బీజేపీ హయాంలో పారిశ్రామికాభివృద్ధి అధోగతి
ABN, First Publish Date - 2022-08-04T06:56:03+05:30
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, సుమారు ఐదు లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, ఆగస్టు 3: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, సుమారు ఐదు లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 538వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపదను, శ్రమ దోపిడీని నివారించడానికి ఐక్య ఉద్యమాలే శరణ్యమన్నారు. కేంద్రంతో ఉక్కు ప్రైవేటీకరణపై చర్చించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రైవేటీకరణపై నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పోరాట కమిటీ నాయకుడు ఎన్.రామారావు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడుతున్న కేంద్రానికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతామన్నారు. ప్రభుత్వ రంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటం దేశభక్తితో కూడిన సమరమని, ఈ పోరాటాన్ని దేశ వ్యాప్త ఉద్యమంగా మలుస్తామన్నారు. నాయకులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, తదితర హామీలను హామీలను విస్మరించిన కేంద్రం ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియతో కార్మికులతో నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. ఏదిఏమైనా స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంధం వెంకటరావు, కె.సత్యనారాయణ, గంగవరం గోపి, వి.ప్రసాద్, బాబా, వైకుంఠం, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T06:56:03+05:30 IST