు మరణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సేవలు పటిష్ఠంగా అంతనంత కాలం మాతా శిశు మరణాలు జరుగుతూనే ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
శిశు మరణాల నివారణకు ఇలా చేస్తే మేలు
- ఏజెన్సీ ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులు, చిన్నపిల్లల నిపుణుల సేవలు పెరగాలి.
- గ్రామాల్లోని గర్భిణులను పక్కాగా గుర్తించి, ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయాలి.
- గర్భిణులకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం సకాలంలో అందించాలి.
- శిశువులకు వ్యాక్సినేషన్, ఇతర వైద్య సేవలు అందించాలి.
- బాలింతలకు మెరుగైన వైద్యం, వైద్య సిబ్బంది పర్యవేక్షణ పెంచాలి.
- వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ సేవలు మరింతగా మెరుగుపరచాలి.
- గ్రామ స్థాయిలో ఉండే ఆశ కార్యకర్తల వ్యవస్థను బలోపేతం చేయాలి.
-------------
మన్యంలో గత ఐదేళ్లుగా జరిగిన శిశు మరణాలు
సంవత్సరం శిశు మరణాలు
2018- 19 350
2019- 20 321
2020- 21 351
2021- 22 328
2022- 23 280(డిసెంబరు వరకు)
Updated Date - 2022-12-16T01:03:23+05:30 IST