‘క్లాప్ మిత్ర’ల ఆకలి కేకలు
ABN, First Publish Date - 2022-12-14T00:52:40+05:30
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న ‘క్లాప్ మిత్ర’లకు నెలల తరబడి వేతనాలు అందడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలకు మళ్లించుకోవడంతో పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు. నిధులు అందుబాటులో వున్న పంచాయతీల్లో కొంతమేర వేతన బకాయిలు చెల్లించినప్పటికీ అత్యధిక పంచాయతీల్లో ఆరు నుంచి పది నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో వున్నట్టు తెలిసింది. మొత్తం మీద జిల్లాలో ‘క్లాప్ మిత్ర’లకు రూ.10 కోట్ల వరకు వేతనాలు అందాల్సి వుందని సీఐటీయూ నాయకులు చెబుతున్నారు.
పంచాయతీల్లో పారిశుధ్య సిబ్బందికి నెలల తరబడి అందని వేతనాలు
జిల్లాలో పది నెలల నుంచి పేరుకుపోయిన బకాయిలు
ఆందోళనలు, నిరసనలకు దిగిన కార్మికులు
15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
పెద్ద పంచాయతీల్లో మూడు నుంచి ఆరు నెలల వరకు బకాయిలు చెల్లింపు
నిధులు లేవంటూ చేతులెత్తేసిన చిన్న పంచాయతీలు
మొత్తం మీద రూ.10 కోట్ల వరకు వేతనాలు పెండింగ్
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న ‘క్లాప్ మిత్ర’లకు నెలల తరబడి వేతనాలు అందడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలకు మళ్లించుకోవడంతో పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు. నిధులు అందుబాటులో వున్న పంచాయతీల్లో కొంతమేర వేతన బకాయిలు చెల్లించినప్పటికీ అత్యధిక పంచాయతీల్లో ఆరు నుంచి పది నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో వున్నట్టు తెలిసింది. మొత్తం మీద జిల్లాలో ‘క్లాప్ మిత్ర’లకు రూ.10 కోట్ల వరకు వేతనాలు అందాల్సి వుందని సీఐటీయూ నాయకులు చెబుతున్నారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకం కింద గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న ‘క్లాప్ మిత్ర’ల పరిస్థితి దయనీయంగా మారింది. గొర్రె తోక బెత్తెడు అన్న చందంగా మూడేళ్ల నుంచి నెలకు రూ.6 వేల వేతనంతో పనిచేస్తున్నారు. అయినప్పటికీ వీరికి ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించడంలేదు. అరకొర వేతనాలు సైతం నెలల తరబడి అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా వుంటున్నదని క్లాప్ మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన బకాయిల చెల్లింపు కోసం ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడంలేదని వాపోతున్నారు. జిల్లాలోని 645 పంచాయతీల్లో ప్రస్తుతం 2,186 మంది క్లాప్ మిత్రలు పని చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వీరికి వేతనాలు చెల్లించాలి. కానీ ఫిబ్రవరి నుంచి వేతనాలు అందడంలేదు. ఈ బకాయిలు మొత్తం రూ.13 కోట్ల వరకు వుంటాయని చెబుతున్నారు. అక్టోబరులో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి, కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఇటీవల సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు (క్లాప్ మిత్రలు) వేతనాల కోసం ఆందోళనకు దిగారు. గొలుగొండ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో నిరసన దీక్షలు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం స్పందించింది. స్వచ్ఛ ఆంధ్ర పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, అందువల్ల గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి క్లాప్ మిత్రలకు వేతనాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీలపై ఒత్తిడి తేవడంతో కొంతమంది సర్పంచులు మూడు నుంచి ఆరు నెలల వేతనాలు చెల్లించారు. మిగిలిన వేతన బకాయిలు చెల్లించేందుకు నిధులు లేవని చేతులెత్తేశారు. జిల్లా పంచాయతీ అధికారులకు అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో క్లాప్ మిత్రలకు రూ.4 కోట్ల వరకు వేతన బకాయిలు చెల్లించారు. మరో రూ.10 కోట్ల వరకు బకాయిలు వున్నట్టు సమాచారం.
అనకాపల్లి మండలం బవులువాడ పంచాయతీలో ఆరుగురు పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పది నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో ఇద్దరు కార్మికులు విధులకు హాజరు కావడంలేదు. ఇటీవల పంచాయతీ సర్పంచ్ చొరవ తీసుకొని 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ముగ్గురికి మూడు నెలల వేతనాలు చెల్లించారు. మిగిలిన 7 నెలల వేతనాలు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పరవాడ మండలంలో ఆరు నెలలు, కె.కోటపాడు మండలంలో 4 నెలలు, వి.మాడుగుల మండలంలో 6 నెలలు, రాంబిల్లి మండలంలో ఐదు నెలల వేతన బకాయిలు వున్నట్టు ఆయా మండలాల అధికారులు చెబుతున్నారు. కొన్ని మండలాల్లో నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో క్లాప్ మిత్రలు పారిశుధ్య పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కొందరు ఇప్పటికే ప్రత్యామ్నాయ పనులను వెతుక్కున్నారు.
మూడేళ్ల నుంచి వేతనాలు సరిగా అందడంలేదు
- గుడాల కామాక్షి, పారిశుధ్య కార్మికురాలు, బవులువాడ, అనకాపల్లి మండలం
నేను 12 ఏళ్ల నుంచి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నాను. గత మూడున్నరేళ్ల నుంచి వేతనాల చెల్లింపులు అస్తవ్యస్తంగా వున్నాయి. గత ప్రభుత్వాల్లో ఒకటి రెండు నెలల ఆలస్యంగా అయినా వేతనాలు అందేవి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. నాకు ఫిబ్రవరి నుంచి వేతనాలు అందడంలేదు. ఇటీవల సర్పంచ్‌కు మా గోడు వెళ్లబోసుకుంటే మూడు నెలల వేతనాలు ఇచ్చారు. మిగిలింది ఎప్పుడిస్తారో తెలియదు.
ఒక్క నెల వేతనం కూడా ఇవ్వలేదు
రవ్వా రమణమ్మ, పారిశుధ్య కార్మికురాలు, బవులువాడ, అనకాపల్లి మండలం
నేను గత సంవత్సరం నవంబరు నెలలో క్లాప్ మిత్రగా చేరాను. 12 నెలలు గడిచాయి. ఇంతవరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదు. ఇటీవల పాత వాళ్లకు మూడు నెలల వేతనాలు ఇచ్చారు. నా వేతనాలకు బిల్లు పెట్టామని అధికారులు చెప్పారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇచ్చేది అరకొర వేతనాలు.. అవి కూడా సకాలంలో ఇవ్వకపోతే మేం ఎలా బతకాలి? సంక్రాంతి పండగలోగా వేతనాలు చెల్లించాలని కోరుతున్నాను.
ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇవ్వాలని ఆదేశించాం
శిరీషారాణి, జిల్లా పంచాయతీ అధికారి
ఆర్థిక సంఘం నిధుల నుంచి పారిశుధ్య కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పంచాయతీల కార్యదర్శులను ఆదేశించాం. జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులు వస్తుడడంతో చిన్న పంచాయతీల్లో నిధుల కొరత వుంది. దీంతో ఆయా పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడానికి ఇబ్బందిగా వుంది.
.
Updated Date - 2022-12-14T00:52:41+05:30 IST