పాత డ్రైవరే సూత్రధారి!
ABN, First Publish Date - 2022-12-31T00:25:02+05:30
నల్లమల ఘాట్‌లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. పాత డ్రైవరే మొత్తం వ్యవహారానికి సూత్రధారి అని తేల్చారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద రూ.2.75లక్షల నగదు, 425 బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కారు నంబరే పట్టించింది
నల్లమల ఘాట్‌లో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
ఐదుగురు అరెస్టు, పరారీలో ఇద్దరు
రూ.2.75లక్షల నగదు, 425 గ్రాముల నగలు, కారు, బైక్, స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్
ఒంగోలు (క్రైం), డిసెంబరు 30 : నల్లమల ఘాట్‌లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. పాత డ్రైవరే మొత్తం వ్యవహారానికి సూత్రధారి అని తేల్చారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద రూ.2.75లక్షల నగదు, 425 బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇరువురు పరారీలో ఉన్నారు. స్థానిక పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికగర్గ్ వివరాలను వెల్లడించారు. ఈనెల 24న గిద్దలూరు మండలం దిగువమిట్ట ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద జరిగిన దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కల్లగుంట ఆంజనేయులు, పతి సురేష్, చిలకలూరిపేట మండలం కావూరుకు చెందిన కుంచాల మనోహర్, చిలకలూరిపేటకు చెందిన తుపాకుల వెంకటేష్, ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన పఠాన్ చాంద్‌బాషా ఉన్నట్లు వెల్లడించారు. ఇంకా రొంపిచెర్ల మండలానికి చెందిన చీమల వేమురెడ్డి, పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన తుపాకుల వెంకటేష్ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నిందితులను గురువారం రాత్రి నరసరావుపేటలో ఎస్‌ఆర్‌టీ కాలనీ వద్ద గిద్దలూరు సీఐ నేతృత్వంలో పోలీసు బృందం అరెస్టు చేసినట్లు వివరించారు. తక్కువ వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
దోపిడీ జరిగింది ఇలా..
బంగారం దోపిడీ కేసులో కీలక సూత్రధారి పతి సురేష్. ఆయన గతంలో నరసరావుపేటలో బంగారం వ్యాపారుల వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. బంగారం వ్యాపారులు చేసే లావాదేవీలన్నీ తెలుసు. దీంతో దోపిడీకి ప్లాన్ చేశాడు. ఈ నెల 24న విజయవాడ ఆర్‌ఎస్ జ్యువెలరీస్‌లో పనిచేసే మొహిబుల్లా బేగ్, నరసరావుపేటకు చెందిన మరో ఇరువురు బంగారం వ్యాపారుల వద్ద ఉన్న గుమస్తాలు, నరసరావుపేట ఎస్‌జేఎస్ జ్యువెలరీస్‌లో పనిచేసే మరో గుమస్తా కారులో నంద్యాల వెళ్లారు. అక్కడ బంగారు నగలు ఇచ్చి పాత బంగారంతోపాటు నగదు తీసుకొని దిగువమిట్ట ఫారెస్టు చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఏపీ 39ఎన్1415 నంబరు గల కారులో దొంగల ముఠా కాపుకాసి ఉంది. వ్యాపారుల కారు రావడంతో కర్రలు, రాళ్లతో దాడిచేసి రూ.7లక్షల నగదు, 425గ్రాముల బంగారం దోచుకున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుల కారును గుర్తించారు. మొదట కారు నంబర్ తీసేసి కొద్దిదూరం వెళ్లిన ముఠా తర్వాత నంబర్ ప్లేట్ బిగించారు. అయితే టోల్‌ప్లాజాల సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణలో కారు నంబరు దొరికింది. ఆ ప్రకారం యజమానిని గుర్తించి విచారించగా కళ్లగుంట కాళీకి అద్దెకు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో కాళీని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. మిగతా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. దోపిడీ ముఠా నుంచి రూ.2.75 లక్షల నగదు, 425గ్రాముల బంగారం, కారు, బైక్, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఏఎస్పీ(క్రైమ్స్) శ్రీధర్‌రావు, ఏఆర్ ఏఎస్పీ అశోక్‌బాబు ఎస్బీ డీఎస్పీ మరియదాసు ఉన్నారు.
పోలీసులకు ప్రశంసలు
దోపిడీ కేసును ఛేదించిన ఏఎస్పీ శ్రీధరరావు, డీఎస్పీలు కిషోర్‌కుమార్, పల్లపు రాజు, సీఐలు ఫిరోజ్, రాజేష్, సుధాకర్‌రావు, భీమానాయక్, రాంబాబుతోపాటుగా ఎస్సైలు బ్రహ్మనాయుడు, మహేష్, సుబ్బరాజు, రామిరెడ్డి, శివనాగరాజు, ఆంజనేయులు, శ్రీరామ్, ఏఎస్సై షరీఫ్‌లను ఎస్పీ మలికగర్గ్ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
Updated Date - 2022-12-31T00:25:03+05:30 IST