పెద్దారవీడు వైసీపీలో ఆధిపత్య పోరు
ABN, First Publish Date - 2022-06-03T06:09:53+05:30
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పెద్దారవీడు వైసీపీ బలంగా ఉన్న మండలం. ఆ పార్టీ మండల కన్వీనర్‌గా ఉన్న వ్యక్తి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ, పార్టీ సీనియర్ నాయకులు వేరు కుంపట్లు పెట్టుకున్నారు.
మండల సర్వసభ్య సమావేశానికి సభ్యుల గైర్హాజరు
లాడ్జీలో ప్రత్యేక సమావేశం
పెద్దారవీడు(మార్కాపురం), జూన్ 2: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పెద్దారవీడు వైసీపీ బలంగా ఉన్న మండలం. ఆ పార్టీ మండల కన్వీనర్‌గా ఉన్న వ్యక్తి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ, పార్టీ సీనియర్ నాయకులు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం చాలాకాలంగా లోలోపలే గుమ్మనంగా ఉంది. అయితే పెద్దారవీడులో సోమవారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా ఒక్కసారిగా బహిర్గత మైంది. సదరు నాయకుడికి వ్యతిరేకవర్గంగా ఉన్న ప్రజా ప్రతినిధులెవ్వరూ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో కోరం లేక సమావేశం వాయిదా పడింది.
గత సమావేశంలోనూ ఇదే పరిస్థితి
పెద్దారవీడు సర్వసభ్య సమావేశంలో మూడు నెలల క్రితం మార్చిలో జరిగింది. ఈ సమావేశానికి మండలంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు 31 మంది ఉండగా 9 మంది హాజరయ్యారు. మొ త్తం ఎంపీటీసీలు 12కు గాను 5 గురు హాజరయ్యారు. హాజరైన 5 గురిలో టీడీపీకి చెందిన వారు ముగ్గురు కాగా, వైసీపీకి చెందినవారు ఇద్దరు మాత్రమే. దీంతో గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు 8 స్థానాల్లో వైసీపీకి చెందిన వారు, 4 స్థానాల్లో టీడీపీ వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ తరపున హాజరైన ఇద్దరిలో ఎంపీపీగా ఉన్న బెజవాడ పెద్ద గురవయ్య, మండల కన్వీనర్ ప్రాదేశికమైన కలనూతలకు ఎంపీటీసీ సభ్యుడు. ఆయనతో పాటు మరో ఎంపీటీసీ సభ్యుడు దూదేకుల పకీరయ్యలు మాత్రమే వైసీపీ తర ఫున హాజరయ్యారు. ఆరుగురు గైర్హాజరయ్యారు. టీడీపీ ఎంపీటీసీలు నలుగురికిగాను ముగ్గురు హాజరయ్యారు. దీంతో గతంలోనూ కోరం కాక వాయిదా పడింది. మండలంలో 19 పంచాయతీలకు గాను 16 స్థానాల్లో వైసీపీ సర్పంచులు, 3 స్థానాల్లో టీడీపీ సర్పంచులున్నారు. వీరిలో మండల సర్వసభ్య సమావేశానికి నలుగురు మాత్రమే హాజరయ్యారు. వీరిలో వైసీపీకి చెందిన గొబ్బూరు, బద్వీడుకు చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన దేవరాజుగట్టు, బద్వీటిచెర్లోపల్లికి చెందిన ఇద్దరు హాజరయ్యారు. 15 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా సమావేశానికి 31 మంది సభ్యులకుగాను కేవలం 9 మంది మాత్రమే హాజరయ్యారు.
మండల కన్వీనర్ నియంతృత్వ ధోరణే కారణమా?
వైసీపీ మండల పార్టీ పగ్గాలు పట్టిన వ్యక్తి నియంతృత్వ ధోరణే పార్టీలో విభేధాలు రావడానికి కారణంగా ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మండల వైసీపీలో మూడు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గానికి పార్టీ మండల కన్వీనర్ నేతృత్వం వహిస్తున్నాడు. ఈ వర్గంలోనే ఎంపీపీ కొనసాగుతున్నాడు. మరో వర్గానికి మండలం నుంచి జిల్లా పరిషత్‌కు ప్రాతినిధ్యం వహి స్తున్న నాయకుడు నేతృత్వం వహిస్తున్నాడు. వీరితో పాటు మాజీ మండలాధ్యక్షుడి నేతృత్వంలో మూడో వర్గం ఏర్పడింది. పార్టీ మండల కన్వీనర్‌పై ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేయడానికి మండల సర్వసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధుల గైర్హాజరు విషయంలో ప్రత్యర్థి వర్గాలు రెండూ ఏకమయ్యాయి. తమ వర్గం ప్రజాప్రతినిధులు సమావేశానికి వెళ్లకుండా మార్కాపురంలోని లాడ్జీలో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మండల సర్వసభ్య సమావేశం కోరం లేకవాయిదా పడింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కొన సాగుతున్న ఆదిమూలపు సురేష్ మండల సర్వాధికారాలు పార్టీ మండలాధ్యక్షునికి ఇవ్వడంతో ప్రభుత్వ అధికారులం దరూ ఆయన చెప్పినట్లే నడుచుకుంటున్నారని, దీంతో తమ ప్రాభల్యం తగ్గిందని ఆయన ప్రత్యర్థి వర్గీయులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇరు వర్గీయులను ఏకం చేయడం మంత్రి సురేష్‌కు తలనొప్పిగా మారింది.
నేటి సమావేశంపై ఉత్కంఠ
ఈ నేపథ్యంలో నేడు మరోసారి అధికారులు సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సమా వేశానికి కూడా ప్రజా ప్రతినిధులు గౌర్హాజరవుతారా? నాయకుల మధ్య ఆంతర్యాన్ని మంత్రి సురేష్ తగ్గిస్తారా..? నాయకుల మధ్య అందే పంత పునరావృతమౌతుందా? అన్నది శుక్రవారం తేలనుంది.
Updated Date - 2022-06-03T06:09:53+05:30 IST