ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డి.పట్టా భూములు అన్యాక్రాంతం

ABN, First Publish Date - 2022-07-19T06:27:19+05:30

అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వెదుళ్లనరవలో డి.పట్టా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.

వెదుళ్లనరవలో ఇళ్ల స్థలాల లేఅవుట్‌గా అభివృద్ధి చేసిన డి.పట్టా భూమి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వెదుళ్లనరవలో 10 ఎకరాల మేర చేతులు మారిన వైనం

రెవెన్యూ అనుమతులు లేకుండానే క్రయవిక్రయాలు

ఇళ్ల స్థలాల లేఅవుట్‌గా అభివృద్ధి

మూడేసి సెంట్లతో ప్లాట్లు.. ఒక్కొక్కటి రూ.6-7 లక్షలకు విక్రయం

రిజిస్ర్టేషన్లు జరగనప్పటికీ తక్కువ ధరకు వస్తుండడంతో కొనుగోలుకు ఆసక్తి

చక్రం తిప్పుతున్న స్థానిక నాయకుడు

చోద్యం చూస్తున్న రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులు



విశాఖపట్నం, జూలై 18: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వెదుళ్లనరవలో డి.పట్టా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. జీవీఎంసీ 88వ వార్డు పరిధిలో వున్న ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా డి.పట్టా భూములను కొనుగోలు చేయడమేకాకుండా ఏకంగా ఇళ్ల స్థలాల లేఅవుట్లు వేశారు. మూడేసి సెంట్లుగా ప్లాట్లు వేసి, ఒక్కో ప్లాట్‌ను రూ.6-7 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులు, సచివాలయాల సిబ్బంది పట్టించుకోకపోవడం పలు అనుమానాలు తావిస్తున్నది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. 

 సబ్బవరం మండలం వెదుళ్లనరవ సర్వే నంబరు 94లో 18.65 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమి ఉంది. రెవెన్యూ అధికారులు చాలా కాలం క్రితం దీనిని సబ్‌ డివిజన్లుగా చేసి నలుగురు పేదలకు సుమారు 10 ఎకరాలకు డి.పట్టాలు అందజేశారు. 94/2లో 2.97 ఎకరాలను గొల్లపల్లి అర్జునరావుకు, 94/3లో 2.97 ఎకరాలను బలివాడ సూర్యనారాయణకు, 94/4లో 2 ఎకరాలను పడాల జగన్నాథం, 94/5లో 2 ఎకరాలను పడాల అప్పారావుకు పంపిణీ చేశారు. అయితే సదరు లబ్ధిదారులు సుమారు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు పొందకుండా డి.పట్టా భూములను వేరే వ్యక్తులకు విక్రయించారు. తరువాత పలువురి చేతులు మారినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డి.పట్టా భూములను కొనుగోలు చేసిన వ్యక్తులు మూడు నెలల క్రితం చదును చేసి, ఇళ్ల స్థలాల లేఅవుట్‌ వేశారు. ఒక్కో ప్లాట్‌ మూడు సెంట్లు వుండేలా 60 ప్లాట్లు వేశారు. చుట్టూ ఫెన్సింగ్‌ వేసి గేటు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాట్‌ను రూ.6-7 లక్షలకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం డి.పట్టా భూములకు రిజిస్ర్టేషన్లు జరగవు. కొనుగోలుదారులకు కూడా ఈ విషయం తెలుసు. అయితే ఇక్కడ జిరాయితీ భూములు సెంటు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు పలుకుతున్నది. దీనిలో మూడో వంతు ధరకే స్థలం వస్తుండడంతో రిజిస్ట్రేషన్‌ జరగనప్పటికీ కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. స్థానిక నాయకుడు ఒకరు మధ్యవర్తిగా వుండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు  ప్రతిఫలంగా ప్లాటకు ఇంత అని కమీషన్‌ వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. 

నిబంధనలకు తూట్లు... పట్టించుకోని అధికారులు

భూమిలేని నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం బంజరు భూములను పంపిణీ చేస్తుంటుంది. డి.పట్టా భూములుగా పిలిచే వీటి క్రయవిక్రయాలు చెల్లవు. ఎన్నాళ్లయినాసరే వారసులు సాగు చేసుకోవడమే తప్ప విక్రయించడానికి వీలులేదు. కానీ వెదుళ్లనరవలో డి.పట్టా భూములు చేతులు మారడం, ఇళ్ల స్థలాల లేఅవుట్లుగా వేసి విక్రయించడం బహిరంగంగానే సాగుతున్నాయి. అయినా రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులతోపాటు స్థానికంగా వుండే వీఆర్‌ఏ, వార్డు సచివాలయం సిబ్బంది, వార్డు వలంటీర్లు పట్టించుకోవడంలేదు.

 

చేతులు మారినట్టు తేలితే పట్టాలను రద్దుచేస్తాం

బి.సత్యనారాయణ, తహసీల్దారు, సబ్బవరం 

సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందడానికి అందజేసిన డి.పట్టా భూములను అమ్మడం, కొనుగోలు చేయడం నేరం. ఒకవేళ డి.పట్టా భూములు చేతులుమారినట్టు నిర్ధారణ అయితే... వెంటనే పట్టాను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి వుంది. వెదుళ్లనరవలో డి.పట్టా భూముల్లో వేసిన అక్రమ లేఅవుట్‌ను తొలగిస్తాం. చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2022-07-19T06:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising