ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అతిథి గృహానికి మోక్షమెన్నడో!

ABN, First Publish Date - 2022-09-13T06:17:43+05:30

చింతపల్లిలో సుమారు యాభై ఏళ్ల క్రితం నిర్మించిన ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహాన్ని 15 ఏళ్ల కిందట సీపీఐ మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో నాటి భవనం పూర్తిగా శిథిలమైపోయింది.

ప్రారంభానికి నోచుకోని ఆర్‌అండ్‌బీ నూతన అతిథి గృహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్‌ అండ్‌ బీ నూతన అతిథి గృహ నిర్మాణానికి శ్రీకారం

పనులు పూర్తయినా బిల్లులు మంజూరు చేయని ప్రస్తుత ప్రభుత్వం

అధికారులకు అప్పగించని కాంట్రాక్టర్‌

ఏడాది గడిచినా ప్రారంభానికి నోచుకోని వైనం


చింతపల్లి వచ్చే వీఐపీలు, అతిథులకు ఆశ్రయం కరువైంది. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం శిథిలావస్థకు చేరడంతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు నూతన అతిథి గృహ నిర్మాణం చేపట్టారు. పనులు పూర్తయినా వైసీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయక పోవడంతో కాంట్రాక్టర్‌ దానిని అప్పగించలేదు. దీంతో ఏడాది గడిచినా ఆ అతిథి గృహం ప్రారంభానికి నోచుకోలేదు.


చింతపల్లి, సెప్టెంబరు 12: చింతపల్లిలో సుమారు యాభై ఏళ్ల క్రితం నిర్మించిన ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహాన్ని 15 ఏళ్ల కిందట సీపీఐ మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో నాటి భవనం పూర్తిగా శిథిలమైపోయింది. చింతపల్లి సబ్‌ డివిజన్‌ కేంద్రం కావడంతో అతిథులకు అత్యాధునిక సదుపాయాలతో ఆశ్రయం కల్పించేందుకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆర్‌ అండ్‌ బీ నూతన అతిథి గృహం నిర్మాణానికి 2018లో రూ.కోటి గిరిజన ఉప ప్రణాళిక నిధులను మంజూరుచేసింది. టెండర్‌ ద్వారా నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌ 2020-21నాటికి భవన నిర్మాణాలు పూర్తిచేశారు. ప్రస్తుతం అతిథి గృహానికి ఫర్నిచర్‌ సదుపాయం మాత్రమే కల్పించాలి. అయితే 2019 ఎన్నికలు తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అతిథి గృహం నిర్మాణానికి సంబంధించి ఒక్క బిల్లు కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఏడాది కాలంగా అతిథి గృహం నిర్మించిన కాంట్రాక్టర్‌ అర్‌ అండ్‌ బీ అధికారుల ద్వారా పలుమార్లు ఉన్నతాధికారులకు నిధులు విడుదల చేయాలని కోరినప్పటికి కనీస స్పందన లభించడంలేదు. దీంతో ఈ అతిథి గృహాన్ని కాంట్రాక్టర్‌ సంబంధితశాఖ అధికారులకు అప్పగించలేదు. అప్పటి నుంచి ఈ అతిథి గృహం అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది.  


అతిథులకు ఆశ్రయం కరువు

చింతపల్లి సబ్‌ డివిజన్‌ కేంద్రంలో అతిథులకు ఆశ్రయం లేకుండాపోయింది. వీఐపీలకు ఆశ్రయం కల్పించే ఏపీఎఫ్‌డీసీ అతిథి గృహాన్ని సంబంధితశాఖ రీజనల్‌ మేనేజర్‌ క్యాంప్‌ కార్యాలయంగా మార్చేశారు. జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో ఫర్నిచర్‌, మరుగుదొడ్లు, రన్నింగ్‌ వాటర్‌ సదుపాయంలేక అతిథులకు దూరమైంది. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం నిర్మాణాలు పూర్తయినా కాంట్రాక్టర్‌కి బిల్లులు చెల్లించకపోవడం వల్ల వినియోగంలోకి రాలేదు. దీని వల్ల  వీఐపీలు చింతపల్లిలో బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే పోలీసు అతిథి గృహాన్ని ఉపయోగిస్తున్నారు. పోలీసు అతిథి గృహం అందరికీ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో చింతపల్లిలో బస చేయాలని వచ్చిన వీఐపీలు, ప్రజాప్రతినిధులు, పర్యాటకులు సైతం సాయంత్రం కాగానే మైదాన ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. నూతన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి సబ్‌ డివిజన్‌ ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. దీంతో వీఐపీల సందర్శనలు అధికంగా ఉంటాయి. తాజాగా చింతపల్లి వచ్చిన కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, కిషన్‌రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.రాజన్నదొరలు సేదతీరడానికి సరైన అతిథి గృహం లేకుండాపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో ప్రయాణం చేసి వచ్చిన మంత్రులు పోలీసు అతిథి గృహాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆర్‌ అండ్‌ బీ నూతన భవనం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-09-13T06:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising