టార్గెట్.. చెక్ పోస్ట్!
ABN, First Publish Date - 2022-10-07T08:59:50+05:30
టార్గెట్.. చెక్ పోస్ట్!
ఆదాయ వనరుగా మార్చుకున్న అధికార పార్టీ నాయకులు
అధికారులను అడ్డంపెట్టి దోపిడీ దందా
కోస్తాలో అమాత్యులకు నెలకు 20 లక్షలు
రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేకి 10 లక్షలు
సీమలో మంత్రి అనుయాయులదే పెత్తనం
రవాణా శాఖలో అవినీతి ఊడలు
అక్రమాలకు అదీ.. ఇదీ.. అన్న తేడా లేదన్నట్టుగా రాష్ట్రంలోని చెక్ పోస్టులను సైతం అధికార పార్టీ నాయకులు ఆదాయ వనరులుగా మార్చుకుని.. అక్రమంగా లక్షలు దోచేస్తున్నారు. దీనికిగాను కొందరు అధికారులను సైతం నియమించుకుని పనికానిచ్చేస్తున్నారు. వాహనాల డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా.. లేకున్నా.. సంబంధం లేదు. చెక్ పోస్టు వచ్చిందంటే.. కట్టి కదలాల్సిందే! ఇదీ.. రాష్ట్రంలో రోడ్లపై జరుగుతున్న అధికార పార్టీ నేతల అవినీతి దందా!!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర రవాణా శాఖలో కనీ వినీ ఎరుగని రీతిలో అవినీతి పెచ్చరిల్లుతోంది. ఒకప్పుడు ఏజెంట్ల ద్వారా వాహనదారుల నుంచి రూ.వందలు తీసుకునే ఆర్టీఏ సిబ్బంది.. ఆ తర్వాత రోడ్డుపై వాహనాలు ఆపి వేలల్లో వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు చెక్ పోస్టుల్లో ఏకంగా.. అధికార పార్టీ నాయకులే దందాలకు తెరదీశారు. దీంతో రవాణా శాఖలో అంతులేని దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆర్టీఏ కార్యాలయాల్లో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కొందరు ప్రజా ప్రతినిధులు రంగ ప్రవేశం చేసి.. ఏకంగా రాష్ట్ర సరిహద్దులనే ఎంచుకున్నారు. ఏ వాహనం రాష్ట్రంలోకి ప్రవేశించినా డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా మామూళ్లు ఇచ్చి కదలాల్సిందేననే విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి రోజూ వందలు, వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే అంతర్గత, సరిహద్దు చెక్ పోస్టుల్లో రూ.వందలు, వేలు దాటి లక్షల్లో వసూలు చేస్తున్నారు. రాయలసీమలో పంచలింగాల(కర్నూలు), పెనుకొండ(సత్యసాయి), పలమనేరు(చిత్తూరు) చెక్ పోస్టులు ప్రధానమైనవి. రాయలసీమకు ముఖ ద్వారమైన పంచలింగాల చెక్ పోస్టులో పట్టు బడుతున్న డబ్బు, బంగారం వంటివి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ చెక్ పోస్టుపై కన్నేసిన అధికారులు ఒక అమాత్యుడి దగ్గరి కెళ్లి సిఫారసు సాయం కోరగా ఆయనొక ప్రతిపాదన పెట్టారు. ‘‘నాకు డబ్బులు అక్కర్లేదు.. మా వాళ్లు అన్నీ చూసుకుంటారు.. మీరు సహకరించాలి’’ అనడంతో పోస్టింగ్ ఆశించిన అధికారులు ఎగిరి గంతేశారు. దీంతో మొత్తం వ్యవహారం అమాత్యుడి మనుషుల చేతిలోకి వెళ్లిపోయిందని. మిగతా రెండు చెక్ పోస్టుల్లోనూ ఆయా జిల్లాల్లోని కీలక ప్రజా ప్రతినిధులు తమ వాటా తమకు పంపాల్సిందే అనడంతో చేసేదిలేక ఎంవీఐలు ప్రతి నెలా పంపుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తడ, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం కీలకమైన చెక్ పోస్టులు. అక్కడ వచ్చే ఆదాయం, వసూళ్లపై అవగాహన ఉన్న అధికార పార్టీ నాయకులు వాటి నుంచి ఎప్పటికప్పుడు వాటా గుంజుకుంటున్నారు.
రాజధాని జిల్లాలో కూడా..
గుంటూరు జిల్లాలోని దాచేపల్లి చెక్ పోస్టులో వసూలు చేసిన మొత్తం నుంచి ఒక కీలక ఎమ్మెల్యేకి ప్రతి నెలా రూ.పది లక్షలు ఇవ్వాల్సిందేనని రవాణాశాఖలో చర్చ జరుగుతోంది. ఆయనకు సంబంధించిన వాహనాల్లో ఇసుక బయటికి వెళ్లినా, మద్యం లోపలికి వచ్చినా సెబ్ అధికారులే మాట్లాడలేక పోతున్నారని, ఇక తామేం చేయగలమని రవాణా సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. సెబ్ సీఐ బదిలీ అయితే వెంటనే తెప్పించుకోవడం, ఎంవీఐని బదిలీ చేస్తే ఓడీ ద్వారా రప్పించుకోవడం ఆ ఎమ్మెల్యే పవర్‌కు నిదర్శనమని చెబుతున్నారు. వీటితోపాటు ఉత్తరాంధ్రలోని పురుషోత్తపట్నం, కృష్ణా జిల్లాలోని గరికపాడు చెక్ పోస్టుల్లో ఆదాయం నుంచి కొందరు ప్రజా ప్రతినిధులకు వాటాలు ఇవ్వకపోతే పనిచేయడం సాధ్యం కాదని రవాణా శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. మరి అధికార పార్టీ నాయకులు, మంత్రులే అవినీతి సొమ్ముకు ఆశపడితే.. ప్రజలకు అవినీతి రహిత పాలన ఎలా అందుతుందనేది ప్రశ్న.
ఇద్దరు మంత్రుల పోటీ
ఉత్తరాంధ్ర నుంచి కోస్తాలోకి ప్రవేశించే ప్రాంతంలో బేతపూడి చెక్ పోస్టు పేరు చెబితే వాహనదారుల వెన్నులో వణుకు పుడుతోంది. తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా అక్కడ డబ్బులు ఇచ్చి కదలాల్సిందే. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోక పోవడానికి కారణం ఇద్దరు మంత్రులకు ప్రతి నెలా రూ.పది లక్షల చొప్పున ఆ చెక్ పోస్టు నుంచి మామూళ్లు అందడమేనని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఒక కీలక మంత్రి తనకు ప్రతి నెలా రూ.పది లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో అధికారులు కాదనలేక సరే అన్నారు. మరి నాకెందుకు ఇవ్వరంటూ మరో మంత్రి సీరియస్ అవడంతో ఆయనకూ రూ.పది లక్షలు ఇచ్చేందుకు తలూపారు. అప్పటికే ఒక ఉన్నతాధికారి ప్రతి నెలా రూ.9 లక్షలు తనకు పంపాల్సిందేనంటూ హుకుం జారీ చేసి మరీ వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి రోజూ లక్ష రూపాయల వసూలు చేస్తేనే అక్కడ గడుస్తుంది. అంతకు పైన వస్తేనే అధికారులు, సిబ్బందికి మిగులుతుంది.
Updated Date - 2022-10-07T08:59:50+05:30 IST