అర్ధవీడు మండలంలో ప్రధాన రోడ్లు ఛిద్రం
ABN, First Publish Date - 2022-12-26T00:47:40+05:30
అర్థవీడు మండలంలోని పలు ప్రధాన రహదారులు పూర్తిగా ఛిద్రం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కంభం, డిసెంబరు 25 : అర్థవీడు మండలంలోని పలు ప్రధాన రహదారులు పూర్తిగా ఛిద్రం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. భౌగోళికంగా అర్ధవీడు మండలం రెండు పాయలుగా ఉంటుంది.
నాగులవరం నుంచి అర్థవీడు మండలానికి వెళ్లాలంటే 25 కిలోమీటర్లు ప్రధాన రహదారి ఉంది. ఇదే మండలంలో నాగులవరం నుంచి వెలగలపాయ లోయకు వెళ్లే 30 కిలోమీటర్ల పైగా ఉండే మరో ప్రధాన రహదారి ఉంది. వెలగలపాయ వైపు నుంచి అర్ధవీడు పోవాలంటే విధిగా నాగులవరం వచ్చి చుట్టు తిరిగి పోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రధాన రహదారుల్లో గజానికి ఒక గుంత, అడుగుకు ఒక గొయ్యి దర్శనమిస్తాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణించే వారు నరకాన్ని చూస్తున్నారు. రోడ్డు అంచుల్లో చిల్లచెట్లు, పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు నాసిరకంగా వేసిన తారురోడ్లు ఏడాదికే దెబ్బతిని గుంతలుగా మారుతున్నాయి. సదరు కాంట్రాక్టర్లు ఏటా ఈ రోడ్డులో ప్యాచ్ వర్క్ పేరుతో బిల్లులు చేసుకుంటూ ఆదాయ వనరుగా మార్చు కుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ రోడ్డు గోతుల్లో పడి గత వారం ఓ వాహనదారుడు మృతిచెందిన విధితమే. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతు సక్రమంగా చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - 2022-12-26T00:47:46+05:30 IST