సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్
ABN, First Publish Date - 2022-04-23T08:03:47+05:30
‘‘ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్‌కు ముందు సర్వే చేయాల్సిందే. ఒకే సర్వే నంబరులో కొంత భూమిని అమ్మితే దాన్ని సర్వే చేసిన అనంతరం సబ్‌డివిజన్ చేసి ప్రత్యేక నంబరు కేటాయించాలి.
- ఒకే నంబరులో కొంత భూమి అమ్మితే సబ్‌డివిజన్ తప్పనిసరి
- సర్వే, సబ్ డివిజన్ దరఖాస్తే మ్యుటేషన్‌కు ప్రామాణికం
- ప్రభుత్వ భూములను మ్యుటేషన్ చేయొద్దు
- కుటుంబ వివాదాల పేరిట దరఖాస్తులు తిరస్కరించకూడదు
- సీసీఎల్‌ఏ సాయిప్రసాద్ మార్గదర్శకాలు జారీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ‘‘ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్‌కు ముందు సర్వే చేయాల్సిందే. ఒకే సర్వే నంబరులో కొంత భూమిని అమ్మితే దాన్ని సర్వే చేసిన అనంతరం సబ్‌డివిజన్ చేసి ప్రత్యేక నంబరు కేటాయించాలి. దాన్ని తహసీల్దారు ఆమోదించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలి’’ అని రెవెన్యూశాఖ ఆదేశించింది. ఈ విధానం విధిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జి.సాయిప్రసాద్ నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్‌కు ముందు భూముల సర్వే తప్పనిసరి అనే విధానం దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలోనే అమల్లో ఉంది. ఇప్పుడు ఈ విధానం ఏపీలోనూ అమల్లోకి రానుంది. కాగా, సర్వే, సబ్ డివిజన్ కోరుతూ వచ్చే దరఖాస్తులనే మ్యుటేషన్ అప్లికేషన్‌గా పరిగణించాలని సీసీఎల్‌ఏ దిశానిర్దేశం చేశారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ కోసం కొత్తగా దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు
ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యుటేషన్ చేయడానికి వీల్లేదు. ప్రత్యేకించి ఏదైనా భూమి విషయంలో సర్కారు నుంచి ఉత్తర్వులు ఉంటే జేసీ లాగిన్‌లోనే ఈ ప్రక్రియ చేపట్టాలి.
బీఎ్‌సవో 34(ఏ) క్లాజు 10, 11 పరిధిలోకి వచ్చే భూముల రిజిస్ట్రేషన్‌కు ముందు సర్వే, సబ్ డివిజన్ చేయాలి. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయాలి. సబ్ డివిజన్ వివరాలు డిజిటల్ రికార్డుల్లో ప్రత్యక్షంగా కనబడాలి. సర్వే, సబ్ డివిజన్ లేకుండా, తహసీల్దారు ఆమోదం లేకుండా వచ్చే దరఖాస్తులను రిజిస్ట్రేషన్ శాఖ చేపట్టకూడదు.
మ్యుటేషన్ దరఖాస్తు ఇచ్చినప్పుడే సంబంధిత వ్యక్తి బయోమెట్రిక్ తీసుకోవాలి. డాక్యుమెంట్లు హక్కుదారువే అని తేలితే, హక్కుదారు అక్కడే ఉంటే వెంటనే ఆ ప్రక్రియ పూర్తిచేయాలి. ఇందులో ఎలాంటి విచారణలు అవసరం లేదు.
ఒకవేళ సంబంధిత డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తి, దరఖాస్తుదారు వేర్వేరు అయితే ఇతర ఆధారాల కోసం విచారణ చేపట్టాలి. ఈసీని ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ విషయంలో తగిన విచారణ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
భూ యజమాని, హక్కుదారు అందుబాటులో ఉంటే సేల్, గిఫ్ట్, పార్టీషన్ డీడ్‌ల ఆటోమ్యుటేషన్ చేయవచ్చు. అయితే, రెవెన్యూ రికార్డుల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తికి ఎలాంటి హక్కులు లేకుంటే ఈ ప్రక్రియను చేపట్టవద్దు. భూమిలో కొంత మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే ముందుగా సర్వే, సబ్‌డివిజన్ చేసి, తహసీల్దారు ఆమోదం ఉంటేనే మిగతా ప్రక్రియను పూర్తిచేయాలి.
వారసత్వం కేసుల్లో మ్యుటేషన్ల సమయంలో ప్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఒత్తిడి చేయొద్దు. అయితే, విచారణ సమయంలో అవసరాన్ని బట్టి రెవెన్యూశాఖ తగిన ఆధారాలు, డాక్యుమెంట్ల ఆధారంగా దరఖాస్తుదారుడికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను జారీ చేయాలి. ఇలాంటి కేసుల్లో చట్టబద్ధమైన వారసులు కాని విషయంలోనే దరఖాస్తులు తిరస్కరించాలి. అయితే, కుటుంబ వివాదాల పేరిట దరఖాస్తులను తిరస్కరించకూడ దు. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి.
ఏదైనా మ్యుటేషన్ దరఖాస్తును తిరస్కరించాలని తహసీల్దారు నిర్ణయిస్తే దాన్ని ఆర్‌డీఓకు తెలియజేయాలి. ఆ అంశంపై వారం వ్యవధిలో ఆర్‌డీఓ విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలి.
మ్యుటేషన్ దరఖాస్తులను ఇష్టం వచ్చినట్లు, పనికిమాలిన కారణాలతో తిరస్కరించడానికి వీల్లేదు. ఎందుకు తిరస్కరిస్తున్నారో స్పష్టమైన ఆదేశం, మెసేజ్ దరఖాస్తుదారుడికి ఇవ్వాలి. దరఖాస్తుల తిరస్కరణ విషయంలో కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓ విచారణ చేపట్టాలి. తిరస్కరించిన వాటిలో కనీసం 25 శాతం దరఖాస్తులను పరిశీలించాలి.
చుక్కల భూముల విషయంలోనూ మార్చిలో ఇచ్చి న మార్గదర్శకాల ప్రకారం మ్యుటేషన్ లు చేపట్టాలి.
ఎక్కువ భూమి విస్తీర్ణం ఉన్న కేసుల్లో మరోసారి సర్వేచేసి సెటిల్ చేయాలి. ఆ పేరుతో దరఖాస్తులను తిరస్కరించవద్దు. గ్రామ సర్వేయర్‌తో అదనపు సర్వే చేయించాలి.
రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో సర్వే, సరిహద్దుల చట్టం ప్రకారం సెక్షన్-13 నోటిఫికేషన్ ఇచ్చేనాటికే అన్ని మ్యుటేషన్ దరఖాస్తులు పరిష్కరించాలి.
‘ఎఫ్’ లైన్ పిటిషన్లు గ్రామ సర్వేయర్ చేతికి
గ్రామస్థాయిలో భూముల గట్టు, సరిహద్దులను నిర్దేశించే ‘ఎఫ్’ లైన్ పిటిషన్ల పరిష్కార బాధ్యతను గ్రామ సర్వేయర్‌కే అప్పగిస్తూ రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది. 15రోజుల్లోగా దరఖాస్తులను పరిష్కరించాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. భూముల కొలతలు కోరుతూ రైతులు ఇక గ్రామ సచివాలయంలోనే దరఖాస్తులు ఇవ్వాలి. వీటిని వెంటనే సంబంధిత గ్రామ సర్వేయర్‌కు అప్పగిస్తారు. సంబంధిత రైతులకు గ్రామ సర్వేయర్ నేరుగా ఫాం-2 కింద నోటీసులు ఇస్తారు. సర్వేయర్ నివేదికపై డిప్యూటీ తహసీల్దారు పర్యవేక్షణ చేస్తారు. అంతిమంగా తహసీల్దారు నిర్ణయం తీసుకుంటారు. గ్రామ సర్వేయర్ రిపోర్టుపై భిన్నాభిప్రాయాలు ఉంటే మండల సర్వేయర్‌తో మరోసారి పరిశీలన చేయిస్తారు.
45% తిరస్కరించారు సీసీఎల్‌ఏ ఆందోళన
మ్యుటేషన్‌లు కోరుతూ వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 45శాతం తిరస్కరించడంపై సీసీఎల్‌ఏ సాయిప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరస్కరణ శాతం చాలా ప్రమాదకర స్థాయిలో ఉందన్నారు. ఇకపై పనికిమాలిన కారణాలతో దరఖాస్తులు తిరస్కరించవద్దని కలెక్టర్లకు జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. రెవెన్యూ యంత్రాంగానికి తగిన శిక్షణ ఇచ్చి మెరుగైన రీతిలో దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, రికార్డుల నిర్వహణలో మార్గదర్శకాలను సీసీఎల్‌ఏ విడుదల చేశారు.
Updated Date - 2022-04-23T08:03:47+05:30 IST