తాగునీటికి కటకట
ABN, First Publish Date - 2022-11-22T00:02:47+05:30
మండలంలో పంచాయతీ కేంద్రమైన వనభంగిలో తాగునీటికి కటకటలాడుతున్నారు.
వనభంగిలో మూలకు చేరిన గ్రావిటీ నీటి పథకం
అందుబాటులో లేని తాగునీటి వనరులు
ఊటగెడ్డ నీరే ఆధారం
పెదబయలు, నవంబరు 21: మండలంలో పంచాయతీ కేంద్రమైన వనభంగిలో తాగునీటికి కటకటలాడుతున్నారు. సుమారు 300 మంది గిరిజనులు జీవిస్తున్న ఈ గ్రామంలో ప్రస్తుతం ఎటుంటి తాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న ఊటగెడ్డపైనే ఆధారపడుతున్నారు. వనభంగిలో తాగునీటి సమస్యను గుర్తించిన అధికారులు గతంలో సుమారు రూ.25 లక్షల వ్యయంతో గ్రావిటీ నీటి పథకాన్ని సమకూర్చారు. దాని ద్వారా గ్రామంలోకి నీటి సరఫరా జరిగేది. ఈ గ్రావిటీ పథకం క్రమంగా మరమ్మతులకు గురికావడం, కుళాయిలు వేసిన పైపులు విరిగిపోవడం వంటివి జరగడంతో, వాటికి మరమ్మతులు చేయించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గ్రావిటీ నీటి పథకం పూర్తిగా మూలకు చేరింది. ఫలితంగా వనభంగి వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి.
కిలో మీటరు దూరంలోని గెడ్డపైనే ఆధారం
ప్రస్తుతం వనభంగి గ్రామంలో ఎటువంటి తాగునీటి సదుపాయాలు లేకపోవడంతో గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఊటగెడ్డపైనే నీటి కోసం ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో గ్రామంలోని మహిళలంతా ఈ ఊటగెడ్డకు వెళ్లి అవసరమైన నీటిని తోడుకుని బిందెలతో ఇళ్లకు తీసుకు వచ్చి నిల్వ చేస్తున్నారు. తమ గ్రామంలో పాడైన గ్రావిటీ నీటి పథకాన్ని బాగు చేయకపోవడంతోపాటు, అదనంగా మరో తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోని తాగునీటి ఇబ్బందులను తొలగించాలని వనభంగి వాసులు కోరుతున్నారు.
Updated Date - 2022-11-22T00:02:51+05:30 IST