ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమం.. సంక్షోభం!

ABN, First Publish Date - 2022-07-11T04:43:28+05:30

చాలీచాలని గదులు.. తిరగని ఫ్యాన్‌లు.. విరిగిన తలుపులు.. పొదల మధ్య భవనాలు.. పెచ్చులూడిపోతున్న శ్లాబులు.. పూర్తిస్థాయిలో కానరాని మరుగుదొడ్లు.. తాగునీటికీ తప్పని ఇబ్బందులు.. - ఇలా సంక్షేమ వసతిగృహాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో చాలా వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

మెళియాపుట్టి : నేలబొంతు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వసతి గృహాల్లో కనీస సదుపాయాలు కరువు
 అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్న వైనం
 బీసీ హాస్టళ్లకు ఇన్‌చార్జిలే దిక్కు
 అరకొర వసతులతో విద్యార్థులకు ఇబ్బందులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక వసతిగృహాలకు పూర్తిస్థాయి వార్డెన్‌లు లేరు. ఉన్నవారే రెండు, మూడు హాస్టళ్లకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సంక్షేమ వసతిగృహాలు.. సంక్షోభంలో పడ్డాయి. జిల్లాలో సోషల్‌ వెల్ఫేర్‌కు చెందిన 30 హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 20 ప్రీమెట్రిక్‌, 11 పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 2వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ హాస్టళ్లలన్నింటికీ సొంత భవనాలు ఉన్నా..  అవి శిథిలావస్థలకు చేరుకున్నాయి. కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. వర్షం కురిస్తే చాలు శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలసలోని సోషల్‌ వెల్ఫేర్‌ వసతిగృహాల ఆవరణలో భారీగా నీరు చేరిపోతుంటుంది. రణస్థలం, కోటబొమ్మాళి, టెక్కలి బాలికల వసతి గృహాలతో పాటు పాతపట్నం హాస్టల్‌కు  రెగ్యులర్‌ వార్డెన్‌లు లేరు. ఇక్కడ విద్యార్థుల పర్యవేక్షణ బాధ్యతను ఇతర హాస్టళ్ల వార్డెన్‌లకు అప్పగించారు. దీనివల్ల హాస్టళ్ల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు.

బీసీ వసతిగృహాల్లో కూడా ఇదే పరిస్థితి..
జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాలు 63 ఉన్నాయి. ఇందులో బాలుర హాస్టళ్లు 53, బాలికల హాస్టళ్లు 10 ఉన్నాయి. పది వసతి గృహాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. నాలుగు హాస్టళ్లు ఇతర ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. మొత్తం 4,857 మంది విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. 33 వసతి గృహాలకే పూర్తిస్థాయి వార్డెన్‌లు ఉన్నారు. 30 సంక్షేమ గృహాలకు ఇన్‌చార్జిలే దిక్కు. కింతలి, తాడివలస, ఫరీద్‌పేట, శ్రీముఖలింగం, బోరబద్ర, టెక్కలి, పాతపట్నం(బాలికలు), పొందూరు, బొరివంక, శ్రీకాకుళం, ఆమదాలవలస వసతిగృహాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఒకపక్క పూర్తిస్థాయిలో వార్డెన్‌లు లేక, మరోపక్క అద్దెభవనాల్లో  సౌకర్యాలు కల్పించక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మూడేళ్ల క్రితం సంక్షేమ వసతిగృహాలను ఉన్నతాధికారులతోపాటు ఏసీబీ అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించేవారు. కరోనా కారణంగా కొన్ని వసతి గృహాలను మూసివేశారు. ఇటీవల తెరుచుకున్నా వాటిపై నిఘా లేదు. ఇప్పటికైనా వసతిగృహాలకు పూర్తిస్థాయి వార్డెన్‌లను నియమించి అన్ని సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
 
ఎక్కడ చూసినా సమస్యలే!

మెళియాపుట్టి : నేలబొంతు ఆశ్రమ పాఠశాలలో సుమారు 200 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. సరిపడా భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకోవడానికి, పడుకోవడానికి, విద్యార్థుల లగేజీ కోసం ఒకే గదిని వినియోగిస్తున్నారు. నేలబొంతుతోపాటు భరణికోట, పెద్దలక్ష్మిపురం వసతిగృహాల్లో వంట శాలలు లేవు. విద్యార్థులు చెట్ల కిందే భోజనాలు చేస్తున్నారు. పెదలక్ష్మిపురం వసతిగృహంలో మరుగుదొడ్లు లేక.. విద్యార్థులు బయటకు వెళ్తున్నారు.

పాతపట్నం: అద్దెభవనాల్లోనే వసతిగృహాలు నిర్వహిస్తున్నారు. పాతపట్నం సాంఘిక సంక్షేమ సమీకృత వసతిగృహంలో ఫ్యాన్‌లు పనిచేయడం లేదు. ట్యూబ్‌లైట్లు లేవు. బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లలో తలుపులు విరిగిపోయాయి. కిటికీలకు మెస్‌లు లేక దోమల బెడద ఎక్కువగా ఉంది. అలాగే కళాశాల విద్యార్థుల కోసం పోస్టుమెట్రిక్‌ వసతిగృహాలు.. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలో బాలురుకు, గణేష్‌నగర్‌లో బాలికలకు నిర్వహిస్తున్నారు. బాలికల వసతిగృహంలో తాగునీటి సౌకర్యం లేదు. కామాక్షిఫంక్షన్‌ హాల్‌లో బీసీ బాలికల వసతిగృహం నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా ఫ్యాన్‌లు సక్రమంగా తిరగడం లేదు.

కోటబొమ్మాళి : కోటబొమ్మాళిలోని బీసీ, ఎస్సీ వసతిగృహాలు బీటలు వారుతున్నాయి. గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వసతిగృహాల్లో దుప్పట్లు లేవు.

జలుమూరు: జలుమూరులో బీసీ, ఎస్సీ బాలికల వసతిగృహాలు ఉన్నాయి. ఎస్సీ బాలికల వసతిగృహంలో నీటి ఎద్దడి నెలకొంది. అలాగే శ్రీముఖలింగంలో బీసీ వసతిగృహం అరకొర వసతులతో అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ వసతిగృహంలో 39 మంది విద్యార్థులకుగానూ మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. స్నానాల గదులు లేకపోవడంతో సమీపంలో వంశధార నదికి విద్యార్థులు వెళ్తున్నారు.  

వజ్రపుకొత్తూరు: పాతటెక్కలిలో బీసీ వసతిగృహం జనావాసాల మధ్య ఉండడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వసతిగృహంలో ఉండే విద్యార్థులు పాతటెక్కలి హైస్కూల్‌లో చదువుతున్నారు.

ఎల్‌.ఎన్‌.పేట : బాలురవసతి గృహం శ్లాబ్‌, డైనింగ్‌ హాల్‌ పెచ్చులూడిపోయి శిథిలావస్థకు చేరుకుంది.

సంతబొమ్మాళి: బోరుభద్రలో బీసీ బాలుర వసతిగృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 42 మంది విద్యార్థులు ఒకే భవనంలో ఉంటున్నారు. గతంలో తీసుకున్న మరో నాలుగు అద్దె భవనాలకు మరమ్మతులు చేపడుతున్నారు.  

మందస/హరిపురం :  మందస మండలం గుడారిరాజపురంలో బీసీ బాలుర వసతి గృహం పురాతన భవనంలో నడుస్తోంది. ఈ వసతిగృహంలో 90 మంది విద్యార్థులు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. భోజన శాల లేకపోవడంతో వరండాలోనే భోజనాలు చేస్తున్నారు. విద్యుత్‌ మోటారు అలంకారప్రాయంగా మారడంతో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రహరీ లేక.. రాత్రి సమయాల్లో అడవి జంతువులు, వన్యప్రాణులు సంచరిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు.

నందిగాం: నందిగాంలో బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో వసతి సమస్య వేధిస్తోంది. విద్యార్థినులకు పూర్తిస్థాయిలో తరగతి గదులు లేవు. అవసరమైన డైనింగ్‌హాల్‌ లేక అవస్థలు పడుతున్నారు.   భవనాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి.  

నరసన్నపేట: నరసన్నపేటలోని బీసీ బాలికలు, బాలికల సంక్షేమ వసతిగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇరుకు గదులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాలురు, బాలిక కళాశాల వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉర్లాం వసతి గృహం శ్మశానం పక్క ఉండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

సరుబుజ్జిలి: వెన్నెలవలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలలో పనిచేసిన ఉపాధ్యాయులంతా బదిలీపై వెళ్లిపోయారు. వసతి భవనాలు, భోజన శాల మధ్యలో పిచ్చిమొక్కలు, తుప్పలు పెరిగిపోయాయి.  

ఇచ్ఛాపురం/రూరల్‌  : బెల్లుపడ కాలనీ సమీపంలోని బీసీ వసతిగృహంలో వసతులు ఉన్నా.. విద్యార్థులు లేరు. వార్డెన్‌ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులను వసతిగృహంలో ఉంచేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. దీంతో గదులు, మంచాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం 15 మంది విద్యార్థులు ఉన్నారని వార్డెన్‌ తెలిపారు. అలాగే  కొలిగాం వసతిగృహానికి పక్కా భవనం ఉన్నా.. కొన్నింటికి కిటికి తలుపులు లేవు. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు అందలేదు. గత ఏడాది నుంచి కాస్మొటిక్‌ చార్జీలు కూడా ఇవ్వడం లేదు.

ఎచ్చెర్ల: ఫరీద్‌పేట గ్రామంలో 1983-84 సంవత్సరంలో ఏర్పడిన బీసీ హాస్టల్‌కు ఇప్పటికీ శాశ్వత భవనం సమకూరలేదు. చాలీచాలని అద్దె భవనంలో హాస్టల్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ హాస్టల్‌లో 35 మంది విద్యార్థులు ఉండగా అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారు.  

సోంపేట /రూరల్‌: యర్రముక్కాం వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. మామిడిపల్లి బాలుర వసతి గృహానికి ప్రహరీ లేదు. గదులకు తలుపులు విరిగిపోయాయి. రాత్రి వేళల్లో పాములు సంచరిస్తుండడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.   

ఆమదాలవలస : మెట్టక్కివలసలో కళాశాల విద్యార్థినుల వసతిగృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు లేవు. బీసీ, ఎస్సీ బాలుర వసతిగృహాలు ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నా.. మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. ఎస్సీ బాలురవసతి గృహంలో శిథిలావస్థకు చేరి పెచ్చులూడిపోతోంది.

గార : బందరువానిపేటలో 17 ఏళ్ల కిందట నిర్మించిన బాలికల వసతిగృహం భవనం శ్లాబు పెచ్చులూడిపోతోంది. ఇక్కడ 65 మంది బాలికలు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం బయెమెట్రిక్‌ పనిచేయకపోవడంతో రిజిస్టర్‌పై హాజరు వేస్తున్నారు. తాగునీటి సమస్య వేధిస్తోంది. అంపోలులోని బీసీ బాలుర వసతిగృహంలో కూడా బయోమెట్రిక్‌ పనిచేయడం లేదు. విద్యార్థులకు యూనిఫారం, పుస్తకాలు అందజేయాల్సి ఉంది. గారలో సమీకృత వసతిగృహ సముదాయంలో మౌలిక వసతులు ఉన్నా కేవలం బీసీ విద్యార్థులు మాత్రమే వసతి పొందుతున్నారు. ఇక్కడ కూడా బయోమెట్రిక్‌ పనిచేయడం లేదు.  

లావేరు: అదపాక బీసీ బాలుర వసతిగృహంలో కొన్ని గదులకు తలుపులు, ద్వారాలు విరిగిపోయాయి. మురపాక బీసీ బాలుర వసతిగృహం శిథిలావస్థకు చేరుకుంది. వీటితో పాటు లావేరు, మెట్టవలస వసతిగృహాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ సౌకర్యం లేదు. ఇప్పటివరకు విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లు, పెట్టెలను అందజేయలేదు.  

పొందూరు : తాడివలస, కింతలి, పొందూరులోని బాలుర వసతిగృహాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు లేక విద్యార్థులు నేలపైనే నిద్రిస్తున్నారు.

రణస్థలం: బీసీ బాలుర వసతిగృహం శిథిలావస్థకు చేరుకుంది. ఈ వసతిగృహంలో  6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 75 మంది ఉండగా.. మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. శ్లాబు పెచ్చులూడి.. మరోవైపు తలుపులు పాడైపోయవడంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు.  
కవిటి : పెద్దకర్రివానిపాలెం వసతి గృహం చుట్టూ పిచ్చిమొక్కలు, పొదలు పేరుకుపోయాయి. తలుపులు విరిగిపోయాయి. విద్యార్థులకు విషసర్పాల భయం వెంటాడుతోంది. రాజపురం వసతిగృహంలో కూడా సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అద్దెభవనంలో కొనసాగుతున్న బొరివంక హాస్టల్‌లో విద్యార్థులు లేరు.  
 
 

Updated Date - 2022-07-11T04:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising