నివేదికలు బుట్టదాఖలేనా!?
ABN, First Publish Date - 2022-08-04T07:06:12+05:30
అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో తరచూ విషవాయువు వెలువడుతున్నప్పటికీ యాజమాన్యంపై సత్వర చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నారు.
‘సీడ్స్’ కంపెనీలో రెండు నెలల క్రితం తొలిసారి విషవాయువు లీక్
వందలాది మంది మహిళా కార్మికులకు తీవ్రఅస్వస్థత
విచారణ జరిపి నివేదిక ఇచ్చిన కమిటీ
నెల రోజుల క్రితం కంపెనీకి నోటీసులు
వివరణ ఇవ్వడానికి రెండు నెలలు గడువు
ఈలోగానే మరోసారి విషవాయువు లీక్
‘సీడ్స్’పై చర్యలకు మీనమేషాలు
ప్రతిపక్షాల ఆరోపణ
(అచ్యుతాపురం, అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో తరచూ విషవాయువు వెలువడుతున్నప్పటికీ యాజమాన్యంపై సత్వర చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నారు. రెండు నెలల క్రితం గ్యాస్ లీకైన ఘటనలో వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం, కమిటీ నివేదిక అందజేయడం జరిగింది. దీని ఆధారంగా యాజమాన్యానికి సుమారు నెల రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. రెండు నెలల్లో సమాధానం ఇవ్వకుంటే ప్రాసిక్యూట్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే అంతకుముందే కంపెనీలో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జూన్ 3న సీడ్స్ విభాగంలో గ్యాస్ లీక్ సంఘటన మరువకముందే మళ్లీ ఈ నెల 2న అదే తరహాలో విషవాయువు వెలువడి, 200 మంది వరకు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. కానీ తొలుత విషవాయువు వెలువడిన ఘటనపై విచారణ జరిపించిన ప్రభుత్వం, నివేదికను ఇంతవరకు బహిర్గతం చేయకపోవడం పలుఅనుమానాలకు తావిస్తున్నది. విషవాయువు కారణంగా వందలాది మంది తీవ్రఅస్వస్థతకు గురైతే, సీడ్స్ కంపెనీకి కేవలం నోటీసులు ఇచ్చిచేతులు దులుపుకోవడం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సీడ్స్ కంపెనీలో తప్పు మీద తప్పు జరుగుతున్నా.. పాలక పెద్దల్లో చలనం రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కార్మికులు ప్రాణాలు కోల్పోతే తప్ప కఠిన చర్యలు తీసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు.
మంత్రి వచ్చారు... వెళ్లారు...
అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో విషవాయుడు లీకైన రెండు సందర్భాల్లోనూ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వచ్చి పరిశీలించారు. ఘటనకు సంబంధించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. జూన్ 3న గ్యాస్‌లీకైన తరువాత సీడ్స్ కంపెనీని సందర్శించిన ఆయన... ఈ ఘటనపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు చేపడతామని ప్రకటించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి శాంపిల్స్ పంపారు. అనకాపల్లి జేసీ కల్పన కుమారి నేతృత్వంలో జాయింట్ కమిటీని విచారణకు నియమించారు. ఐఐసీటీ నివేదిక వచ్చింది. కమిటీ నివేదిక సీల్డ్ కవరులో కలెక్టరు రవి పట్టన్‌శెట్టికి అందజేశారు. రెండు నెలలు దాటిపోతున్నా ప్రమాదం ఎందుకు జరిగిందో విరాలు వెల్లడించలేదు. సీల్డ్ కవరు ప్రభుత్వానికి పంపామని ప్రభుత్వ పెద్దలు వివరాలు వెల్లడిస్తారని అధికారులు చెబుతున్నారు. రెండు నెలలు తిరగకుండానే సీడ్స్ కంపెనీలో మళ్లీ విషవాయువు వెలువడింది. రెండు వందల మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ బుధవారం ఉదయం ఎన్టీఆర్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. సాయంత్రం సీడ్స్ విభాగాన్ని పరిశీలించారు. గ్యాస్ లీక్‌కు కారణాలను వెంటనే తెలియజేయాలని గతంలో మాదిరిగానే అధికారులను ఆదేశించారు. ఈసారి కూడా శాంపిల్స్‌ను సేకరించి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి పంపాలని సూచించారు.
సీడ్స్ మూసివేత...
గతంలో సంఘటన జరిగిన తరువాత రెండు మూడు రోజులకే సీడ్స్ కంపెనీ తెరవడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అనుమతులు ఇచ్చారు. కానీ ఈసారి నివేదిక వచ్చే వరకు సీడ్స్ విభాగాన్ని తెరిచేది లేదని మంత్రి స్పష్టం చేయడం కొసమెరుపు.
Updated Date - 2022-08-04T07:06:12+05:30 IST