15 టన్నుల పశుమాంసం పట్టివేత
ABN, First Publish Date - 2022-10-17T07:06:43+05:30
గుట్టుగా పెద్ద ఎత్తున పశుమాంసాన్ని తరలిస్తున్న కంటైనర్ లారీని పాయకరావుపేట పోలీసులు పట్టుకున్నారు.
కంటైనర్ లారీ సీజ్.., డ్రైవర్ అరెస్టు
పాయకరావుపేట, అక్టోబరు 16 : గుట్టుగా పెద్ద ఎత్తున పశుమాంసాన్ని తరలిస్తున్న కంటైనర్ లారీని పాయకరావుపేట పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.30 లక్షలు విలువైన పశుమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం సీఐ అప్పలరాజు తెలిపిన వివరాలివి. కోల్‌కతా తదితర ప్రాంతాల్లో పశుమాంసాన్ని కిలో రూ.250 చొప్పున పలువురు కొనుగోలు చేసి, చెన్నైలో కిలో రూ.850 చొప్పున విక్రయించేందుకు శనివారం కంటైనర్ లారీ ద్వారా తరలిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుతున్న సీఐ అప్పలరాజు, ఎస్‌ఐ జోగారావులు సిబ్బందితో శనివారం రాత్రి ఇక్కడి వై.జంక్షన్ వద్ద మాటు వేశారు. ఆ సమయంలో వస్తున్న కంటైనర్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 15 టన్నుల పశుమాంసం బయటపడింది. వెంటనే వాహనంతో పాటు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుడివాడకు చెందిన డ్రైవర్ అప్పలరాజును అదుపులోనికి తీసుకోగా, క్లీనర్ శ్రీని పారిపోయినట్టు సీఐ చెప్పారు. మాంసం తరలింపునకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Updated Date - 2022-10-17T07:06:43+05:30 IST