అధిక వడ్డీ ఆశ చూపి
ABN, First Publish Date - 2022-10-18T04:46:25+05:30
చిన్న చిన్న రుణాలు అందించి ప్రజలకు దగ్గరయ్యాడు. 20 ఏళ్లుగా స్నేహం చేస్తూ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తీరా అధిక వడ్డీ ఆశ చూపించి వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. రణస్థలం మండలం బంటుపల్లిలో వెలుగు చూసిం ది ఈ ఘరానా మోసం.
రూ.కోట్లు సేకరించిన ఫైనాన్స్ వ్యాపారి
91 మందికి ఐపీ నోటీసులు
లబోదిబోమంటున్న బాధితులు
రణస్థలం,
అక్టోబరు 17: చిన్న చిన్న రుణాలు అందించి ప్రజలకు దగ్గరయ్యాడు. 20 ఏళ్లుగా
స్నేహం చేస్తూ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తీరా అధిక వడ్డీ ఆశ చూపించి
వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. రణస్థలం మండలం
బంటుపల్లిలో వెలుగు చూసిం ది ఈ ఘరానా మోసం. బాధితుల వివరాల మేరకు..
తూర్పుగోదావరి జిల్లా అన పర్తికి చెందిన టి.వెంకట కృష్ణారెడ్డి..
స్థానికంగా ఉంటూ వడ్డీ వ్యాపారం చేస్తుండే వాడు. బంటుపల్లి గ్రామస్థులకు
చిన్న చిన్న రుణాలు అందించి ఫైనాన్స్ చేస్తుండే వాడు. 20 సంవత్సరాల పాటు
ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండడంతో అందరికీ ఆయనపై నమ్మకం కుదిరింది. ఈ
నేపథ్యంలో అధిక వడ్డీకి ఆశ చూపించాడు. దీంతో బంటుపల్లి గ్రామస్థులు
పెద్దమొత్తంలో నగదు ఆయనకు ముట్టజెప్పారు. కాయాకష్టం చేసుకున్న వారు సైతం
ఆయనకు నగదు అందించారు. అటు వెంకట కృష్ణారెడ్డి కూడా సకాలంలో వడ్డీతో నగదు
చెల్లిస్తుండడంతో మరి కొంతమంది నగదు ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో
రూ.కోట్లు సేకరించాడు. అందులో బంటుపల్లి గ్రామస్థులే 91 మంది ఉన్నారు.
స్థానికంగా పరిశ్రమల్లో ఉపాధి తగ్గడంతో వీరంతా నగదు కోసం కృష్ణారెడ్డిని
అడిగారు. అదిగో ఇదిగో అంటూ ఆయన కాలయాపన చేస్తూ వచ్చాడు. గ్రామంలో ఆస్తిని
ఆమ్మి సెటిల్ చేస్తానని చెబుతూ వచ్చాడు. ఇటీవల ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో
తామంతా మోసపోయా మని బాధితులు గుర్తించారు. ఈ నెల 12న రూ.2.10 కోట్లకు
సంబంధించి 91 మందికి ఐపీ నోటీసులు పంపించాడు. దీంతో బాధితులు
లబోదిబోమంటున్నారు. తొలుత స్థానిక పెద్దలను ఆశ్రయించారు. తాజాగా
కలెక్టరేట్ స్పందన విభాగంలో అధికారులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని
కోరారు.
నమ్మించి మోసం
స్థానిక బీరు పరిశ్రమలో పనిచేసి ఉపాధి
పొందుతున్నాం. గత 20 సంవత్సరాలుగా కృష్ణారెడ్డితో పరిచయం ఉంది. ఏ వస్తువు
కొనుగోలు చేయాలన్నా కృష్ణారెడ్డి సహకారం తీసుకునేవాళ్లం. ప్రజలను అంతగా
నమ్మించి మోసం చేశాడు. నేను రూ.2 లక్షలు ఇచ్చి మోసపోయాను.
టి.అప్పారావు, బంటుపల్లి
‘స్పందన’లో బాధితుల ఫిర్యాదు
కలెక్టరేట్,
అక్టోబరు 17: ఫైనాన్స్ వ్యాపారి చేతిలో మోసపోయిన బంటుపల్లికి చెందిన
బాధితులు సోమవారం శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలోని కలెక్టర్ స్పందన
కార్యక్రమంలో ఫిర్యాదుచేశారు. తమకు న్యాయం చేయాలని జేసీకి వినతిపత్రం
అందించారు. సమగ్ర విచారణ చేసి వ్యాపారి నుంచి డబ్బులు ఇప్పించాలని
విజ్ఞప్తి చేశారు. అనంతరం స్పందన విభాగం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎంతో
కష్టపడి దాచుకున్న సొమ్మును అతడి వద్ద పెట్టామని.. ఇప్పుడు ఐపీ పెట్టినట్టు
కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు స్పందించి తమకు నగదు ఇప్పించేలా చర్యలు
చేపట్టాలని కోరారు. వారి వెంట టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు
ఉన్నారు.
Updated Date - 2022-10-18T04:46:25+05:30 IST