తికమక.. మకతిక!
ABN, First Publish Date - 2022-09-05T07:53:26+05:30
తికమక.. మకతిక!
జగన్ పాలనలో అంతా గందరగోళం
ఒక వ్యవస్థకు పోటీగా మరో వ్యవస్థ
ఉన్నది నిర్వీర్యం.. కొత్తది అసంపూర్ణం
పంచాయతీలకు పోటీగా ‘సచివాలయాలు’
శాఖలకు సమాంతరంగా ప్రత్యేక సిబ్బంది
రేషన్ డీలర్లు ఉండగానే ‘ఇంటింటి’ వాహనాలు
ఎవరినీ సంతృప్తి పరచని కొత్త పద్ధతి
వాహనాల కోసం రూ.600 కోట్లు వ్యయం
104లు ఉన్నప్పటికీ... ‘ఫ్యామిలీ డాక్టర్’
ఎవరి విధులేంటో తెలియని గందరగోళం
హడావుడే తప్ప కనిపించని ఫలితాలు
ప్రభుత్వంలో ఉన్నవారు... వ్యవస్థలను బాగు చేయాలి. ఒకవేళ ఏదైనా వ్యవస్థ సరిగా లేదనుకుంటే, దానిని రద్దుచేయాలి. మెరుగైన పద్ధతి ప్రవేశపెట్టాలి. కానీ... జగన్ తీరే వేరు! ఉన్నది అలాగే ఉంచి, దానికి సమాంతరంగా మరో వ్యవస్థ ప్రవేశపెట్టి... ఎవరేం చేస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారు.
ఏం లాభం..
ఎవరు ముఖ్యమంత్రి అయినా వారి సొంత పథకాలు, వారి మార్కు పనులు చేపట్టాలని భావించడం సహజం. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇళ్లవంటి పథకాలతో ప్రత్యేకత చాటుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలతో తనదైన ముద్ర వేశారు. తక్కువ కాలం సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా కొన్ని ప్రజారంజకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్ నిధులు విరివిగా అందించి ఆదుకున్నారు. నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును మూడొంతులు పూర్తి చేసి, అమరావతి రాజధానికి రూపురేఖలు తీసుకువచ్చారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు మాత్రం విధ్వంసక, కక్షపూరితమైనవే! మళ్లీ తాను అధికారంలోకి వచ్చేందుకు... పేదలను ‘ఓటు బ్యాంకు’గా మార్చుకునేవే!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అంతా అయోమయం! ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియని గందరగోళం! అనుభవ రాహిత్యం... పరిపక్వత లేని నిర్ణయాలు... పాత ప్రభుత్వ ముద్రను చెరిపివేయాలనే అర్థంలేని ఆరాటంతో జగన్ సర్కారు చిత్రవిచిత్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఉన్న వ్యవస్థలను మెరుగుపరచడం మానేసి... దానికి సమాంతరంగా మరో వ్యవస్థను ఏర్పాటు చేయడమనే కొత్త ధోరణి మొదలైంది. ‘కోడలా కోడలా ఏం చేస్తున్నావు’ అంటే... ‘బియ్యం కింద పడేసి మళ్లీ ఏరుతున్నా’ అన్నట్లుగా సర్కారు పరిస్థితి తయారైంది. ఒకటీ రెండూ కాదు... అనేక ‘సమాంతర వ్యవస్థ’ల ఏర్పాటుతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. అంతేకాదు... దీనివల్ల ఎవరు ఏం పని చేస్తున్నారో తెలియకుండా పోతోంది. మూడు రాజధానులు, ఇంటింటికీ రేషన్, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, చెత్త పన్ను, ఇసుక కొరత, ఇంగ్లిష్ మీడియం, ప్రతి శాఖలో ఉద్యోగులకు సమాంతరంగా సిబ్బంది నియామకం... ఇలా ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు.
పంచాయతీలను చంపేసి...
ప్రతి గ్రామంలో పంచాయతీ వ్యవస్థ దశాబ్దాలుగా పటిష్ఠంగా కొనసాగుతోంది. స్థానిక పాలన ఇక్కడి నుంచే మొదలవుతుంది. ప్రతి పంచాయతీలో అటు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇటు ప్రభుత్వ సిబ్బంది ఉంటారు. పంచాయతీలను బలోపేతం చేసేందుకు, వీటిద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఎంతో ఉంది. కానీ... జగన్ వచ్చీ రాగానే పంచాయతీలను చంపేసే కార్యక్రమం మొదలుపెట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టారు. పంచాయతీ కార్యాలయాల్లోనే సచివాలయాలను ఏర్పా టు చేసి వాటి ఉనికే లేకుండా చేశారు. పంచాయతీల్లో సిబ్బందికి పోటీగా గ్రామ సచివాలయాల సిబ్బందిని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలు 29 రకాల విధులు నిర్వహించాలి. కేంద్ర ఆర్థిక సం ఘం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తుంది. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు 73, 74వ రాజ్యాంగ సవరణల ఫలాలు పొందుతున్నాయి. మన రాష్ట్రం లో మాత్రం పంచాయతీలను ‘నామ్ కే వాస్తే’గా మార్చి... సచివాలయాలను పోషిస్తున్నారు.
ఎవరేం చేయాలో...
జగన్ సర్కారు ప్రతి శాఖకూ సమాంతరంగా, పోటీగా ‘సచివాలయం’లో సిబ్బందిని నియమించింది. గ్రామ, వార్డు సచివాలయంలో 14 రకాల సిబ్బందిని నియమించారు. ఈ సిబ్బంది విధులకు, ఇప్పటికే ఆయా శాఖల ద్వారా నిర్వహిస్తున్న విధులకు పొంతన లేదు. ఉదాహరణకు సచివాలయాల్లో ఏఎన్‌ఎంలను నియమించారు. ఇప్పటికే పీహెచ్‌సీల ద్వారా ఆయా గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు పనిచేస్తున్నారు. సచివాలయంలో నియమించిన ఏఎన్‌ఎం ఏం చేయాలో తెలియని పరిస్థితి. అదే విధంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్లు కూడా ఏ విధులు నిర్వహించాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో లైన్‌మెన్లు పనిచేస్తున్నారు. అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించారు. ఆయా పోలీసు స్టేషన్ల ఎస్‌ఐల ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పారు. అయితే రెగ్యులర్ పోలీసులు ఉండగా సచివాలయ మహిళా పోలీసు విధులకు ప్రాధాన్యం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పరిస్థితి కూడా అంతే. సచివాలయంలో నియమించిన పంచాయతీ కార్యదర్శి, కంప్యూటర్ ఆపరేటర్, సంక్షేమ కార్యదర్శికి తప్ప మిగతా ఎవరికీ చేసేందుకు విధులేమీ లేవు. అనాలోచిత నిర్ణయాల వల్ల నిధులు వృథా కావడమే కాకుండా సచివాలయ ఉద్యోగులకు ఎదుగూ బొదుగూ లేకుండా అరొకర జీతాలతో ఇబ్బందులు పెట్టారు.
రేషన్ షాపులు ఉన్నదెందుకు?
రేషన్ షాపులకే వెళ్లి... సరుకులు తీసుకోవడం! ఇది దశాబ్దాలుగా ఉన్న పద్ధతి. వరుస ప్రభుత్వాలు దీనిని ప్రజలకు మరింత అనుకూలంగా ఉండేలా మార్చుతూ వచ్చాయి. టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి... ఎక్కడి వారు ఎక్కడైనా రేషన్ తీసుకునే ‘పోర్టబులిటీ’ వెసులుబాటు కూడా ఉండేది. లబ్ధిదారులు ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ మధ్య తమకు అనుకూలమైన సమయంలో, తమకు సమీపంలో ఉన్న రేషన్ షాప్‌కు వెళ్లి సరుకులు తీసుకునేవారు. కానీ... ముఖ్యమంత్రి జగన్ ‘ఇంటింటికీ రేషన్ సరుకులు’ అంటూ కొత్త పద్ధతి తెచ్చిపెట్టారు. ఆ వాహనాలు నిజానికి ‘ఇంటింటికీ’ రావు! వీధి చివరో, మలుపులోనో పెట్టి సైరన్ మోగిస్తారు. ఆ సమయానికి లబ్ధిదారులు ఇంట్లో లేకుంటే అంతే సంగతులు! పోనీ... ఇంటింటికీ సరుకులు పంపిణీ చేస్తున్నామంటున్న ప్రభుత్వం, రేషన్ షాపులను రద్దు చేసిందా అంటే, అదీ లేదు. అంటే... ఒక వ్యవస్థ ఉండగానే దానికి సమాంతరంగా మరో వ్యవస్థ! ఇవే వాహనాలను మండల స్థాయి స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్‌కు పంపించి సరుకులు అక్కడి నుంచే పంపించవచ్చు. కానీ... ఎంఎల్‌ఎస్ నుంచి రేషన్ డీలర్లు తెచ్చిన సరుకులను, వారి నుంచి ఎండీయూ ఆపరేటర్లు తీసుకుని లబ్ధిదారులకు అందిస్తారు! దీనివల్ల ఎవరికి మేలు జరిగిందో అర్థం కావడంలేదు. తమను ఎప్పుడు తొలగిస్తారోనని డీలర్లు అభద్రతా భావంతో ఉన్నారు. ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాల ఆపరేటర్లు జీతం గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. బండి ఎప్పుడొస్తుందో, సరుకులు ఎప్పుడు తీసుకోవాలో అనే టెన్షన్‌తో జనం సతమతమవుతున్నారు. ఇలా ఎవరినీ సంతృప్తి పరచని ‘రేషన్ వాహన సేవ’కు సర్కారు పెట్టిన ఖర్చు దాదాపు రూ.600 కోట్లు.
104 ఉన్నది ఎందుకు?
104... నిర్దిష్ట తేదీలలో తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు, పరీక్షలు అందించే వ్యవస్థ! 104లో ఒక డాక్టరు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్ ఉంటారు. షెడ్యూలు ప్రకారం ఆయా గ్రామాలకు వెళ్లి వైద్య సేవలను అందిస్తారు. దీనిని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. కానీ... జగన్ ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ అంటూ హడావుడి చేస్తోంది. పీహెచ్‌సీలో ఉండే ఇద్దరు డాక్టర్లకు... ఆ ఆస్పత్రి పరిధిలోని గ్రామాలను చెరిసగం కేటాయిస్తారు. ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే... మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాల్లో ఒకచోటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఇలా వంతుల వారీగా ఒకరు పీహెచ్‌సీలో, మరొకరు ఊర్లలో ఉంటారు. దీనివల్ల... పీహెచ్‌సీలో వైద్యసేవలు కుంటుపడటం ఖాయం. మరోవైపు... గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందించేందుకు 104 ఉండగా, కొత్తగా ‘ఫ్యామిలీ డాక్టర్’ చేసేదేమిటో అర్థం కాదు!
‘చెత్త’ పన్ను.. కొత్త వాహనాలు
గత ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త తరలించేందుకు భారీ సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసింది. అవి ఉన్నా వైసీపీ ప్రభుత్వం 4వేలకు పైగా చెత్త తరలించే ఆటోలు కొనుగోలు చేసింది. గతంలో ఇళ్లల్లో చెత్తను వాహనాల్లో తరలించే వారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఆటోల కొనుగోలు వల్ల కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడం తప్ప కొత్తగా ప్రయోజనాలేవీ లేవు. పైగా ముక్కు పిండి ‘చెత్త’ పన్ను వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రజలు పన్ను లు చెల్లించేది చెత్త, తాగునీరు, వీధి లైట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకే. ఓ వైపు ఇంటి పన్నులు పెం చి, మళ్లీ చెత్త పన్ను వసూలు చేయడం ఏం టో? వైసీపీ సర్కారు ‘చెత్త’ నిర్ణయాలతో ప్రజలపై అదనపు భారం పడింది.
కట్టిన ఇళ్లను ఇవ్వకుండా...
టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. గత ప్రభుత్వం హయాంలో పట్టణాల్లో సుమారు 8 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చాలా చోట్ల 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. జగన్ ప్రభుత్వం వాటిని పూర్తి చేసి ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ అంటూ కొత్త ప్రహసనం మొదలుపెట్టింది. నిజంగానే పేదలకు ఇవ్వాలంటే టిడ్కో ఇళ్ల పనులు కూడా పూర్తి చేయవచ్చు. కానీ మూడున్నరేళ్లుగా వాటిని పట్టించుకోవడంలేదు. జగనన్న కాలనీలూ వేగంగా ముందుకు సాగడంలేదు. దీనివల్ల అంతిమంగా నష్టపోతున్నది పేద లబ్ధిదారులే!
పనికొచ్చేవి పడగొట్టి..
ప్రజావేదిక కూల్చివేత
ఒకవైపు కీలక వ్యవస్థలకు సమాంతర వ్యవస్థలను ప్రవేశపెట్టడం! మరోవైపు... పనికొచ్చే వ్యవస్థలు, పనులను చెడగొట్టడం! ఇదీ జగన్ మార్కు పాలన. దీనికి ఉదాహరణ... ప్రజా వేదిక కూల్చివేత! ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కలెక్టర్ల సదస్సులు, ఇతర సమావేశాల నిర్వహణ, ప్రజలను నేరుగా కలవడం కోసం చంద్రబాబు ‘ప్రజా వేదిక’ను నిర్మించారు. జగన్ అధికారంలోకి రాగానే ఒకేఒక్క సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి... అక్రమ కట్టడంపేరిట దానిని కూల్చి వేయించారు. ‘ప్రజా వేదిక’ను ఉపయోగించడం తనకు ఇష్టంలేకపోతే... అందులో ఆస్పత్రినో, పాఠశాలనో ఏర్పాటు చేయవచ్చు. మరేదైనా ప్రజావసరాలకు ఉపయోగించవచ్చు. కానీ... లక్షల ఖర్చుతో నిర్మించిన ఆ నిర్మాణాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చి వేయించారు.
రాజధానిపైనా రచ్చ..
జగన్ అధికారంలోకి వచ్చేనాటికే అమరావతిలో దాదాపు రూ.10వేల కోట్ల విలువైన పనులు జరిగాయి. ఉద్యోగులు, అధికారుల క్వార్టర్స్ దాదాపుగా పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. జగన్ అధికారంలోకి రాగానే ‘మూడు ముక్కలాట’ మొదలుపెట్టారు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. అమరావతిలో అప్పటికే జరిగిన నిర్మాణాలను ఏం చేయాలి, ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనే చేయకుండా వాటిని పాడుపెడుతున్నారు. ఫలితం... ప్రజాధనం వృథా!
Updated Date - 2022-09-05T07:53:26+05:30 IST