ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ సేవలు అస్తవ్యస్తం

ABN, First Publish Date - 2022-12-15T00:13:46+05:30

మన్యంలో రెవెన్యూ సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఐదు నెలలుగా తహసీల్దార్‌ పోస్టు ఖాళీగా ఉన్న పాడేరు కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన్యంలో తహసీల్దార్‌ పోస్టులు సగం ఖాళీ

జిల్లా కేంద్రం పాడేరులో ఐదు నెలలుగా తహసీల్దార్‌ లేని దుస్థితి

కలెక్టర్‌ డుంబ్రిగుడ పర్యటనలో బయటపడ్డ రెవెన్యూ డొల్లతనం

కొత్త జిల్లా ఏర్పడినా మెరుగుపడని సేవలు

సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో రెవెన్యూ సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్‌ జరిపిన అనేక సమీక్షలతో పాటు తాజాగా డుంబ్రిగుడ మండలం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలోనూ వాస్తవ పరిస్థితులు బయటపడ్డాయి. ప్రధానంగా ఏజెన్సీలో పదకొండు మండలాలకు గానూ సగానికి పైగా తహసీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉండడం, అవన్నీ ఇన్‌చార్జుల ఏలుబడిలో కొనసాగుతుండడంతో రెవెన్యూ పాలన గాడి తప్పుతున్నదని తెలుస్తున్నది. అలాగే మన్యంలోని రెవెన్యూ వ్యవస్థపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తున్నది. కొత్తగా జిల్లా ఏర్పడడం, సబ్‌కలెక్టర్‌ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ ప్రక్రియలో నిమగ్నం కావడంతో రెవెన్యూ వ్యవస్థపై పర్యవేక్షణ లేమి కొనసాగుతున్నది.

జిల్లా కేంద్రానికి సంబంధించిన పాడేరు డివిజన్‌ పరిధిలో సగానికి పైగా తహసీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉండడమే ఇక్కడ డొల్లతనానికి నిదర్శనం. ఏజెన్సీలో మొత్తం పదకొండు మండలాలకు గానూ అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, చింతపల్లి, కొయ్యూరు, డుంబ్రిగుడ మండలాల్లో మాత్రమే రెగ్యులర్‌ తహసీల్దార్లు ఉన్నారు. మిగతా ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకే వీధి, పాడేరు మండలాలకు తహసీల్దార్లు లేరు. దీంతో ఆ ఐదు మండలాలకు ఇన్‌చార్జి తహసీల్దార్లే పని చేస్తున్నారు. వీరి ఆదేశాలను కింది స్థాయి అధికారులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోరనే ప్రచారం జోరుగా సాగుతున్నది. భౌగోళికంగా అధిక విస్తీర్ణంతో పాటు అధిక సంఖ్యలో గ్రామాలుండే గిరిజన ప్రాంతంలో సగం మంది తహసీల్దార్లు లేకుండా రెవెన్యూ పరమైన సేవలు అందడం అసాధ్యం. వాస్తవానికి గిరిజనులకు రెవెన్యూ సేవలు అందించాలని జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, గిరిజనులకు రెవెన్యూ సేవలు చేరువ చేయాల్సి ఉండగా, ఇక్కడ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. ప్రతి శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో అనేక సమస్యలపై రెవెన్యూ శాఖకు చెందినవే పదే పదే ఫిర్యాదులు అందుతుంటాయి. వాస్తవానికి మండల స్థాయిలోనే పరిష్కరించాల్సిన సమస్యను సైతం అక్కడ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో బాధితులు శుక్రవారం స్పందన కార్యక్రమానికి బారులు తీరుతున్నారు. గ్రామ స్థాయిలో సచివాలయాల్లోనే సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పదే పదే చెబుతున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. కాగా మంగళవారం డుంబ్రిగుడ తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు ఉద్యోగుల హాజరుపై స్పష్టత వచ్చింది. గతంలో జి.మాడుగుల తహసీల్దార్‌ కార్యాలయంలో ఇదే పరిస్థితి కొనసాగడంతో సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌ అక్కడ తహసీల్దార్‌ను కలెక్టరేట్‌కు సరెండర్‌ చేశారు. ఇలా ఏజెన్సీలో అనేక మండలాల్లో రెవెన్యూ యంత్రాంగం సక్రమంగా లేని పరిస్థితి కొనసాగుతున్నది.

ఐదు నెలలుగా పోస్టు ఖాళీ

జిల్లా కేంద్రం పాడేరులోనే గత ఐదు నెలలుగా తహసీల్దార్‌ పోస్టు ఖాళీగా ఉండడం మన్యంలో రెవెన్యూ వ్యవస్థ పరిస్థితికి అద్దం పడుతున్నది. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడంతో పాడేరు తహసీల్దార్‌ పోస్టు అన్ని విధాలా చాలా కీలకం. ఒక వైపు జిల్లా కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి, సబ్‌కలెక్టర్‌కు తలలో నాలుకలా ఉండాల్సిన పరిస్థితి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ పోస్టు ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేసిన తహసీల్దార్‌కు పరవాడ బదిలీ కాగా, అక్కడి నుంచి మరొకర్ని ఇక్కడికి నియమిస్తే పైరవీలు సాగించుకుని విధుల్లో చేరలేదు. దీంతో చేసేది లేక డుంబ్రిగుడలోని తహసీల్దార్‌ను పాడేరుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి, అక్కడ డిప్యూటీ తహసీల్దార్‌కే డుంబ్రిగుడ తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో గత ఐదు నెలలుగా స్థానిక తహసీల్దార్‌ పోస్టు ఇన్‌చార్జి పాలనలోనే కొనసాగుతున్నది.

రెవెన్యూ వ్యవస్థ గాడిన పడాలంటే..

- జిల్లా కలెక్టర్‌, జేసీ, సబ్‌కలెక్టర్‌ స్థాయి అధికారులు ప్రతి మండలంపై సంపూర్ణ పట్టు సాధించాలి.

- ప్రతి మండలంలో తహసీల్దార్‌తోసహా అన్ని పోస్టులను భర్తీ చేయాలి.

- పంచాయతీ స్థాయిలో రెవెన్యూ సేవలు అందుతున్న తీరును అధికారులు పర్యవేక్షించాలి.

- మండల స్థాయిలోనే స్పందన నిర్వహించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి.

- కట్టుతప్పుతున్న రెవెన్యూ అధికారులు, సిబ్బందిపైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి.

- రెవెన్యూ కార్యాలయాల్లో ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేలా అలవాటు చేయాలి.

- దీర్ఘకాలంగా మైదాన ప్రాంతాలకే పరిమితమవుతున్న అధికారులు, సిబ్బందిని మన్యంలోనూ నియమించాలి.

Updated Date - 2022-12-15T00:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising