మన్యంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి పర్యటన
ABN, First Publish Date - 2022-01-11T06:24:19+05:30
మన్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం పర్యటించారు.
పాతరూడకోట సందర్శన..
నవజాత శిశు మరణాలపై ఆరా ..
గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పనకు హామీ
పాడేరు, జనవరి 10: మన్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే సోమవారం పర్యటించారు. నవజాత శిశు మరణాలు చోటుచేసుకుంటున్న పెదబయలు మండలం పాతరూడకోటను సందర్శించి, మరణాలపై ఆరా తీశారు. మూడు రోజుల మన్యం పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన చింతపల్లి మండలంలో సందర్శించగా, సోమవారం పాడేరు, హుకుంపేట, పెదబయలు మండలాల్లో పర్యటించారు. తొలుతగా ఆయన హుకుంపేట మండలం కామయ్యపేట, తడిగిరి పంచాయతీ మధ్యలో ఉన్న సీతమ్మకొండను సందర్శించారు. అనంతరం స్థానిక మోదకొండమ్మను సందర్శించి, ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా కాంతిలాల్‌దండే దంపతులకు ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ మోదకొండమ్మ చిత్రపటాన్ని బహూకరించారు. తర్వాత పెదబయలు మండలం మారుమూల పాతరూడకోట గ్రామాన్ని సందర్శించారు. అక్కడ గతకొన్నాళ్లుగా జరుగుతున్న నవజాత శిశు మరణాలపై ఆరా తీశారు. నవజాత శిశు మరణాలను పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. గ్రామంలో రూ.కోటి 15 లక్షల వ్యయంతో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూ.30లక్షలతో రూడకోట పీహెచ్‌సీలో బర్త్ వెయిటింగ్ హాల్, రూ.30 లక్షలతో డాక్టర్ల నివాసానికి గృహాలు, రూ.25 లక్షలతో నర్సులకు నివాస గృహాలు, రూ.15లక్షలతో పాతరూడకోటకు కల్వర్టు నిర్మాణం, రూ.10 లక్షలతో రక్షిత తాగునీటి పథకం, రూ.5 లక్షలతో బస్‌షెల్టర్ నిర్మాణం చేపడతామన్నారు. గిరిజనులు పీహెచ్‌సీలో అందుబాటులోని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీబ్ల్యూ ముఖ్యకార్యదర్శి కాంతాలాల్‌దండే కోరారు. గ్రామంలోని గర్భిణులను ముంచంగిపుట్టులోని బర్త్ వెయిటింగ్ హాలులో చేరాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ సూచించారు. అలాగే అందు బాటులో ఉన్న తాగునీటి పథకానికి మరమ్మతులు చేపట్టి, కొత్త పైపులైన్లను అమరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఎస్‌ఈ ఎస్.శ్రీనివాస్, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ కె.లీలాప్రసాద్, సీనియర్ డాక్టర్ టి.విశ్వేశ్వరరావు నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్ కుమార్, ఎంపీడీవో ఎల్.పూర్ణయ్య, సర్పంచ్ కె.సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-11T06:24:19+05:30 IST