పండగ పూట విషాదం
ABN, First Publish Date - 2022-10-07T05:39:10+05:30
వరహాల గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కొట్టుకుని పోయాడు. అతడ్ని రక్షించేందుకు వెళ్లిన స్నేహితుడు కూడా గల్లంతయ్యాడు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం పోలీసు యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. పలాస మండలం కేదారిపురం సమీపంలో పండుగపూట బుధవారం ఈ ఘోరం చోటుచేసుకుంది.
వరహాలగెడ్డలో ఇద్దరు గల్లంతు
ఒకరి మృతదేహం లభ్యం
మరొకరికి కోసం కొనసాగుతున్న గాలింపు
కేదారిపురం సమీపంలో ఘటన
పలాస/రూరల్, అక్టోబరు 6: వరహాల గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కొట్టుకుని పోయాడు. అతడ్ని రక్షించేందుకు వెళ్లిన స్నేహితుడు కూడా గల్లంతయ్యాడు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం పోలీసు యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. పలాస మండలం కేదారిపురం సమీపంలో పండుగపూట బుధవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పలాస మండలం కేదారిపురానికి చెందిన పాడి శంకరరావు(29) గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న వరహాలగెడ్డ ఉధృతిని చూసేందుకు బుధవారం సాయంత్రం వెళ్లాడు. అప్పటికే రోడ్డుపై నుంచి రెండడుగుల ఎత్తు మేర గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. శంకరరావు ఆ రోడ్డుపై నుంచి కాశీబుగ్గ వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా వరద ఉధృతికి కొట్టుకెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకుని అదే గ్రామానికి చెందిన బోడసింగి కూర్మారావు(29), మరో ఇద్దరు శంకరరావును రక్షించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో కూర్మారావు కూడా వరదనీటి ఉధృతికి కొట్టుకుపోయారు. మరో ఇద్దరు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. తహసీల్దార్ ఎల్.మధుసూదనరావు, కాశీబుగ్గ డిఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఎస్.శంకరరావు తమ బృందాలతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక శాఖ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి.. గ్రామస్థులతో సహా వారిద్దరి ఆచూకీ కోసం గాలించారు. గురువారం ఉదయం శంకరరావు మృతదేహం లభ్యమైంది. కూర్మారావు ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. వరద ఉధృతి తగ్గితేనే.. ఆయన ఆచూకీ లభించే అవకాశం ఉందని అధికారులు, స్థానికులు పేర్కొంటున్నారు. పాడి శంకరరావు, బోడసింగి కూర్మారావు ఇద్దరూ ప్రాణ స్నేహితులు. పక్కపక్క గృహాల్లోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరూ రోజు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శంకరరావుకు భార్య దేవి, లితిన్ అనే ఐదేళ్ల కుమారుడు, రెండు నెలల పాప ఉన్నారు. కూర్మారావుకు భార్య పద్మావతి, కారుణ్య, జోషి అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. దసరా పండుగ రోజు ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. బాధిత కుటుంబ సభ్యులను మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గురువారం పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో టి.సీతారామమూర్తి, ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు, తహసీల్దార్ ఎల్.మధుసూదనరావు, సీఐ శంకరరావు ఉన్నారు.
Updated Date - 2022-10-07T05:39:10+05:30 IST