సచివాలయాల సిమెంట్ స్వాహా
ABN, First Publish Date - 2022-10-07T07:41:00+05:30
సచివాలయాల సిమెంట్ స్వాహా
వేల టన్నులు మాయం చేసిన వైసీపీ నేతలు
ఒక్క డివిజన్‌లోనే 990 టన్నులు గల్లంతు
గోదాములు లేనిచోట వైసీపీ నేతల ఇళ్లలో నిల్వ
పనులు మొదలు కాకముందే అదంతా ఖాళీ
ఎక్కడికక్కడ అమ్మేసుకున్న అధికార పార్టీ నేతలు
కలెక్టర్ల అత్యుత్సాహంతో కొన్నిచోట్ల పాడైపోయిన సిమెంట్ బస్తాలు
ఇంజనీర్లను బాధ్యుల్నిచేసి విజిలెన్స్ దాడులు
ఇంజనీర్ల పేర్లతో సరఫరా చేసిన కంపెనీలు
ఇప్పుడు వారిపైనే కత్తి పెడుతున్న ప్రభుత్వం
ఇలాగైతే పనులు కష్టమంటున్న పీఆర్ ఇంజనీర్లు
సమ్మెకు సిద్ధమవుతున్న సంఘాలు
కాకినాడ రూరల్‌లోని ఓ సబ్ డివిజన్‌లో వైసీపీ నేతలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. గ్రామ సచివాలయాల నిర్మాణానికి వచ్చిన సిమెంట్‌ను వచ్చింది వచ్చినట్టు అమ్మేసుకున్నారు. ఇంజనీర్లు ఎంత మొత్తుకుంటున్నా ఇప్పుడు అక్కడ పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదు. టెన్షన్ పెరిగిపోయిన ఓ ఇంజనీరు... అధికారుల కాళ్లూగెడ్డాలు పట్టుకుని ఎలాగో బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ఈ ఒక్క సబ్‌డివిజన్‌లోనే 990 టన్నుల సిమెంట్ గల్లంతయినట్టు విజిలెన్స్ సోదాల్లో బయటపడింది.
అనువైన స్థలం గ్రామాల్లో ఉందా లేదా అనే పరిశీలన లేదు. ఎంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది.. ఎన్ని నిర్మాణాలను మంజూరు చేయొచ్చుననే అంచనాలేదు. ఇవేవీ పట్టించుకోకుండానే గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలను వేగవంతం చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలను అమలుచేయడానికి కలెక్టర్లు చూపిన అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చింది. ఈ నిర్మాణాల కోసం ముందే డంప్ చేసిన వేల టన్నుల సిమెంట్ గల్లంతైంది. గోదాములు లేనిచోట పనులు చేయిస్తామని ముందుకువచ్చిన వైసీపీ నేతల ఇళ్లలో సిమెంట్ నిల్వచేశారు. ఇప్పుడు అదంతా మాయమైపోయింది. అనాలోచిత చర్యల కారణంగా మరికొంత సిమెంట్.. నిర్మాణాలకు వాడకముందే పాడైపోయింది. ఈ సిమెంట్‌ను కంపెనీలు పంచాయతీ ఇంజనీర్ల పేరిట సరఫరా చేయడంతో ఈ వ్యవహారం వారి మెడకు చుట్టుకుంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వం సరఫరా చేసిన సిమెంట్ వేలటన్నుల్లో గల్లంతయింది. గ్రామాల్లో డంప్ చేసిన సిమెంట్‌ను అధికార పార్టీ నేతలు స్వాహా చేసేశారు. అయితే, పంచాయతీరాజ్ ఇంజనీర్ల పేరున సిమెంటు సరఫరా కావడంతో ఈ వ్యవహారం వారి మెడకు బిగుసుకుంది. తమపై కొనసాగుతున్న విజిలెన్స్ దాడులతో పీఆర్ ఇంజనీర్లు హడలెత్తిపోతున్నారు. సంబంధం లేకుండా వ్యవహారంలో తమను బాధ్యులను చేయడంపై మండిపడుతున్నారు. వేధింపులు ఇలాగే కొనసాగితే, సహాయనిరాకరణకు దిగి, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలన్న యోచనలో పీఆర్ ఇంజనీర్లు ఉన్నారు. సచివాయాలతోపాటు ఆర్బీకే, వైఎ్‌సఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీ... ఇలా ప్రతి కేంద్రానికీ సీఎం జగన్ ఆదేశాలతో కలెక్టర్లు భవనాన్ని మంజూరు చేసేశారు. స్థలాల పరిశీలన, నిర్మాణాల అంచనా ఏదీ లేకుండానే.. కంపెనీల నుంచి సిమెంట్‌ను ముందే డంప్ చేశారు. కొన్నిచోట్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినా పనులు ప్రారంభించాలని కలెక్టర్లు... ఇంజనీర్లపై ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. పనులు ప్రారంభం కాని చోట కూడా భవనాల నిర్మాణాలకు వేల బస్తాలు సిమెంట్‌ను సరఫరా చేయడంతో... దానిపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఇలా చూసి అలా తిరిగేటప్పటికి సర్వం స్వాహా చేసేశారు. మరికొన్నిచోట్ల సరైన గోడౌన్లలో నిల్వ చేయకపోవడంతో పనికిరాకుండా పోయిందని చెప్తున్నారు. ఇంకొన్నిచోట్ల వేరే అవసరాలకు వాడారు. ఈ నేపథ్యంలో సిమెంట్ గల్లంతుపై రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు ప్రారంభించింది.
మురిగిన కేంద్రం నిధులు..
వైసీపీ సర్కారు వచ్చీరాగానే రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంట్‌రోడ్లు, సైడ్ కాలువలతో పాటు పలు నిర్మాణాల బిల్లులు తొక్కిపెట్టింది. టీడీపీకి చెందిన సర్పంచులు ఈ పనులు చేశారనే భావించి.. ఇలా కక్ష తీర్చుకుంది. అక్కడితో ఆగకుండా అప్పటికే మంజూరైన పనులన్నీ రద్దు చేసింది. ఈ నేపధ్యంలో పలువురు స్థానిక కాంట్రాక్టర్లు వడ్డీల భారంతో అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. పూర్తయిన పనులకు కూడా చెల్లింపులు చేయకపోవడంతో సర్పంచ్‌లు కోర్టును ఆశ్రయించి బిల్లులు పొందాల్సి వచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల సచివాలయాలను ఏర్పాటుచేసింది. గ్రామ పంచాయతీ భవనాల్లో తొలుత వీటిని ఏర్పాటుచేసింది. మరో 10 వేలకు పైగా సచివాలయాల భవనాల నిర్మాణాల కోసం పనులు మంజూరుచేసింది. వాటితో పాటు రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ సెంటర్లు మంజూరుచేసింది. గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకపోవడంతో... ఈ పనులు ముట్టుకునేందుకు మిగతావారు ముందుకురాలేదు. ఏడాది పాటు ఈ పరిస్థితి కొనసాగడంతో కేంద్రం కేటాయించిన ఉపాధి హామీ నిధులు ఒకసంవత్సరం మురిగిపోయాయి.
ఇంజనీర్ల మెడపై కత్తి...
పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే పూనుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా ఆ పార్టీ నాయకులను ప్రోత్సహించి పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. అయినా...పలు రకాల అడ్డంకులు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల్లో స్థలాల కొరత వేధిస్తే, మరి కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ వివాదాల్లో ఉంది. ఈ కారణాలతో మంజూరైన భవనాలను సైతం నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో స్థోమత కలిగిన స్థానిక నేతలు లేకపోవడంతో ఇంజనీర్లకు ఒత్తిడి పెరిగింది. ఓ వైపు ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు, కలెక్టర్ల నుంచి ఇంజనీర్లపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఇంజనీర్ల గొంతుమీద కూర్చున్నారు. దీని కోసం ప్రతిరోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఇంజనీర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. దీంతో ఈ పనులు చేయలేమని వారు ఎదురుతిరిగారు. గతంలో చేసిన పనులకు సంబంధించి విజిలెన్స్ నివేదికలు బయటకు తీసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించేదాకా ప్రభుత్వం పోయింది. వేధింపులు భరించలేక పలువురు ఇంజనీర్లు బదిలీలకు, మరి కొంత మంది స్వచ్ఛంద పదవీవిరమణకు సిద్ధమయ్యారు. అన్నీ గ్రామాలకు సిమెంట్ సరఫరా చేసి ఆ వ్యయాన్ని ప్రగతి నివేదికల్లో చూపించుకోవచ్చన్న వ్యూహం కలెక్టర్లది. దీనికోసం మంజూరైన ప్రతి గ్రామానికీ సిమెంట్ సరఫరాకు సిఫారసు చేశారు. సిమెంట్ కంపెనీలతో మాట్లాడి అన్నీ గ్రామ సచివాలయాలకు ఏడాది ముందుగానే సిమెంట్ సరఫరా చేశారు. కొన్ని గ్రామాల్లో సిమెంట్ నిల్వ చేసేందుకు గోడౌన్లు లేక... స్థానిక వైసీపీ నాయకుల ఇళ్లల్లో సిమెంట్‌ను నిల్వ ఉంచారు.
దొంగ చేతికి తాళాలు..
నిర్మాణాలు చేపట్టినా సర్కారుబిల్లులిస్తుందన్న నమ్మకం తొలుత వైసీపీ నేతలకు కలగలేదు. అయితే, సిమెంట్ లోడు దిగడంతో ఉత్సాహంగా ‘పని’లోకి దిగారు. వచ్చీరాగానే కొన్ని గ్రామాల్లో సిమెంట్‌ను అమ్ముకున్నారు. మరి కొన్ని గ్రామాల్లో అప్పట్లో వర్షాలు పడుతుండటంతో సిమెంట్‌ను వేరే అవసరాలకు బదిలీ చేశారు. మరి కొన్ని చోట్ల పాడుబడ్డ స్కూల్ భవనాలు, అంగన్‌వాడీ భవనాల్లో నిల్వ చేయడంతో వర్షాలకు తడిసి చెడిపోయింది. ఈ సిమెంట్ మొత్తం ఇంజనీర్ల పేరు మీద సిమెంట్ కంపెనీలు సరఫరా చేశాయి. ఈ సిమెంట్‌కు బాధ్యులను ఇంజనీర్లను చేశారు. అయితే సిమెంట్ మాత్రం గ్రామాల్లో వైసీపీ స్థానిక నేతల ఇళ్లల్లో నిల్వ ఉంచారు. సిమెంట్‌ను కాంట్రాక్టర్ల పేరు మీద ఇవ్వాలని ఇంజనీర్లు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొన్ని చోట్ల సిమెంట్ అమ్ముకున్న వైసీపీ నేతలు పనులు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఇంజనీర్లు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో పడ్డారు. సిమెంట్ కంపెనీల నుంచి నేరుగా గ్రామాల్లో సిమెంట్ డంప్ చేయడంపై ఇంజనీర్లు తప్పుపడుతున్నారు. గతంలో ఆయా సిమెంట్ కంపెనీలు ఏజెన్సీల ద్వారా సరఫరా చేసేవని, ఇప్పుడలా చేయకుండా గ్రామాలకు సిమెంట్ ముందుగానే సరఫరా చేయడంతో వాటిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
కదలని పనులు. సిమెంటు ఖాళీ
ఏడాదికి ముందు సిమెంట్ సరఫరాచేసినా... ఇప్పటికీ పనుల్లో పురోగతి లేకపోవడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సరఫరా చేసిన సిమెంట్ ఏమైందన్న విషయంపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో ఈ భవన నిర్మాణాలు పునాదులు దాటకపోయినా.... సిమెంట్ నిల్వలు ఖాళీ అయినట్టు గుర్తించారు. కొన్ని గ్రామాల్లో సిమెంట్‌ను ఇతర అవసరాలకు వినియోగించుకున్నారు. మరి కొన్ని చోట్ల పాడుబడ్డ పాత భవనాల్లో నిల్వచేయడంతో పాడైనట్టు తనిఖీల్లో తేలింది. మొత్తంగా ఈ సిమెంట్‌ను ఇంజనీర్ల పేరు మీద ఇవ్వడంతో వారినే బాధ్యులను చేస్తున్నట్లు సమాచారం.
వేధింపులు ఆపకుంటే ఉద్యమిస్తాం: ఇంజనీర్ల హెచ్చరిక
‘‘గత ప్రభుత్వంలో నిర్మించిన సిమెంట్‌రోడ్ల నిర్మాణాలపై ఇప్పటికీ మమ్మల్ని విజిలెన్స్ అధికారులు వేధిస్తున్నారు. ఇప్పుడు సిమెంట్ సరఫరా వ్యవహారంలో మరోసారి మమ్మల్ని బాధ్యులను చేస్తున్నారు. ప్రభుత్వం మా ప్రమేయం లేకుండానే, గ్రామాలకు సిమెంట్ సరఫరాచేసి ఇప్పుడు అందుకు మమ్మల్ని తప్పుబట్టడంలో అర్థం లేదు. మాకు సంబంధం లేని వ్యవహారంలో విజిలెన్స్ వేధింపులు, కలెక్టర్ల దబాయింపులు వెంటనే నిలిచిపోవాలి. గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలి. మూడేళ్ల కిందట దీనిపై తయారుచేసిన అంచనాలను తాజా ఎస్‌ఎ్‌సఆర్ ప్రకారం మార్చాలి. వారానికి ఐదు కాకుండా ఒక్క టెలీ కాన్ఫరెన్స్‌కే పరిమితం కావాలి. గతంలో పూర్తయిన పనులకు విత్‌హెల్డ్‌లో నిలిచిపోయిన బిల్లులు చెల్లించాలి’’
Updated Date - 2022-10-07T07:41:00+05:30 IST