ముగిసిన అప్పన్న పాలకమండలి కాలపరిమితి
ABN, First Publish Date - 2022-03-05T06:09:57+05:30
వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుల రెండేళ్ల కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపంలో సభ్యులను దేవస్థానం తరపున ఈవో సూర్యకళ ఘనంగా సత్కరించారు.
సభ్యులను సత్కరించిన ఈవో
సింహాచలం, మార్చి 4: వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుల రెండేళ్ల కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపంలో సభ్యులను దేవస్థానం తరపున ఈవో సూర్యకళ ఘనంగా సత్కరించారు. సభ్యుల కుటుంబాలకు అంతరాలయ దర్శనం కల్పించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు.
అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ స్వామివారి సేవలో తరించినందుకు ఆనందంగా ఉన్నా, తమ పదవీ కాలంలో కొండపై జరిగిన వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు, స్వామివారి నిజరూప దర్శన చందనోత్సవాల్లో భాగస్వాములను కాలేకపోయినందుకు అసంతృప్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు కె.వి.నాగేశ్వరరావు, రాగాల నరసింగరావునాయుడు, రొంగలి పోతన్న, డొంకాడ పద్మావతి, నెమ్మది చంద్రకళ, వాండ్రాసి పార్వతి, సూరిశెట్టి సూరిబాబులను సత్కరించారు.
ఏఈఓ తిరుమలేశ్వరరావు, వై.శ్రీనివాసరావు, కె.కె.రాఘవకుమార్, ఎన్.ఆనందకుమార్, ఎస్.శ్రీనివాసరావు, పలువిభాగాల పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు. కాగా, ఈవో సూర్యకళ బాధ్యతలు చేపట్టి గురువారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా దేవస్థానం ఉద్యోగులు ఆమెను ఘనంగా సత్కరించారు.
Updated Date - 2022-03-05T06:09:57+05:30 IST