గంజాయి జోరు!
ABN, First Publish Date - 2022-12-15T01:05:48+05:30
ఒకప్పుడు గంజాయి రవాణాకు టాన్సిట్ హాల్ట్గా ముద్రపడిన చోడవరం పట్టణం... కొంతకాలం నుంచి గంజాయి విక్రయ కేంద్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులు కళాశాలల విద్యార్థులను టార్గెట్గా చేసుకుని వారికి గంజాయి అలవాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. గంజాయిని గ్రాముల చొప్పున ప్యాక్ చేసి, ఆయా విద్యా సంస్థల సమీపంలోకి వెళ్లి విక్రయిస్తున్నారు.
చోడవరంలో విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారం
గ్రాముల చొప్పున ప్యాకింగ్ చేసి విక్రయాలు
గంజాయి రవాణాదారులకు కొంతమంది స్థానికులు సహకారం
ఆందోళన చెందుతున్న పట్టణవాసులు
చోడవరం, డిసెంబరు 14: ఒకప్పుడు గంజాయి రవాణాకు టాన్సిట్ హాల్ట్గా ముద్రపడిన చోడవరం పట్టణం... కొంతకాలం నుంచి గంజాయి విక్రయ కేంద్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులు కళాశాలల విద్యార్థులను టార్గెట్గా చేసుకుని వారికి గంజాయి అలవాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. గంజాయిని గ్రాముల చొప్పున ప్యాక్ చేసి, ఆయా విద్యా సంస్థల సమీపంలోకి వెళ్లి విక్రయిస్తున్నారు.
అటు ఏజెన్సీకి, ఇటు మైదాన ప్రాంతానికి మధ్యలో ఉన్న చోడవరం పట్టణం కొద్దికాలం నుంచి గంజాయి విక్రయ కేంద్రంగా మారిందని స్థానికులు అంటున్నారు. గంజాయి విక్రేతలు ప్రత్యేకించి కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఏజెన్సీ నుంచి గంజాయి తెచ్చే వ్యాపారులతో కొంతమంది స్థానికులు పరిచయాలు ఏర్పరచుకుని, వారికి ఆశ్రయం కల్పించడంతోపాటు అనకాపల్లి లేదా విశాఖ నగరానికి గంజాయి తరలింపులో సహకరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇదే సయయంలో స్థానికంగా గంజాయి విక్రయిస్తే మరింత ఆదాయం పొందవచ్చని స్మగ్లర్లు చెప్పడంతో కొద్ది రోజుల నుంచి చాటుమాటుగా ‘గంజాయి రిటైల్ వ్యాపారం’ కూడా చేస్తున్నట్టు తెలిసింది. చుట్టుపక్కల ఐదారు మండలాలకు చోడవరం ప్రధాన కేంద్రం కావడంతో ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు అధికంగా వున్నాయి. ఆయా కళాశాలలు, పాఠశాలల్లో వేలాది మంది చదువుకుంటున్నారు. దీంతో గంజాయి అమ్మకందారులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. కళాశాలల వద్దకు వెళ్లి విద్యార్థులతో మాటామాటా కలిపి, గంజాయి ప్రస్తావన తీసుకువస్తున్నారు. విద్యార్థులు సానుకూలంగా మాట్లాడితే వారికి గంజాయిని అలవాటు చేస్తున్నారు. ఇటీవల పట్టణంలోని ఒక పార్కు వద్ద కొంతమంది విద్యార్థులు బహిరంగంగానే గంజాయి తాగుతుండడాన్ని స్థానికులు గమనించారు. గట్టిగా హెచ్చరించడంతో విద్యార్థులు అక్కడ నుంచి పరారయ్యారు. అలాగే కొత్తూరు జంక్షన్ శివారున ఉన్న ఓ దుకాణం వద్ద కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో యువకులు గంజాయి సేవిస్తున్నారని, ఇందుకు హుక్కాలను వాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇదిలావుండగా కొంత మంది విద్యార్థులు మద్యం సేవించి కళాశాలలకు వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు అధికారులు ఆయా కళాశాలల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కళాశాలల్లో సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ విద్యార్థులు మద్యం సేవించడం ఆపకపోగా, కొత్తగా గంజాయికి కూడా అలవాటు పడినట్టు చెబుతున్నారు. పోలీసులు నిఘా పెంచి గంజాయి విక్రయించే వారిని అరెస్టు చేయాలని, గంజాయికి అలవాటుపడిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, లేకపోతే రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రతరం అవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2022-12-15T01:05:49+05:30 IST