మాడుగులలో అభివృద్ధిపై తేల్చుకుందాం రా..
ABN, First Publish Date - 2022-10-17T07:00:41+05:30
తాను ఎమ్మెల్యేగా 2009లో గెలిచిన నాటి నుంచి 2019వ సంవత్సరం వరకూ మాడుగుల నియోజకవర్గంలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో తేల్చుకునేందుకు సిద్ధమా అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రశ్నించారు.
ఇద్దరం కలిసి గ్రామాలకు వెళదాం..
ఎవరెంత అభివృద్ధి చేశారో తేలుద్దాం..
ఉప ముఖ్యమంత్రి బూడికి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి సవాల్
చీడికాడ, అక్టోబరు 16: తాను ఎమ్మెల్యేగా 2009లో గెలిచిన నాటి నుంచి 2019వ సంవత్సరం వరకూ మాడుగుల నియోజకవర్గంలో ఎవరు ఎంత అభివృద్ధి చేశారో తేల్చుకునేందుకు సిద్ధమా అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రశ్నించారు. ఆదివారం అప్పలరాజుపురం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా గెలిచిననాటి నుంచి 2019 వరకూ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి ఎంతో అభివృద్ధి చేశానన్నారు. దేవరాపల్లి- ఆనందపురం రోడ్డుకు రూ.పది కోట్లు మంజూరు చేయిస్తే ఇప్పటికీ పూర్తి చేయించలేదన్నారు. కలిగొట్ల బ్రిడ్జి నిర్మాణానికి టీడీపీ హయాంలో నిధులు మంజూరు చేయించి 90 శాతం పనులు పూర్తి చేయిస్తే మిగిలిన పనులు ఎందుకు చేయించలేకపోయారని ప్రశ్నించారు. అలాగే మాడుగుల మండలం పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి, పలు రోడ్లును తారురోడ్లుగా చేయించడానికి కోట్లాది రూపాయలు మంజూరు చేయించానన్నారు. 2019లో ఎన్నికలు జరగడంతో అవి 50 శాతం పూర్తయి మిగతా పనులు నిలిచిపోయాయన్నారు. పంచాయతీరాజ్, గ్రామీనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న మీరు పంచాయతీలకు రావలసిన 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకుంటే మీరు ఎందుకు ప్రశ్నించలేదని బూడిని ప్రశ్నించారు. జి.కొత్తపల్లి నుంచి చీడికాడ వరకూ రోడ్డుకు ఇంతవరకూ నిధులు ఎందుకు మంజూరు చేయించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నిస్తే ఆయనపై లేనిపోని ఆరోపణలు ఏవిధంగా చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు అందరూ సంఘీభావం తెలపాలని, ఎవరైనా అడ్డుకునేందుకు వస్తే అవసరమైతే చితకబాదేందుకు సిద్ధంగా ఉండాలని రామానాయుడు పిలుపునిచ్చారు. 2024లో చంద్రబాబుని సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతల చిన్నంనాయుడు, బొబ్బాది తాతారావు, మాజీ ఎంపీపీ పోతల రమణమ్మ, టీడీపీ నాయకులు గండి ముసలినాయుడు, బీళ్ల కోటేశ్వరరావు, దారపు పెద్దినాయుడు, పైల ముత్యాలనాయుడు, దాడి ప్రసాద్, శరగడం శివ, పంచాడ దాలెంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T07:00:41+05:30 IST