సచివాలయ సంకటం
ABN, First Publish Date - 2022-12-31T03:09:35+05:30
గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య, విద్య, విద్యుత్తు, వ్యవసాయ, పోలీసు విభాగాలు ఎప్పటి నుంచో పని చేస్తున్నాయి. వాటిని బలోపేతం చేయాల్సిందిపోయి... వాటికి పోటీగా, సమాంతరంగా సచివాలయాల్లో అగ్రికల్చర్,
మూడేళ్లయినా తీరని కష్టాలు
పర్యవేక్షణ లేదు.. సమన్వయం కుదరదు
ఒక్కో సచివాలయంలో 14 మంది సిబ్బంది
ఇతర శాఖలకు సమాంతరంగా పోస్టులు
మండల స్థాయి అధికారుల హైజాక్
వారి నియంత్రణలోనే సచివాలయ సిబ్బంది
కొందరిపైనే పని ఒత్తిడి.. కొందరికి పనే లేదు
‘సేవలు’ పెంచాలనే పేరుతో ప్రభుత్వ ఒత్తిళ్లు
టార్గెట్ల కోసం ల్యామినేషన్లు, కరెంటు బిల్లులు
ఏం చేస్తున్నారో తెలియదు! ఎందుకు చేస్తున్నారో తెలియదు! ఏ పని చేయాలో తెలియదు! ఎవరి ఆధ్వర్యంలో పని చేయాలో తెలియదు! చాంతాడులా ‘సేవల జాబితా’! అందులో ప్రజలకు ఎన్ని అందుతున్నాయో తెలియదు! కేవలం... ఏదో చేయాలని అనిపించుకునేందుకు, ‘చేస్తున్నాం’ అని చెప్పుకొనేందుకే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారా? ఇప్పుడు ఆ సచివాలయాల సిబ్బందిని సైతం రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నాలు మొదలయ్యాయా? తెల్లవారింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి చేస్తూ, వేధిస్తూ ఈ సర్కారు సాధిస్తున్నదేమిటి? గ్రామ, వార్డు సచివాలయాలపై ఎన్నెన్నో ప్రశ్నలు!
సచివాలయ వ్యవస్థ ఏర్పాటై మూడేళ్లు దాటినా
ఇప్పటికీ అస్తవ్యస్త పరిస్థితులే! ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తే దానికో నిర్దిష్ట లక్ష్యం ఉండాలి. మరో వ్యవస్థకు అది పోటీగానో, సమాంతరంగానో ఉండకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. సిబ్బందికి కష్టాలు.. జనానికీ ఇబ్బందులు! ఎవరిని సంతృప్తిపరుస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. సచివాలయాల్లో ఈ అస్తవ్యస్త పరిస్థితులు, సంకట స్థితి ఎందుకు కొనసాగుతోంది? ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం...
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య, విద్య, విద్యుత్తు, వ్యవసాయ, పోలీసు విభాగాలు ఎప్పటి నుంచో పని చేస్తున్నాయి. వాటిని బలోపేతం చేయాల్సిందిపోయి... వాటికి పోటీగా, సమాంతరంగా సచివాలయాల్లో అగ్రికల్చర్, ఇంజనీరింగ్, విద్యుత్తు, హెల్త్, మహిళా పోలీసు, ప్లానింగ్ పేరుతో వేర్వేరు కార్యదర్శులను నియమించారు. మరి... మండల, గ్రామ స్థాయిలో అదే విభాగాలకు చెందిన సిబ్బంది ఎందుకు ఉన్నట్లు? వాళ్లేం చేయాలి? ఒక్కో గ్రామ/వార్డు సచివాలయంలో కనీసం 14 మంది సిబ్బందిని నియమించారు. వీరందరినీ పర్యవేక్షించే బాధ్యత అడ్మిన్ సెక్రటరీది. అంటే... పంచాయతీ కార్యదర్శిది. కానీ... సిబ్బంది ఎవరూ ఆయన మాటవినే పరిస్థితి లేదు. ఎవరికి వారిని ఆయా శాఖల మండలస్థాయి అధికారులు ‘హైజాక్’ చేసేశారు. పలు శాఖలకు సంబంధించిన కార్యదర్శులు సచివాలయానికి కాకుండా ఆయా శాఖల మండలస్థాయి అధికారులకే బాధ్యులుగా ఉన్నారు. దీంతో గ్రామ, వార్డ్ సచివాలయాల్లో అడ్మిన్ సెక్రటరీ పాత్ర నామమాత్రంగా మారింది. ప్రభుత్వం సమన్వయ బాధ్యతలు అడ్మిన్ సెక్రటరీకి అప్పజెప్పినా... అందరూ ఒకేస్థాయి ఉద్యోగులు కావడంతో ఒకరి ఆదేశాలను మరొకరు ఖాతరు చేయడం లేదు. కానీ... పలు శాఖలకు సంబంధించిన పనుల విషయంలో మాత్రం ఉన్నతాధికారులు అడ్మిన్‌ను బాధ్యులుగా చేస్తున్నారు. పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లే వార్డు సచివాలయంలోని కార్యదర్శులపై పెత్తనం చలాయిస్తున్నారు. వెరసి... సచివాలయాల సిబ్బంది నియంత్రణ, సమన్వయం లేకుండా ‘ఎవరికివారే’ అన్నట్లుగా పని చేస్తున్నారు. ప్రభుత్వం అన్నిస్థాయుల్లో ఒత్తిడి తెస్తున్నా ఫలితాలు రాబట్టలేని పరిస్థితి నెలకొంది.
ఎవరు ఏ పనిచేస్తున్నారు?
గ్రామ సచివాలయాల్లో డేటా ఎంట్రీ చేసే డిజిటల్ అసిస్టెంట్‌కు చేతినిండా పని! మహిళా పోలీసులకు ఏ పని చెప్పాలో తెలియక... వివాహేతర సంబంధాలు, సారా విక్రేతల వివరాలు తెలుసుకోవాలంటూ ‘పిచ్చి ప్రశ్నలు’ అడిగిస్తున్నారు. వారి జాబ్‌చార్ట్ కాగితాలకే పరిమితమైంది. మత్స్యకార గ్రామాల్లో ‘ఫిషరీస్ అసిస్టెంట్’ను నియమించారు. ప్రస్తుతం మత్స్యకారులకు సంబంధించిన పథకాలే అందుబాటులో లేవు. వాళ్లంతా ఖాళీగా ఉన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్‌దీ ఇదే పరిస్థితి. విద్యుత్‌శాఖ సిబ్బంది ఉండగా సచివాలయంలోని ఎనర్జీ అసిస్టెంట్ ఏం చేయాలో తెలియదు! ఇలా ఎందులోనూ, ఎక్కడా సమన్వయం, స్పష్టత కనిపించడం లేదు.
పరిష్కరించే వ్యవస్థ ఏదీ?
సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు వాటి పరిధిలోని గ్రామాల్లో, వార్డుల్లో నవరత్నాల పథకాల అమలుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. వివిధ యాప్‌ల ద్వారా దరఖాస్తుల ప్రక్రియ చేపడుతున్నారు. అయితే, దరఖాస్తుల ప్రక్రియలో మాత్రమే సిబ్బంది ప్రమేయం ఉంటుంది. మంజూరు అధికారం వారిది కాదు. అయినా సరే... పథకాలు అందకపోతే సచివాలయ సిబ్బందినే నిలదీస్తున్నారు. వారికి సమాధానాలు చెప్పలేక దాడులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పైస్థాయిలో ఈ సమస్యలను పరిష్కరించే జవాబుదారీ వ్యవస్థ లేక సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. నెల్లూరులో మంజుల అనే ఒక ఒంటరి మహిళ ఈ ప్రభుత్వం రాక ముందు నుంచి సామాజిక పెన్షను పొందుతోంది. ఆమెను భర్త వదిలేసి 8ఏళ్లుగా కనపడటం లేదు. గతంలో పెన్షను మంజూరుచేసినప్పుడు ఎలాంటి సర్టిఫికెట్‌లు కోరలేదు. అయితే ఇప్పుడు ఆమె భర్త పేరు రేషన్‌కార్డ్‌లో ఉందంటూ పెన్షన్‌ను తొలగించారు. రేషన్‌కార్డ్‌లో ఉన్న ఆమె భర్త పేరు తొలగించాలంటే ఆయనే బయోమెట్రిక్(వేలిముద్ర) పెట్టాలంటూ మెలికపెట్టారు. అసలు భర్తే కనపడకుండా వెళ్లారంటుంటే ఆయన వేలిముద్ర తెచ్చేదెలా? అని ఆమె వాపోతోంది.
ఎనర్జీ అసిస్టెంట్ సచివాలయానికి రాకుండా సబ్ స్టేషన్ల పరిధిలోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సచివాలయాల్లో అటెండెన్స్ కూడా అవసరం లేకుండా చేశారు. దీంతో సచివాలయాల్లో ఏదైనా విద్యుత్‌కు సంబంధించిన సమస్యలుంటే డిజిటల్ అసిస్టెంటే చూసుకోవాల్సి వస్తోంది. మహిళా పోలీసు అయితే ఒక్క బాధ్యత కూడా సచివాలయంలో నిర్వహించే పరిస్థితి లేదు. హెల్త్ సెక్రటరీ ఎప్పుడూ ఆయా పీహెచ్‌సీ, యూహెచ్‌సీ పరిధిలో పనిచేస్తున్నారు. దీంతో గ్రామ, వార్డుల్లో ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే పట్టించుకునే వారు లేరు.
‘అడ్మిన్’ గోడు..
గుంటూరు నగరంలో ఇటీవల ఓ వార్డు సచివాలయంలో సరిగా బాధ్యతలు నిర్వహించడంలేదంటూ శానిటరీ సెక్రటరీని సస్పెండ్ చేశారు. అక్కడి అడ్మిన్ సెక్రటరీని కూడా సస్పెండ్ చేశారు. సచివాలయాల్లో ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకోమని ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చిందని, పర్యవేక్షించే అధికారం తమకివ్వలేదని అడ్మిన్ సెక్రటరీలు పేర్కొంటున్నారు. తమకు ఏ అధికారముందని శానిటరీ సెక్రటరీని పర్యవేక్షించగలనని వాపోతున్నారు.
‘సేవ’లు మిథ్య
గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 540 రకాల సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటోంది. కానీ అదంతా మిథ్యే. కులం, ఆదాయం, నేటివిటీ ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డ్, అడంగల్, ఈసీ, కరెంట్ బిల్లులు చెల్లింపులు, పట్టణాల్లో నీటి పన్నుల చెల్లింపులు, ఎప్పుడో అవసరమైనప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల జారీవంటి 10రకాల సేవలు మాత్రమే సక్రమంగా అందుతున్నాయి. ‘ఎక్కువ సేవలు అందిస్తున్నాం’ అని చెప్పుకునేందుకు గతంలో ‘మీ-సేవ’ ద్వారా అందే సేవలన్నింటినీ సచివాలయాలకు బదిలీ చేశారు. మీ-సేవ ద్వారా ధ్రువపత్రాలు, సేవలు త్వరిత గతిన అందేవని... సచివాలయాలకు బదిలీ చేసిన తర్వాత బాగా ఆలస్యమవుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇంటర్నెట్ సరిగా అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. రోజుకు ఇన్నిరకాల సేవలు, ఇంతమందికి అందించాలంటూ ప్రభుత్వం టార్గెట్ పెడుతోంది. టార్గెట్లు పూర్తి చేయకపోతే మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు చుక్కలు చూపిస్తున్నారు. ‘జనం వస్తే సేవలు అందిస్తాం. రాకున్నా అందించడం ఎలా?’ అని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు.
సింగిల్ విండో సిస్టమ్.. ఒక్కరికే కష్టం
గ్రామ, వార్డ్ సచివాలయాల్లో సింగిల్ విండో సిస్టం పెట్టి ఆయా సచివాలయాలకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ తీసుకుని కంప్యూటర్‌లో పొందుపరిచి అప్‌లోడ్ చేసే బాధ్యతలు డిజిటల్ అసిస్టెంట్‌కు కల్పించారు. దీంతో డిజిటల్ అసిస్టెంట్, పట్టణాల్లో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అదే సమయంలో మిగిలిన సెక్రటరీలపై అంతగా పని ఒత్తిడి ఉండటంలేదు. అందరూ ఒకేస్థాయి ఉద్యోగులైనప్పటికీ సింగిల్ విండో సిస్టం చూస్తున్న తమను కంప్యూటర్ ఆపరేటర్‌గా మార్చారని ఆరోపిస్తున్నారు. తాము ఇచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఆయా పథకాలు మంజూరు కాకపోతే ప్రజలు నేరుగా డిజిటల్ అసిస్టెంట్లను నిలదీస్తున్నారు. ప్రజలతో పాటు అధికారులు, రాజకీయ నేతల దూషణలూ ఎక్కువయ్యాయి. లబ్ధిదారులకు ఎందుకు సదరు పథకం మంజూరు కాలేదో డిజిటల్ అసిస్టెంట్లకూ సమాచారం ఉండటంలేదు. పెన్షన్లు, రేషన్లు కార్డులు, ఇతర పథకాలు రద్దు చేసినప్పుడల్లా సిబ్బందిపై ఒత్తిళ్లు పెరుగుతూనే ఉన్నాయి.
రిజిస్ట్రేషన్లు ఏవీ?
సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటం చేసింది. దీని కోసం పైలట్ ప్రా జెక్టు కూడా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏయే గ్రా మ, వార్డు సచివాలయాలు రిజిస్ట్రేషన్ సేవలందిస్తా యో కూడా ఉత్తర్వులిచ్చారు. జగనన్న గృహ హక్కు పత్రాలకు ఓటీఎస్ అమలు చేసే విషయంలో తప్ప ఆ తర్వాత ఎక్కడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టలేదు.
Updated Date - 2022-12-31T03:09:37+05:30 IST