ఇటు వానలు.. అటు ఎండలు
ABN, First Publish Date - 2022-08-04T08:27:43+05:30
ఇటు వానలు.. అటు ఎండలు
రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి
నేడు రాయలసీమకు అతి భారీ వర్షసూచన
విశాఖపట్నం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తుండగా మరికొన్నిచోట్ల మాడుపగిలేలా ఎండలు కొనసాగుతున్నాయి. మూడురోజులుగా కర్నూలు, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ముసురు పట్టాల్సిన శ్రావణమాసంలో ఒకటి, రెండు గంటలపాటు వర్షం కురిసి తర్వాత ఎండ కాస్తోంది. దీంతో వేసవి మాదిరిగా వేడివాతావరణం కొనసాగుతోంది. దీనికి ఉక్కపోత తోడైంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం జంగమహేశ్వరపురంలో 35.6డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలు ఎండకు ఠారెత్తిపోతున్నారు. గత ఆగస్టులో కొన్ని రోజులు ముసురు కొనసాగి తర్వాత ఎండలు ఉండేవని, దీంతో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పుడా పరిస్థితి లేదని వాతావరణ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని, అందువల్ల కుంభవృష్టి వానలు, మాడుపగిలే ఎండలు ఉంటాయని చెప్పారు.
సీమకు అతిభారీ వర్షసూచన
దక్షిణకోస్తాకు ఆనుకుని పశ్చిమమధ్య నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ భారతం మీదుగా తూర్పు, పడమర ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బుధవారం రాయలసీమలో ఎక్కువచోట,్ల కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో సీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, సీమ లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు, కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - 2022-08-04T08:27:43+05:30 IST