అటవీ శాఖ నిర్లిప్తత!
ABN, First Publish Date - 2022-08-04T07:04:58+05:30
గడచిన నెల రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులిని బంధించే విషయంలో అటవీ శాఖ అధికారులు నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తున్నారని పలు మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తరచూ మకాం మారుస్తున్న పెద్దపులి పాయకరావుపేట నుంచి కె.కోటపాడు వరకు అటవీ ప్రాంతాలకు ఆనుకుని వున్న కొన్నిగ్రామాల్లో పశువులు, మేకలపై పంజా విసిరింది.
నెల రోజుల నుంచి జిల్లా వాసులను భయపెడుతున్న పెద్దపులి
పలుచోట్ల పశువులు, జీవాలపై పంజా
ఆవులు, గేదెలు, మేకలు బలి
ఆందోళన చెందుతున్న ప్రజలు
సీసీ కెమెరాలు, బోన్లు, డ్రోన్ కెమెరాల ఏర్పాటుతో అధికారులు హడావిడి
ఇంతవరకు జిల్లాకు చేరని పెద్ద బోన్లు
పులిని అనంతగిరి అడవుల్లోకి మళ్లించడంలో విఫలం
చోడవరం, ఆగస్టు 3: గడచిన నెల రోజులుగా జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులిని బంధించే విషయంలో అటవీ శాఖ అధికారులు నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తున్నారని పలు మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తరచూ మకాం మారుస్తున్న పెద్దపులి పాయకరావుపేట నుంచి కె.కోటపాడు వరకు అటవీ ప్రాంతాలకు ఆనుకుని వున్న కొన్నిగ్రామాల్లో పశువులు, మేకలపై పంజా విసిరింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళన చెందుతున్నారు. పులి కోసం గాలిస్తున్నామని అటవీ శాఖ అధికారులు తరచూ చెబుతూనే వున్నారు. కానీ పులిని బంధించడానికి అవసరమైన పెద్ద బోన్లను ఇంతవరకు జిల్లాకు రప్పించలేదు... నిపుణులు సైతం రాలేదు... పెద్దపులి జిల్లాను వీడడంలేదు.
కాకినాడ జిల్లా నుంచి జూన్ చివరి వారంలో అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్.. ఈశాన్య దిశగా పయనిస్తూ పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, పెందుర్తి, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ పశువులను పొట్టనపెట్టుకుంటున్నది. రెండు మూడు రోజులకోసారి బయటకు రావడం కల్లాల వద్ద పశువులపై పంజా విసురుతున్నది. గేదెలు, ఆవులు, గేదె పెయ్యిలు, మేకలను చంపి తినేస్తున్నది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పెద్దపులి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వైపు వెళ్లిందని అటవీ శాఖ అధికారులు చెప్పడంతో జిల్లాలోని కె.కోటపాడు, సబ్బవరం, దేవరాపల్లి మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజులు గడవకముందే పెద్ద పులి తిరిగి కె.కోటపాడు మండలం ఆర్లి, చింతలపాలెం గ్రామాల్లోని అటవీ ప్రాంతానికి వచ్చింది. గత ఆదివారం రాత్రి చింతలపాలెం గ్రామానికి చెందిన నంబారు కొండమ్మకు చెందిన పశువులశాలలో ఆవులపై దాడి చేసి చంపేసింది. మరో ఆవుపై దాడి చేయగా అది తప్పించుకుంది. పెద్దపులి కదలికలు కనిపించిన ప్రాంతానికి అటవీశాఖ అధికారులు రావడం, పాదముద్రలు సేకరించడం, పులిని పట్టుకునేందుకు ఒకటి రెండు చోట్ల చిన్నపాటి బోన్లు ఏర్పాటు చేయడం, డ్రోన్ కెమెరాలతో పరిఽశీలన చేయడం, రెస్క్యూ టీములను రంగంలోకి దించడం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించి వెళ్లిపోవడం.. ఆనవాయితీగా మారింది. మత్తు ఇంజెక్షన్లతో పెద్దపులిని బంధించేందుకు షూటర్లను రప్పించామని, బెంగళూరు నుంచి నిపుణుల బృందం వస్తున్నదని, ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద బోన్లు వస్తున్నాయని అటవీ శాఖ ఉన్నతాధికారులు చెప్పడమే తప్ప ఆచరణలో కనిపించడలేదు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అటవీ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన బోను వద్దకు పెద్దపులి వచ్చి వెళ్లిపోయింది తప్ప లోపలకు వెళ్లలేదు. అనకాపల్లి జిల్లాలో అటవీ శాఖ అధికారులు బవులువాడ, గంధవరం, దాలివలస, నల్లకొండ తదితర ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి వద్దకు పెద్దపులి వచ్చిన ఆనవాళ్లు లేవు. దీంతో అటవీ అఽధికారుల ప్రయత్నాలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నది. పెద్దపులి భయంతో చాలామంది రాత్రిళ్లు పశువులను పాకల వద్ద ఉంచడానికి వెనుకాడుతున్నారు. రాత్రి వేళల్లో పాకల వద్ద నిద్రించే రైతులు, ఇప్పుడు ఇళ్ల వద్ద నిద్రించి, తెల్లవారిన తరువాత పాకల వద్దకు వెళుతున్నారు. పెద్దపులి ఇప్పటి వరకు ఎక్కడా మనుషులపై దాడి చేయనప్పటికీ, అటువంటి ప్రమాదం రాకముందే బంధించడం లేదా అనంతగిరి అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని పలుగ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2022-08-04T07:04:58+05:30 IST