తేజకు తెలుసు..!
ABN, First Publish Date - 2022-05-19T06:23:16+05:30
తేజకు తెలుసు..!
పార్శిల్‌లో ఎపిడ్రిన్ ఉన్నట్టు తెలిసే పంపించాడు
మాఫియా నుంచి భారీగా ముట్టిన ముడుపులు
హైదరాబాద్‌లో పార్శిల్ తెరవకుండా ఏర్పాట్లు
ప్రధాన బ్రాంచ్‌లో ముగ్గురిని కొనేసిన కొరియర్ ఉద్యోగి
ఎపిడ్రిన్ పార్శిల్ కేసులో వెలుగులోకి కొత్త కోణాలు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : చీరల పార్శిల్‌లో ఎపిడ్రిన్ ఉందని బెంగళూరులోని కస్టమ్స్ అధికారులు గుర్తించగానే ముందుగా అరెస్టయిన యువకుడు గుత్తుల తేజ. భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్‌లో ఉద్యోగిగా ఉన్న తేజ ఆ పార్శిల్‌కు అనవసరంగా తన ఆధార్ కార్డును ఇచ్చి కస్టమ్స్ అధికారుల వద్ద బుక్కైపోయాడని అంతా జాలిపడ్డారు. అయితే, కేసులో విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. చెన్నై నుంచి వచ్చిన చీరల పార్శిల్‌లో ఎపిడ్రిన్ ఉన్న విషయం తేజకు ముందే తెలుసని విచారణలో వెల్లడైంది. ఆ పార్శిల్ తీసుకొచ్చిన అరుణాచలంతో ఆర్థిక సంబంధాల కారణంగానే తేజ తన ఆధార్‌కార్డు ఇచ్చాడని తేలింది. పోలీస్ కస్టడీలో అరుణాచలం చెప్పిన వివరాలతో ఎపిడ్రిన్ పార్శిల్ వ్యవహారంలో తేజ, అరుణాచలం మధ్య మంచి అవగాహన ఉన్నట్టు బయటపడింది. అరుణాచలం జనవరి 30న చీరల్లో ఎపిడ్రిన్ పెట్టిన పార్శిల్‌ను ఇక్కడి నుంచే పంపించాడు. దీనికి ముందు నాలుగైదుసార్లు అతడు ఈ కొరియర్ సెంటర్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు ఊరగాయలు పార్శిల్ చేశాడని తేజ చెప్పిన మాటలు కట్టుకథే అని పోలీసులు తేల్చారు. వాస్తవానికి అరుణాచలం ఆ నాలుగైదుసార్లు కూడా చీరల పార్శిల్ తీసుకొచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య బంధం బలపడింది. ఆ సమయంలోనే అరుణాచలం త్వరలో తాను తీసుకొచ్చే పార్శిల్‌ను ఎలాంటి తనిఖీలు లేకుండా పంపితే మంచి ఆదాయం ఉంటుందని తేజకు ఆఫర్ ఇచ్చాడు. తేజ సరేనన్నాడు. వాస్తవానికి ఇతర దేశాలకు పంపే పార్శిల్‌ను ఆ కార్యాలయంలోనే ప్యాక్ చేయాలి. దాన్ని పంపే వ్యక్తి ఆధార్‌కార్డు ఫొటోస్టాట్ కాపీని కచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. అరుణాచలం తీసుకొచ్చిన పార్శిల్‌ను తేజ తనిఖీ చేయలేదు. పైగా తన ఆధార్‌కార్డును ఆ పార్శిల్‌కు ఇచ్చాడు. దీనికి సంబంధించి అరుణాచలం నుంచి భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నాడు. భారతీనగర్‌లోని డీఎస్‌టీ కొరియర్ నుంచి పార్శిళ్లు ముందుగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి వెళ్తాయి. వాటిని అక్కడి సిబ్బంది తెరిచి ఏయే పదార్థాలు ఉన్నాయో చూస్తారు. అలా చేయకుండా ఉండటానికి ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులు ఎర్రం శ్యామ్‌సుందర్, కీర్తిపాటి ప్రవీణ్‌వర్మ, తుమ్మల శ్రీనివాస్‌కు తేజ తనకు ముట్టిన దాని నుంచి కొంత ఇచ్చాడు. జనవరి 30న డీఎస్‌టీ కార్యాలయం నుంచి వెళ్లిన అన్ని పార్శిళ్లను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీ చేశారు. రామన్ తంగేవి పేరున ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన చీరల పార్శిల్‌ను మాత్రం తనిఖీ చేయలేదు. దాన్ని బెంగళూరుకు పంపేశారు. అక్కడ ఈ పార్శిల్‌ను స్కానింగ్ చేసే డీహెచ్‌ఎల్ సంస్థ స్కానర్‌ను దాటుకుని ఎపిడ్రిన్ విమానాశ్రయంలోకి వెళ్లడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. డీఎస్‌టీ కొరియర్ సిబ్బందికి ముడుపులు ఇచ్చి దాటించినట్టుగానే బెంగళూరులోని డీహెచ్‌ఎల్ సంస్థలోని ఉద్యోగులకు ఈ మాఫియా డబ్బు ఎర వేసిందని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.
Updated Date - 2022-05-19T06:23:16+05:30 IST