Chandrababu: నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సరికాదు
ABN, First Publish Date - 2022-12-16T00:21:53+05:30
‘‘పంటలు చేతికందే సమయంలో వచ్చి పడిన మాండస్ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలి. నష్టం వేల కోట్ల రూపాయల్లో ఉన్న ఈ సమయంలో రైతుల కంట కన్నీరు తుడవడానికి ప్రభుత్వం తక్షణం కదలాలి.
తుఫాను బాధితులను ఆదుకోవాలి.. సీఎంకు చంద్రబాబు లేఖ
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ‘‘పంటలు చేతికందే సమయంలో వచ్చి పడిన మాండస్ తుఫాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలి. నష్టం వేల కోట్ల రూపాయల్లో ఉన్న ఈ సమయంలో రైతుల కంట కన్నీరు తుడవడానికి ప్రభుత్వం తక్షణం కదలాలి. నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సరికాదు’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఈ మేరకు గురువారం ఆయన ఒక లేఖ రాశారు. ‘‘తుఫాను కారణంగా అనంతపురం, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు వాటిల్లిన నష్టం వేల కోట్లలో ఉంది. ఈ సమయంలో రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి కొత్త ఆంక్షలతో వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువెళ్తే తేమ శాతం ఎక్కువగా ఉందని, ధాన్యం తడిసి రంగు మారిందని చెప్పి ధరలో భారీగా కోత పెడుతున్నారు. తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉంటే ధర తగ్గిపోతోంది. దీని కోసం ధాన్యాన్ని ఇరవై రోజులకు పైగా ఆరబెట్టాల్సి వస్తోంది. ఆ ఖర్చుల కింద రూ.20 నుంచి రూ.30 వేలు వ్యయం చేయాల్సి వస్తోంది. వాతావరణంలో చల్లదనం కారణంగా తేమ శాతం వెంటనే తగ్గడం లేదు’’ అని వివరించారు. ఈ ఏడాది ఖరీ్‌ఫలో 90 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే కేవలం 37 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం వెనక్కు తగ్గడంతో ప్రైవేటు వ్యాపారులు మరింత ధరను తగ్గించి రైతులను దోచుకొంటున్నారని, దీనివల్ల రైతులు క్వింటాలుకు రూ.500 నుంచి రూ.700 వరకూ నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.
‘‘మార్కెట్ యార్డుల్లో ధాన్యం ఆరబోత యంత్రాల నిర్వహణ కూడా సరిగ్గా లేదు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఇంతవరకూ మొదలు పెట్టలేదు. పోయిన ఏడాది డబ్బు కూడా ఇంతవరకూ పూర్తిగా వారికి రాలేదు. టీడీపీ హయాంలో కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి రోజుల వ్యవధిలోనే డబ్బు చెల్లించాం. వర్షాలకు పాడైన ధాన్యాన్ని కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేశాం. ఇప్పుడు రకరకాల నిబంధనలతో రైతులను వేధిస్తున్నారు’’ అని ఆయన తన లేఖలో విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కదిలి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు అన్ని జిల్లాల్లో వెంటనే ప్రారంభించాలని, తుఫానులో నష్టపోయిన వరి, అపరాల రైతులకు ఎకరానికి రూ.20 వేలు వంతున, వాణిజ్య, ఉద్యానవన పంటలకు ఎకరానికి రూ.50 వేలు వంతున పరిహారం ఇవ్వాలని, ఈ క్రాప్... ఇతర నిబంధనలు లేకుండా బీమా పరిహారం ఇవ్వాలని, కౌలు రైతులకు నేరుగా నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, సీఎంని కోరారు.
Updated Date - 2022-12-16T00:21:54+05:30 IST