రాళ్ల దాడి చేస్తే 324 సెక్షన్ పెట్టారా?
ABN, First Publish Date - 2022-11-08T04:28:07+05:30
ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతా అధికారిపై రాయితో దాడి చేస్తే పోలీసులు ఐపీసీ 324 సెక్షన్ కింద మాత్రమే కేసు నమోదు చేశారా? అని.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ టీడీపీ నేతల ఎదుట విస్మయం వ్యక్తం చేశారు.
డీజీపీతో మాట్లాడతానని గవర్నర్ హామీ
నందిగామ ఘటనపై గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
విజయవాడ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి) : ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతా అధికారిపై రాయితో దాడి చేస్తే పోలీసులు ఐపీసీ 324 సెక్షన్ కింద మాత్రమే కేసు నమోదు చేశారా? అని.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ టీడీపీ నేతల ఎదుట విస్మయం వ్యక్తం చేశారు. నందిగామలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబుపై అగంతకులు రాయి విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన సీఎ్‌సవో మధుబాబుకు గాయాలయ్యాయి. దీనిపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, గద్దె రామ్మోహనరావు, తంగిరాల సౌమ్య, బచ్చుల అర్జునుడు, శ్రీరాం తాతయ్య విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ హరిచందన్‌ను సోమవారం కలిశారు. ఘటన జరిగిన పరిస్థితిని, తర్వాత జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరించారు. ఘటన జరిగిన తర్వాత తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించలేదని తంగిరాల సౌమ్య గవర్నర్‌కు వివరించారు. తర్వాత ఫిర్యాదును స్వీకరించినా ఐపీసీ 324 సెక్షన్ నమోదు చేశారని చెప్పారు.
ఇది విన్న తర్వాత గవర్నర్ ‘రాళ్ల దాడి చేస్తే 324 సెక్షన్ పెట్టారా..?’ అని టీడీపీ నేతల ఎదుట విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై అన్ని అంశాలు పరిశీలించి న్యాయం చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. అనంతరం రాజ్‌భవన్ బయట టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాల్సిన పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖపట్నంలో మంత్రుల కారు బానట్‌పై కొట్టినందుకు హత్యాయత్నం కేసులు నమోదు చేసి, గాయాలు తగిలిన ఘటనపై 324 సెక్షన్ నమోదు చేయం పోలీసుల ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ కక్షలను సాధించడానికి పోలీసులను ఇంతదారుణంగా ఉపయోగించడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. జరిగిన పరిణామాలపై డీజీపీతో మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు.
Updated Date - 2022-11-08T04:28:08+05:30 IST