వలంటీర్ల సేవకు సెల్యూట్
ABN, First Publish Date - 2022-04-08T08:59:23+05:30
‘‘వలంటీర్లు చేస్తున్న సేవకు సెల్యూట్. వలంటీర్లతో రాష్ట్రంలో గొప్ప వ్యవస్థనే నెలకొల్పాం. మొత్తం దేశం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తున్నది’’ అని సీఎం జగన్
నరసరావుపేటలో వారికి సీఎం సన్మానం...
239 కోట్లతో పురస్కారాల పంపిణీ
నరసరావుపేట, ఏప్రిల్ 7: ‘‘వలంటీర్లు చేస్తున్న సేవకు సెల్యూట్. వలంటీర్లతో రాష్ట్రంలో గొప్ప వ్యవస్థనే నెలకొల్పాం. మొత్తం దేశం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తున్నది’’ అని సీఎం జగన్ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురువారం వలంటీర్ల సత్కార సభలో సీఎం పాల్గొన్నారు. వలంటీర్లకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులను, నగదును పంపిణీ చేసి వారిని ఘనంగా సత్కరించారు. ‘‘నేను కన్న గొప్ప కల వలంటీర్ల వ్యవస్థ. 2.65 లక్షల మంది వలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో భాగస్వాములు అవుతున్నారు. 61 లక్షల మందికి ప్రతి నెలా పింఛన్లను లబ్ధిదారుల ఇంటి తలుపు తట్టి పంపిణీ చేస్తున్నారు. మొత్తం 33 పథకాలను వలంటీర్ల ద్వారా అమలుచేస్తున్నాం. అలాంటి వలంటీర్లకు రానున్న 20 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పురస్కారాలు అందిస్తాం’’ అని జగన్ చెప్పారు. 2.28 లక్షల వలంటీర్లకు సేవామిత్ర, 4,136 మందికి సేవారత్న, 875 మందికి సేవావజ్ర అందిస్తామని తెలిపారు. ఈ పురస్కారాల కింద ఈ ఏడాది రూ.239 కోట్లు వలంటీర్లకు పంపిణీ చేసినట్టు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగసభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..
మారీచులతో తలపడుతున్నా..
‘‘ఢిల్లీ వెళ్లాను. మంచి వాతావరణంలో గంటసేపు ప్రధానితో సమావేశం జరిగింది. అది జీర్ణించుకోలేని కొన్ని పత్రికలు, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు... జగన్‌కు మోదీ క్లాసు పీకారని ప్రచారం చేస్తున్నారు. ఇద్దరమే గదిలో ఉన్నాం. వీరెవరైనా పీఎం సోఫా లేక నా సోఫా కింద ఉన్నారా? అసూయకు మందు లేదు. ఇంత అసూయపడితే మాత్రం త్వరగా బీపీలు వస్తాయి.. గుండెపోట్లు వస్తాయి. త్వరగా టికెట్ తీసుకుంటారు. నేను మారీచులతోనూ, రాక్షసులతోనూ యుద్ధం చేస్తున్నాను. వీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ పార్టీతోనైనా జత కట్టేస్తారు. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు బురదజల్లి బయటకు వెళ్లిపోతారు. హైదరాబాద్‌లో ఉండేవారు రాష్ట్రానికి ఏదో పండుగకు వచ్చినట్టుగా.. చుట్టంలాగా అప్పుడప్పుడు కనిపిస్తారు. తమకు గిట్టని ప్రభుత్వం ఉంటే వ్యతిరేక ఓటు చీలకూడదని వీళ్లంతా ఏకమై పోతారు. ఏకం కావడమే కాకుండా దుష్ప్రచారం చేయడంలో వీరికి ఎవరూ సాటిరారు. పేరుకు వేరువేరు వ్యక్తులూ, పార్టీలూ, మీడియా సంస్థలైౖనా వీరందరూ కూడా ఒక గజ దొంగల ముఠా. వీరికి నీతి,న్యాయం,ధర్మం లేవు. ప్రజలంటే ప్రేమ లేదు. అధికారం తప్ప వేరే ఎజెండా లేదు. వీళ్లు చెప్పే మాటలు, చేస్తున్న ప్రచారాలను నమ్మవద్దు.
పాలన ఇలాగే సాగితే తమకు భవిష్యత్‌లో ఏ ఒక్కరు కూడా ఓటువేయరేమోననే భయంతోనే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ఈ దొంగల ముఠా ప్రచారం చేస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తే శ్రీలంక అవుతుందట! వాళ్లలా ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే రాష్ట్రం అమెరికా అవుతుందా?’’ అని వ్యాఖ్యానించారు. రైతులు, పేదలను, పిల్లలను, మహిళలను ద్వేషించే చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు లాంటి వారి గురించి ప్రజలే ఆలోచించాలన్నారు. ‘‘వీరికి మద్దతిచ్చి మంచిని ఛిన్నాభిన్నం చేస్తున్న కొన్ని పత్రికలు, చానళ్లను మనుషులనాలా లేక రక్త పిశాచాలనాలా? వాళ్లను నమ్మనే నమ్మొద్దు’’ అని కోరారు.
Updated Date - 2022-04-08T08:59:23+05:30 IST