అక్కరకు రాని వైఎస్సార్ బీమా
ABN, First Publish Date - 2022-07-16T06:25:40+05:30
నాడు చంద్రన్న బీమా.. నేడు వైఎస్‌ఆర్ బీమా.. పేరు ఏదైనా ఇంటి యజమాని అసువులు బాసితే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వటమే లక్ష్యం. రాష్ట్రప్రభుత్వ పరిధిలోని వెలుగు ద్వారా ఈ పథకం అమలులో ఉంది.
చేయూతనిచ్చిన టీడీపీ సభ్యత్వం
నాడు ఆదుకున్న చంద్రన్న బీమా.. నేడు నిబంధనలతో తిరకాసు
డాక్టర్ ఉగ్ర చొరవతో బాధిత కుటుంబానికి వచ్చిన రూ.2లక్షలు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
నాడు చంద్రన్న బీమా.. నేడు వైఎస్‌ఆర్ బీమా.. పేరు ఏదైనా ఇంటి యజమాని అసువులు బాసితే ఆ కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వటమే లక్ష్యం. రాష్ట్రప్రభుత్వ పరిధిలోని వెలుగు ద్వారా ఈ పథకం అమలులో ఉంది. నాటి టీడీపీ ప్రభుత్వంలో ఈ పథకం ఇంటి యజమానిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. అదే పథకం పేరుమారి ఇప్పుడు అమలులో ఉండగా ఇంటి యజమాని చనిపోయినా ఆ కుటుంబానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. అందుకు వారం క్రితం వెలిగండ్ల మండలంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబానికి ఉపయోగపడకపో వటం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున రూ.2లక్షల ఆర్థిక చేయూత లభించింది. వివరాల్లోకి వెళ్తే.. కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం పద్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముత్తుముల మహేశ్‌రెడ్డి సోదరుడు ముత్తుముల రవి ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదుచేశారు. టీడీపీ కార్యకర్త కావటంతో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి మండల అధికారితో కూడా మాట్లాడారు. ఆ కుటుంబానికి మృతుడే పెద్ద దిక్కు. భార్య, పిల్లలు ఉన్నారు. దీంతో అందరి దృష్టి వైఎస్సార్ బీమా వైపు మళ్లింది. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు పేరుతో చంద్రన్న బీమా కింద ఇంటి యజమాని మృతిచెందితే రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ప్రభుత్వం కుటుంబానికి ఇచ్చేది. అలా అప్పట్లో జిల్లాలో కూడా అనేకమంది ఇంటి యజమానిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక చేయూత లభించింది. ఇప్పుడు వైఎస్సార్ బీమా పేరుతో ఆ పథకం అమలులో ఉండటంతో మృతుడి కుటుంబసభ్యులు అధికారులను కలిసి ఆ పథకం కింద చేయూతనివ్వాలని కోరారు. ప్రస్తుతం గ్రామ సచివాలయం నుంచే ఈ పథకం అమలులో ఉన్నందున వారిని కలవాలని మండల అధికారులు సూచించారు. వెంటనే సచివాలయం అధికారులను కుటుంబసభ్యులు కలిశారు. అయితే అధికారులు ఆ పథకం కింద మృతుని కుటుంబానికి పైసా చేయూత దక్కదని తేల్చేశారు. స్థానిక సచివాలయ అధికారులు మాత్రం ఇంటి యజమానిగా మృతుడి భార్య పేరు ఉందని అందువలన ఆమె మృతిచెందితేనే డబ్బులు వస్తాయని తేల్చిచెప్పారు. ఇంటి యజమానిగా భర్తను కాకుండా భార్యను ఎందుకు నమోదు చేశారంటే తాము వెళ్లినప్పుడు మృతుడు రవి ఇంట్లోలేడని, ఆయన సతీమణే ఉందని అందువలనే ఆమెనే ఇంటి యజమానిగా గుర్తించామని చెప్తున్నారు. నిజానికి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం నిధుల సమస్యతో ఈ పథకం కింద ప్రీమియం చెల్లింపునకు కేటాయించిన డబ్బు లను తిరిగి వెనక్కు తీసుకుందని అందువలన నాలుగై దు నెలలుగా వైఎస్‌ఆర్ బీమా పథకం అసలు అమలు లో లేదని అంటున్నారు. కారణం ఏమైనా ప్రమాదవశాత్తు ఇంటి యజమాని మృతిచెందిన కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన బీమా పథకం ఆ కుటుంబానికి ఏమాత్రం ఉపయోగపడలేదని తేలిపోయింది.
అక్కరకొచ్చిన టీడీపీ సభ్యత్వం
మృతుడు రవి టీడీపీ సభ్యుడు కావటం ఆ కుటుంబానికి కలిసొచ్చింది. డాక్టరు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరిగిన విషయం తెలిసిందే. అందులోభాగంగా రవి కూడా సభ్యత్వాన్ని స్వీకరించారు. ఆ విషయం గమనంలో ఉన్నందున డాక్టరు ఉగ్ర ఆ కుటుంబానికి చేయూతనిచ్చేందుకు వెంటనే రంగంలోకి దిగారు. పార్టీ అధినేత చంద్రబాబుని కలిసి పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు మృతిచెందితే ఆ కుటుంబానికి ఇచ్చే రూ.2లక్షల ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఇప్పించాలని కోరారు. చంద్రబాబునాయుడు కూడా వేగంగా స్పందించారు. ఫలితంగా 2 రోజుల్లోనే తెలుగుదేశం సభ్యుడిగా ఉండి మృతిచెందిన రవి కుటుంబానికి రావాల్సిన రూ.2లక్షలు మంజూరయ్యాయి. పార్టీ అధినేత చంద్రబాబు చేతులమీదుగా చెక్కు అందుకున్న ఉగ్రనరసింహారెడ్డి ఆ కుటుంబానికి ఆ డబ్బుని అందించనున్నారు.
Updated Date - 2022-07-16T06:25:40+05:30 IST