ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ప్రసాదానికి.. సిక్కోలు బెల్లం

ABN, First Publish Date - 2022-12-10T23:58:41+05:30

సిక్కోలు బెల్లానికి అరుదైన అవకాశం లభించింది. టీటీడీ దీన్ని శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగించనుంది. ఈమేరకు ఇక్కడి రైతులతో ఒప్పందం చేసుకుంది.

చెరకు రసంతో బెల్లం తయారు చేస్తున్న సేపానపేట రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ గ్రామాల రైతులతో టీటీడీ ఒప్పందం

సేంద్రియ విధానంలో చెరకు సాగుచేయడమే కారణం

(ఆమదాలవలస)

సిక్కోలు బెల్లానికి అరుదైన అవకాశం లభించింది. టీటీడీ దీన్ని శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగించనుంది. ఈమేరకు ఇక్కడి రైతులతో ఒప్పందం చేసుకుంది. ఆమదావలస మండలంలోని నిమ్మతొర్లాడ, మర్రికొత్తవలస, గరిమెల్ల కొత్తవలస, కొరపాం, వంజంగి, దూసి, దిబ్బలపేట గ్రామస్థులు. దశాబ్దాలుగా ఈ గ్రామ రైతులు బెల్లం తయారుచేస్తున్నారు. గతంలో ఆమదాలవలసలో చక్కెర కర్మాగారం ఉన్నప్పుడు వరి కంటే చెరకును అధికంగా సాగుచేసేవారు. అయితే ఫ్యాక్టరీ మూతతో తామే స్వయంగా బెల్లం తయారీచేసి విక్రయిస్తున్నారు. సరైన మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో గిట్టుబాటు అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో నేరుగా టీటీడీ బెల్లం సరఫరాకు ఒప్పందం చేసుకోవడంతో అటు గిట్టుబాటుతో పాటు ఇక్కడి బెల్లంకు గుర్తింపు లభించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సేంద్రియ సాగు ప్రత్యేకత

పూర్తిగా సేంద్రియ సాగు విధానంలో చెరకు సాగు ఇక్కడ ప్రత్యేకం. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహా, సూచనలతో ఇక్కడి రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. నిమ్మతొర్లాడలో 100 ఎకరాలు, మర్రికొత్తవలసలో 70, కొరపాంలో 120, గరిమెల్ల కొత్తవలసలో 20 ఎకరాల్లో చెరకు సాగుచేస్తున్నారు. వంజంగి, దూసి,దిబ్బలపేటలో సైతం వీరినే అనుసరిస్తున్నారు. అటు వరితో పాటు చెరకు సాగుచేసి ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి రైతులకు బెల్లం తయారీలో 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఏటా నవంబరులో బెల్లం తయారీకి ఉపక్రమిస్తారు. ఏప్రిల్‌ వరకూ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 50 గానుగ క్రషర్లు ఉన్నాయి. పూర్తి సేంద్రియ సాగు విధానంతో తయారుచేసే ఈ బెల్లం శుచి, శుభ్రతతో పాటు పోషక విలువలు అధికం. దీనిని గుర్తించిన ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రేవతి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో బెల్లం సరఫరాకు ఒప్పందం కుదిరింది. ఏటా 180 టన్నులు అందించేందుకు అగ్రిమెంట్‌ కుదిరింది. అగ్రిమెంట్‌ ప్రకారం 33 మంది రైతులను మూడు గ్రూపులుగా విభజించారు. ఎటువంటి రసాయనాలు లేకుండా పంట పండించాలన్నది నిబంధన. ఏటా బెల్లం తయారీ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు శాంపిల్స్‌ పంపిస్తారు. పరీక్షల్లో ఎటువంటి రసాయనాలు లేవని తేలితేనే బెల్లం సరఫరాకు టీటీడీ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుంది. ఏ గ్రూపులోనైనా రసాయనాలు వినియోగించినట్టు తేలితే ఆ రైతుల బెల్లం తిరస్కరిస్తామన్నది ఈ ఒప్పంద సారాంశం అయితే మార్కెట్‌ ధర కంటే పది నుంచి 15 శాతం అదనంగా చెల్లించడానికి టీటీడీ ముందుకు రావడం, శ్రీవారి సేవలో భాగం కావడంతో పూర్తి సేంద్రి, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చెరకు సాగుచేస్తామని రైతులు చెబుతున్నారు.

ఎంతో కష్టం

ఎకరాకు 45 టన్నుల చెరకు రసం దిగుబడి వస్తుంది. టన్ను చెరకు రసంతో 100 కేజీల వరకూ బెల్లం ఉత్పత్తి అవుతుంది. శ్రమ, పెట్టుబడి పోనూ.. ఎకరాకు సుమారు రూ.40 నుంచి రూ.50 వేల వరకూ మిగులుతుందని రైతులు చెబుతున్నారు. అయితే ఇది శ్రమతో కూడుకున్న పని అని.. వాతావరణం అనుకూలిస్తేనే గిట్టుబాటవుతుందంటున్నారు. నాణ్యమైన బెల్లం అందిస్తున్నా మార్కెటింగ్‌ సదుపాయం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా.. పూర్తి సేంద్రియ విధానంతో తయారుచేస్తున్నా.. అందుకు తగ్గట్టు ప్రోత్సాహం మాత్రం లభించడం లేదని వాపోతున్నారు. బెల్లం తయారీ ప్రక్రియ కూడా కష్టతరమని.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న బెల్లం నాణ్యత దెబ్బతిని ఎందుకూ పనికి రాకుండా పోతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కెటింగ్‌ సదుపాయం, గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

మా అదృష్టం

దశాబ్ద కాలంగా సేంద్రియ సాగు విధానంలో చెరకు సాగుచేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ప్రోత్సహించడంతో ప్రకృతి సాగు విధానాన్ని కూడా ప్రారంభించాను. టీటీడీ వారు వచ్చి బెల్లం సరఫరాకు ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉంది. అది విజయవంతమైతే మాత్రం శ్రీవారికి సేవచేసే భాగ్యంతో పాటు సాగు గిట్టుబాటు అవుతుంది.

-ముద్దాడ కృష్ణారావు, ఆదర్శరైతు, నిమ్మతొర్లాడ

గిట్టుబాటు కల్పించాలి

నా చిన్ననాటి నుంచే గానుగ ఆడించే అనుభవం ఉంది. సుగర్‌ ఫ్యాక్టరీ ఉన్నంతవరకూ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వం ఫ్యాక్టరీని మూసివేసింది. తెరిపించే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. అందుకే ఈ ప్రాంతంలో రైతులే నేరుగా క్రషర్లు ఏర్పాటుచేసి బెల్లం తయారుచేస్తున్నారు. టీటీడీతో ఒప్పందంతోనైనా మాకు గిట్టుబాటు కలిగితే అదే మహా భాగ్యంగా భావిస్తాం.

-నక్క అప్పారావు, రైతు, మర్రికొత్తవలస

Updated Date - 2022-12-10T23:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising