సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడు రమేశ్ బాబుకన్నుమూత
ABN, First Publish Date - 2022-01-09T07:49:12+05:30
సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడు రమేశ్ బాబుకన్నుమూత
కొన్నాళ్లుగా కాలేయ వ్యాధి
15 చిత్రాల్లో కథానాయకుడు
హైదరాబాద్ సిటీ, సినిమా డెస్క్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేశ్ బాబు (56) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించేలోపే తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందారు. రమేశ్ మరణ వార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. రమేశ్‌బాబుకు భార్య మృదుల, కుమార్తె భారతి, కుమారుడు జయకృష్ణ ఉన్నారు. భారతి చదువుకుంటున్నారు. జయకృష్ణ.. చిత్రరంగ ప్రవేశం కోసం శిక్షణ పొందుతున్నారు. రమేశ్‌బాబు బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కృష్ణ సొంత చిత్రం ‘అగ్నిపరీక్ష’ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, దొంగలకు దొంగ చిత్రాల్లో బాలనటుడిగా చేశారు. 15 ఏళ్ల వయసులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’ చిత్రంలో ప్రధానపాత్రలో రమేశ్ బాబు నటించారు. చెన్నైలోని లయోలా కాలేజీలో బీకాం పూర్తి చేశారు. తన 23వ ఏట హీరోగా మళ్లీ కెమెరా ముందుకొచ్చి సామ్రాట్ అనే చిత్రంలో నటించారు. చివరగా కృష్ణతో కలిసి ఎన్‌కౌంటర్ చిత్రంలో కనిపించారు. 15 చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన 1997 నుంచి నటనకు దూరంగా ఉన్నారు. 2004లో నిర్మాతగా మారి మహేశ్ బాబు హీరోగా అర్జున్, అతిథి, హిందీలో సూర్యవంశ్ చిత్రాలను నిర్మించారు. దూకుడు, ఆగడు చిత్రాలకు సమర్పకుడిగా వ్యహరించారు. కాగా రమేశ్‌బాబు మృతి పట్ల ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు. ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయి.
Updated Date - 2022-01-09T07:49:12+05:30 IST