పంచాయతీల్లో పావలా లెక్కలేదు... పనులెలా చేయాలి
ABN, First Publish Date - 2022-03-06T04:56:01+05:30
పంచాయతీల్లో పావలా లెక్కలేదు... పనులెలా చేయాలి. ఉపాధి కింద చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. గ్రామాల్లో వలంటీరుకున్న విలువ ప్రజాప్రతినిధులమైన మాకు లేదు.
ఇక ప్రభుత్వంపై నమ్మకం పోయింది మండల సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచుల ఆగ్రహం, ఆవేదన
ఎర్రగుంట్ల, మార్చి 5: పంచాయతీల్లో పావలా లెక్కలేదు... పనులెలా చేయాలి. ఉపాధి కింద చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. గ్రామాల్లో వలంటీరుకున్న విలువ ప్రజాప్రతినిధులమైన మాకు లేదు. మమ్మల్ని ఏ అధికారీ లెక్కచేయడంలేదు. అయితే బిల్లుల్లో సంతకాల కోసం మాత్రమే వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో నిధులొస్తాయన్న నమ్మకం పోయింది. వస్తాయన్న ఆశాలేదు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని ఎంపీటీసీలు, సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే సరికి కాలం కాస్త అయిపోతుంది అంటూ ఎర్రగుంట్ల మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని, గ్రామాల్లో తాము పడుతున్న ఆగచాట్లపై ఆవేదనను తెలిపారు. శనివారం ఎర్రగుంట్ల మండల ప్రాదేశిక సభ్యుల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో సభాభవనంలో ఎంపీపీ మూలె లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ బాబు మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాన్ని త్వరతిగతిన పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరగా కలమల్ల ఎంపీటీసీ, 2వ వైస్‌చైర్మన్ పొన్నా శ్రీను మాట్లాడుతూ కనీసం కాలనీల్లో ఇప్పటి వరకు నీటి వసతి కల్పించలేదన్నారు. నీటి తోలకానికే రూ.50వేలు పడుతోందని లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T04:56:01+05:30 IST