Steelplant Quid Pro Co: స్టీల్‌ప్లాంట్‌తో ‘క్విడ్ ప్రో కో’!
ABN, First Publish Date - 2022-12-16T02:38:04+05:30
ఎవరేమన్నా... ఎన్ని నిరసనలు ఎదురైనా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతోంది. దీనిని అన్ని పార్టీలు, వర్గాలు వ్యతిరేకిస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు.
కేంద్రంతో జగన్ సర్కారు భూముల బేరం
ప్రైవేటీకరణకు లోపాయికారీ సహకారం.. బదులుగా 4వేల ఎకరాలు లీజుకు!?
డ్యాష్ బోర్డు సమావేశాలకు సీఎస్ హాజరు.. ప్లాంటు ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు
‘ఖాయంగా’ నష్టాలు వచ్చేలా పకడ్బందీ చర్యలు.. 11 నెలల కిందట ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత
ఇది జగన్ సర్కారు వారి ‘క్విడ్ ప్రోకో’! కేంద్రంతో కలిసి బేరాలు! ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణకు రాష్ట్ర స్థాయిలో లోపాయి కారీగా మేం సహకరిస్తాం! దీనికి బదులుగా... స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించిన 4 వేల ఎకరాలు మాకు లీజుకు ఇవ్వండి’’
...విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇదీ కేంద్రంతో జగన్ సర్కారు పెట్టిన బేరం!
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): ఎవరేమన్నా... ఎన్ని నిరసనలు ఎదురైనా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతోంది. దీనిని అన్ని పార్టీలు, వర్గాలు వ్యతిరేకిస్తున్నా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదు. అధికార పార్టీ ఉత్తుత్తి మాటలు, తూతూమంత్రం నిరసనలకే పరిమితమవుతోంది. దీంతో... విశాఖ ఉక్కుపై రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధిని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో అనుమానిస్తున్నాయి. అంతేకాదు... స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని... అందుకు ప్రతిఫలం ఆశిస్తోందని కార్మిక సంఘాలు అంటున్నాయి. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు కోసం అప్పట్లో 24 వేల ఎకరాలు సేకరించారు. అందులో ప్లాంటు ఏర్పాటుచేసి, దశల వారీగా విస్తరించి... 20 టన్నులు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. కాగా ఇప్పటికి 7.3 టన్నుల సామర్థ్యం మాత్రమే సమకూర్చుకుంది. ఇంకా విస్తరణ చేయాల్సింది చాలా ఉంది. ఈలోగానే దానిని ప్రైవేటుకు ఇవ్వాలని కేంద్రం యత్నిస్తోంది. సేకరించిన భూముల్లో 9,500 ఎకరాల్లో మాత్రమే కర్మాగారం ఉంది. గతంలో గంగవరం పోర్టు కోసం 1,200 ఎకరాలు ఇచ్చారు. ఇంకో 500 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. మిగిలిన భూముల్లో వనాలు ఉన్నాయి. వెరసి... స్టీల్‌ప్లాంటు పరిధిలో ప్రస్తుతం 12 వేల ఎకరాల ఖాళీ భూములున్నాయి. ఎలాగూ ప్రైవేటుకు అమ్మేస్తున్నారు కాబట్టి తమకూ కొన్ని భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు విశ్వసనీయ సమాచారం! ఇటీవలికాలంలో ఉక్కు శాఖ ఆన్లైన్లో నిర్వహించే డా్య్షబోర్డు సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా హాజరవుతున్నారు. ఈ భేటీలకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకున్నా... సీఎస్ హాజరవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో స్టీల్ ప్లాంటు భూముల్లో 4వేల ఎకరాలు తమకు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో స్థానికంగా అందించే సహకారానికి ప్రతిఫలంగా ఆ భూములను కోరుతున్నట్లు ఆరోపణలున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఖాళీగా ఉన్న భూములను లీజుకు ఇచ్చి, ఆదాయం చూపించాలని కేంద్రం ఇటీవల పదేపదే చెబుతోంది. ఆ మేరకు విశాఖపట్నం పోర్టు 4నెలల క్రితం తన వద్ద నగరంలో ఖాళీగా ఉన్న కొంత భూమిని రహేజా కంపెనీకి ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణం కోసం 30 ఏళ్లకు లీజుకు ఇచ్చి రూ.200 కోట్ల మొత్తాన్ని ఒకేసారి తీసుకుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఖాళీ భూములు, ప్లాంటు ఉన్న పరిధి... ఏవి ఎలా విక్రయించాలి? ఎలా లీజుకు ఇవ్వాలనేది నిర్ధారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 4వేల ఎకరాలు తమకు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. ఈ లీజు మొత్తం నామమాత్రంగానే ఉంటుందని సమాచారం.!
భూములకోసమే ‘ఉక్కు’ బలి?
విశాఖ స్టీల్‌ప్లాంటుకు ఉన్న భూముల విలువ రూ.3 లక్షల కోట్లపైమాటే! వీటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఆరాటపడుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్లాంటును నష్టాల్లోకి నెట్టేలా... ఐరన్‌ఓర్ గనులు కేటాయించకుండా, బొగ్గు అందుబాటులో లేకుండా చేస్తున్నారనే వాదనలూ ఉన్నాయి. 11 నెలల కిందట ఒక బ్లాస్ట్ఫర్నే్సను మూసేసి, ఉత్పత్తిని తగ్గించేశారు. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3 వేల కోట్ల నష్టాలు రానున్నాయి. ‘నష్టాలు ఉంటే అమ్మక తప్పదు’ అని ప్రకటించేందుకే ఇలా పావులు కదుపుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గతంలో నిర్ద్వంద్వంగా ‘నో’
విశాఖ స్టీల్‌ప్లాంటు పరిధిలో ఖాళీ భూములను వేర్వేరు అవసరాలకోసం తీసుకోవడానికి వైఎస్ నుంచి చంద్రబాబు వరకు ప్రయత్నాలు జరిగాయి. కానీ... ఆర్ఐఎన్ఎల్ (స్టీల్‌ప్లాంట్) ససేమిరా అంది. వైఎస్ ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కోసం స్టీల్‌ప్లాంటు భూములివ్వాలని కోరారు. కేంద్ర ఉక్కు శాఖ అంగీకరించలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 250 ఎకరాలు కావాలని కోరారు. దానికీ కేంద్రం నిరాకరించింది. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ ఈ ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు... తమ వద్ద అదనపు భూముల్లేవని ఆర్ఐఎన్ఎల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
నాడు ‘రెసిడెన్షియల్’గా కుదరదని...
స్టీల్‌ప్లాంటు కార్మికులు, ఉద్యోగులు రెండు దశాబ్దాల క్రితం గృహాలు నిర్మించుకోవడానికి 700 ఎకరాలు ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. కానీ... పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఆ భూములను ‘రెసిడెన్షియల్’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంది. దాంతో ఉద్యోగులు, కార్మికులకు సొంత ఇళ్లు దక్కలేదు. క్వార్టర్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే స్టీల్‌ప్లాంట్ పరిధిలోని 4వేల ఎకరాలకు టెండరు పెట్టడం గమనార్హం.
కేంద్రంతో కలిసి రాష్ట్రం కుట్ర
ఇది ముమ్మాటికీ కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రే. ఐరన్ ఓర్ గనులు కేటాయించకపోయినా, బొగ్గు సరఫరా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. ప్లాంటు ప్రైవేటీకరణపై పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ప్రక్రియను అడ్డుకోవాల్సింది పోయి భూముల్లో వాటా అడగడం దారుణం. దీనిపై ఉద్యమిస్తాం. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం!
- గంగారావు, సీపీఎం నేత
Updated Date - 2022-12-16T02:38:05+05:30 IST