ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.500 కోట్లకుపైనే నష్టం

ABN, First Publish Date - 2022-12-15T23:17:26+05:30

మాండస్‌ ఎఫెక్ట్‌తో నాలుగురోజుల పాటు ముసురుగా కురిసిన భారీవర్షాలు తెరపిచ్చి ఎండలు రావడంతో పంటలకు జరిగిన నష్టం వెలుగుచూస్తోంది. పొలాల్లో ఉన్న వర్షపు నీటిని బయటకు పంపి ఎంతో కొంత పైరును కాపాడుకోవచ్చని భావించిన రైతులకు ప్రస్తుతం నిరాశే మిగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొలకెత్తిన వరి, మినుము

ఇతర పంటల దిగుబడులకు గండి

భారీగా పెట్టుబడులు మాండస్‌ పాలు

మరో తుఫాన్‌ సంకేతాలతో మరింత ఆందోళన

ప్రభుత్వం ఉదారంగా అదుకోవాలని వినతి

పంట నష్టాలు బయటపడుతున్నాయి. పంటలు కీలకదశలో ఉన్న సమయంలో ఊహించని రీతిలో మాండస్‌ తుఫాన్‌ విరుచుకుపడింది. భారీ నుంచి అతి భారీవర్షాలు అందునా నాలుగు రోజుల పాటు ముసురుపట్టి కురవడంతో అత్యధిక ప్రాంతాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. రూ.500కోట్లకుపైనే పంటనష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు నీళ్ల పాలయ్యాయి. అయితే మంగళవారం వర్షం తెరిపి ఇవ్వడం, బుధ, గురువారాలు పూర్తిగా ఎండకాయడంతో పంటలకు జరిగిన అసలు నష్టం బయటపడుతోంది. సాధారణంగా వర్షాల తర్వాత ఎండలు వచ్చినప్పుడు అప్పటివరకు నీళ్లలో ఉన్న పైర్లు ఉరకెత్తడం, కుళ్లిపోవడం కాయల్లో మొలకలు రావడం చూస్తుంటాం. అలా ప్రస్తుతం దెబ్బతిన్న పంట వాస్తవ నష్టం ఇప్పుడు వెలుగుచూస్తుండగా అధికార యంత్రాంగం మాత్రం నష్ట అంచనాలకే పరిమితమైంది.

ఒంగోలు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మాండస్‌ ఎఫెక్ట్‌తో నాలుగురోజుల పాటు ముసురుగా కురిసిన భారీవర్షాలు తెరపిచ్చి ఎండలు రావడంతో పంటలకు జరిగిన నష్టం వెలుగుచూస్తోంది. పొలాల్లో ఉన్న వర్షపు నీటిని బయటకు పంపి ఎంతో కొంత పైరును కాపాడుకోవచ్చని భావించిన రైతులకు ప్రస్తుతం నిరాశే మిగిలింది. వాన తెరిపి ఇచ్చాక పొలాల్లోకి వస్తే అత్యధిక భాగం ధ్వంసమైపోయి బోరుమంటున్నారు. ప్రధాన పంటల్లో అధికంగా దెబ్బతిన్న పొగాకు ప్రస్తుతం కాస్తున్న ఎండలు, పొడి వాతావరణంతో ఉరకెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుండగా మిర్చి కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. ఇక కోతలు కోసి తడిసిన వరి ఓదెలు, కోతకు వచ్చి పనికి రాకుండా పోయిన దుస్థితి నెలకొంది. శనగ, అలసంద, మొక్కజొన్న, పత్తి, కంది ఇలా అన్ని పంటల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. జిల్లాలో ఖరీ్‌ఫలో వేసిన పంటలలో 3.5లక్షల ఎకరాల విస్తీర్ణంతో పాటు రబీలో సాగుచేసిన మరో 2లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. ఈ సమయంలో మాండస్‌ విరుచుకుపడి మొత్తాన్ని తుడిచిపెట్టేసింది.

పొగాకు రైతు కుదేలు

జిల్లాలో 90వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు కాగా అందులో 60శాతంకుపైగా పొగ తోటలు ఉరకెత్తిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వారం కిందటి వరకు ఏపుగా పెరుగుతూ కనిపించిన పొగ తోటలు ప్రస్తుతం నేలవాలి ఉరకెత్తి కనిపిస్తున్నాయి. మొత్తం సంభవించిన రూ.500కోట్ల నష్టంలో ఒక్క పొగాకు రైతులే రూ.250కోట్ల వరకు నష్టపోయారు. మిగతా పంటల రైతులు మరో రూ.250కోట్లకుపైనే పెట్టుబడులు కోల్పోయారు. జిల్లాలో మిగతా ప్రధాన పంటలలో 50వేల ఎకరాల్లో ఉన్న మినుము అధిక ప్రాంతాల్లో కాయ దశలో ఉండగా నాలుగు రోజులు కురిసిన వర్షంతో అవన్ని కుళ్లిపోతుండటంతో పాటు మొలకలు వచ్చాయి. ఖరీ్‌ఫలో విస్తారంగా వేసిన మిర్చిలో ప్రస్తుతం కోతలు ప్రారంభం కాగా కాయ, పూత రాలిపోవడంతోపాటు చాలాచోట్ల మిర్చి పంట ఉరకెత్తిపోయి కనిపిస్తోంది.

వరితోపాటు మిగతా పైర్లన్నీ..

పలుచోట్ల కోసి ఉన్న వరి ఓదెలు నీటిలో నానుతుండగా వర్షపు నీరు తీసేలోపు మొలకలు వచ్చి పనికిరాకుండాపోయాయి. అలసంద పంట కూడా పూర్తిగా ధ్వంసం కాగా పత్తి కాయలు కుళ్లిపోయిన పరిస్థితి. కందిలో పూత, పిందె రాలిపోగా తక్కువ వయస్సులో ఉన్న శనగ, మొక్కజొన్న పైర్లు నీళ్లలో నాని ఉరకెత్తిపోయి కనిపిస్తున్నాయి. కొంత పైరునైనా కాపాడుకునేందుకు పొలంలోకి వెళ్ళిన రైతులు ఆ పంటల పరిస్థితి చూసి కన్నీరు పెడుతున్నారు. ఒక్కొక్క గ్రామంలో కనీసం రూ.20కోట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం. చాలామంది రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ప్రతి రైతు కనీసం రూ.2లక్షల నుంచి రూ.3లక్షల మేర పెట్టుబడులను కోల్పోయారు. ప్రభుత్వం ఉదారంగా స్పందించి ఆర్థిక సాయంతోపాటు మళ్ళీ పంట సాగుకు అవకాశం ఉన్న పొగాకు, శనగ వంటి వాటికి అవసరమైన విత్తనాలు ఇతరత్రా ఇన్‌పుట్స్‌ అందజేయాలని రైతులు, రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు.

బీమా, ఇన్‌పుట్స్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి

- జి.పుల్లారెడ్డి, తూర్పుగంగవరం, తాళ్ళూరు మండలం

ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా. రూ. 1.50 లక్షలు ఖర్చయ్యింది. పంట కోసి ఓదెలపై ఉన్న సమయంలో ముసురుపట్టి భారీవర్షం కురిసింది. నాలుగు రోజులు నీళ్లలోనే ఓదెలు తడిసిపోయాయి. నీరు తీశాక ఇప్పుడు చూస్తే మొత్తం ధాన్యం గింజలు మొలకెత్తిపోయాయి. అంతా నష్టపోయా. పంటల బీమాతోపాటు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి.

పొగాకు, శనగ తుడిచిపెట్టకుపోయాయి

- కొండ్రగుంట సురేష్‌, ముప్పవరం, కొండపి మండలం

నాకున్న పొలంలో 10 ఎకరాలు పొగాకు, ఆరు ఎకరాలు శనగ సాగు చేశా. నవంబరు తొలి వారంలో నాట్లు వేస్తే 13న వర్షం కురిసి దెబ్బతింది. రెండవసారి నాట్లు వేశా. ప్రస్తుతం కురిసిన వర్షాలకు మొత్తం పోయింది. ఎకరాకు రూ.30వేల వరకు ఖర్చయ్యింది. శనగ కూడా ఇప్పటివరకు ఎకరాకు రూ.5వేలు ఖర్చయ్యింది. రెండు పంటలు ఉరకెత్తిపోయాయి. మరోసారి సాగు చేయాల్సిందే. ఇప్పటివరకు పెట్టిన ఖర్చు రూ.4 లక్షలు నీళ్లపాలయ్యాయి. ప్రభుత్వం ఆదుకుంటేనే వ్యవసాయం చేయగలం.

ఒక్కరూపాయి వచ్చే అవకాశం లేదు

- నారాయణరెడ్డి, గోట్లగట్టు, కే కేమిట్ల మండలం

ఎనిమిది ఎకరాల్లో మినుము సాగు చేశా. ఎకరాకు 10కిలోల విత్తనం కిలో రూ.150 లెక్కన కొనుగోలు చేసి వేశాం. దుక్కుల దున్నకం, విత్తనాలు, ఎరువులు ఇతరత్రా అన్ని కలిపి ఎకరాకు రూ.18వేలు వరకు ఖర్చు అయ్యింది. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షంతో మొత్తం పోయింది. ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే అవకాశం లేదు.

Updated Date - 2022-12-15T23:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising