దేవరాపల్లి ఆస్పత్రి భవనం శిథిలం
ABN, First Publish Date - 2022-10-07T05:58:11+05:30
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత మండలంలో ప్రభుత్వం ఆస్పత్రి భవనం అధ్వానంగా వుంది.
వర్షంపడితే కారిపోతున్న శ్లాబ్
రోగులు, సిబ్బంది ఇక్కట్లు
ఉప ముఖ్యమంత్రి సొంత మండలంలో దుస్థితి
నాడు-నేడు కింద అభివృద్ధికి ఏడాదిన్న క్రితం రూ.45 లక్షలు మంజూరు
పనులు ప్రారంభించి.. శ్లాబ్ పగలగొట్టి వదిలేసిన కాంట్రాక్టర్
ఏడాది తరువాత బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు
రూ.55 లక్షలతో మళ్లీ టెండర్లు
దేవరాపల్లి, అక్టోబరు 6: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత మండలంలో ప్రభుత్వం ఆస్పత్రి భవనం అధ్వానంగా వుంది. నాడు-నేడు కార్యక్రమం కింద ఏడాదిన్నర క్రితం చేపట్టిన అభివృద్ధి పనులను కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వర్షం పడితే రోగుల వార్డు మినహా మిగిలిన గదులన్నీ నీరు కారిపోతున్నాయి. గచ్చు మొత్తం చిత్తడిగా మారిపోయి రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. వివరాల్లోకి వెళితే...
మండల కేంద్రం దేవరాపల్లిలో ప్రాథమిక ఆస్పత్రికి సుమారు రెండు దశాబ్దాల క్రితం భవనం నిర్మించారు. అయితే పనులు నాసిరకంగా చేయడంతో కొన్నాళ్లకే నాణ్యతాలోపాలు బయటపడ్డాయి. శ్లాబ్ పెచ్చులు ఊడిపోయి వర్షం పడితే నీరు కారుతున్నది. విద్యుత్ వైరింగ్ పాడైపోయింది. దీంతో నాడు-నేడు కార్యక్రమం కింద ఆస్పత్రిని అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాలనాయుడు గత ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.45 లక్షలు మంజూరు చేయించారు. ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ అధికారులకు నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. అతి తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. గత ఏడాది ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు. శ్లాబ్ నుంచి నీరు కారుతుండడంతో కాంక్రీట్ శ్లాబ్‌పై ప్లాస్టరింగ్‌ను తొలగించి వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌తో శ్లాబ్‌ను పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్ శ్లాబ్ పెచ్చులు తీసేశారు. విద్యుత్ వైరింగ్, పైపులు మార్చారు. కాంట్రాక్టర్ ఇంతటితో పనులు ఆపేశారు. ఇది జరిగి సుమారు ఏడాది అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రిలో వార్డు గది తప్ప మిగతా గదులన్నీ వర్షం పడితే కారిపోతున్నాయి. ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్ సైతం కారిపోతుండడంతో కొన్నిసార్లు డెలివరీ కేసులను కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలిస్తున్నారు.
ఆస్పత్రి భవనం పరిస్థితిపై వైద్యాధికారి ఎం.సంధ్యను వివరణ కోరగా, వర్షం పడితే భవనం కారిపోతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. శిథిలమైన ఈ భవనానికి నిధులు ఖర్చు చేసినా పెద్దగా ఉపయోగం వుండదని, నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్టు ఉపముఖ్యమంత్రి తమకు తెలిపారన్నారు.
బ్లాక్‌లిస్టులో కాంట్రాక్టరు
దేవరాపల్లి సీహెచ్‌సీ భవనం మరమ్మతుల టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ను రోడ్లు, భవనాల శాఖ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు. మరమ్మతులు, ఇతర పనులకు రూ.45 లక్షలతో టెండర్లు పిలవగా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌లో అధికారులు అగ్రిమెంట్ చేసుకున్నారు. భవనంపై శ్లాబ్‌ను తవ్వేసి విడిచిపెట్టేశారు. దీంతో వర్షం పడితే భవనం మొత్తం కారిపోతున్నది. పనులు మఽధ్యలో వదిలేసిన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టేసిన అధికారులు, రూ.55 లక్షల అంచనా వ్యయంతో మళ్లీ టెండర్లు ఆహ్వానించారు. టెండరు దాఖలు చేసే గడువు శుక్రవారంతో ముగుస్తుంది. కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేస్తే త్వరలో పనులు మొదలవుతాయి. లేదంటే మరికొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
Updated Date - 2022-10-07T05:58:11+05:30 IST