ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాగైతే.. కష్టమే!

ABN, First Publish Date - 2022-10-18T05:19:36+05:30

ఇచ్చేది తక్కువ... వాటిపైనా కఠిన ఆంక్షలు... ఇదీ గడప గడపకు కార్యక్రమంలో గుర్తించిన పనులు మంజూరు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడప గడపకు నిధుల మంజూరుపై ఆంక్షలు

ప్రతిపాదిత పనుల మార్పులకు నో

95శాతం ఇళ్లు  సందర్శించినట్లు ఫొటోలు పెడితేనే పనులు

అలా ఇప్పటి వరకూ 107 సచివాలయాల్లోనే పూర్తయినట్లు గుర్తింపు 

కనీసం రెండు రోజులు పర్యటన తప్పనిసరంటూ మెలిక

తాజా నిబంధనలపై అధికార పార్టీ నేతల్లోనే అసంతృప్తి

ఇచ్చేది తక్కువ... వాటిపైనా కఠిన ఆంక్షలు... ఇదీ గడప గడపకు కార్యక్రమంలో గుర్తించిన పనులు మంజూరు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. కార్యక్రమ ప్రారంభం నాడు ఒక్కో సచివాలయ పరిధిలో గుర్తించిన పనులకు రూ.20లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం రానురాను వాటి మంజూరుపై రోజుకో మెలిక పెడుతోంది. తొలుత స్థానిక ప్రజాప్రతినిధి సచివాలయ పరిధిలో పర్యటించి పనులను ప్రతిపాదిస్తే వాటిని మంజూరు చేయాలని ఆదేశించింది. తర్వాత ఒకరోజు పర్యటిస్తే సరిపోదు రెండు రోజులు తప్పనిసరి అని నిబంధన పెట్టింది. తాజాగా సచివాలయ పరిధిలో 95శాతం ఇళ్లను సందర్శించినట్లు ఫొటోలు అప్‌లోడ్‌ చేసిన సచివాలయాల్లో పనులను మాత్రమే మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఏకంగా ఎంపీడీవో లాగిన్‌లోనే మార్పులు చేసింది. దీంతో కార్యక్రమం పూర్తయిన పలు సచివాలయాల్లో ప్రతిపాదిస్తున్న పనులు మంజూరయ్యే అవకాశం లేదని సమాచారం. మరోవైపు ఒకసారి ప్రతిపాదించిన పనిని ఏదైనా కారణం చేత మార్పు చేయాల్సి వస్తే అలాంటి అవకాశం లేకుండా చేశారు. తాజా నిబంధనలపై అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఒంగోలు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘గడపగడపకు వెళితేనే నిధులు.. లేకుంటే కష్టమే.. అదీనూ ఇంటింటికీ తిరగాలి.. రెండురోజులు వెళ్లాలి..’ ఇలాంటి ఆంక్షలతో ప్రభుత్వం అధికారపార్టీ వారికే చుక్కలు చూపెడుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సచివాలయాలకు కేటాయించిన నిధులకు సంబంధించి రోజుకొక నిబంధన పెడుతోంది. ఇవన్నీ చూసి వైసీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని ప్రతి ఇంటికీ వివరించి ప్రభుత్వానికి ప్రజా మద్దతు కూడగట్టేందుకు తొలుత ‘గడపగడప’ను పార్టీ కార్యక్రమంగా వైసీపీ చేపట్టింది. ప్రజల నుంచి ఆశించిన ఆదరణ రాకపోవడం, తమ ఇళ్లకు వస్తున్న ప్రజాప్రతినిధులు, నేతలను పలు సమస్యలపై ప్రజలు నిలదీస్తుండటంతో అధికారిక కార్యక్రమంగా మార్పుచేశారు. సచివాలయం యూనిట్‌గా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆ పరిధిలోని అధికారులు, సచివాలయ సిబ్బందితో ఇళ్లకు వెళ్తున్నారు. ఆ సందర్భంగా ప్రజలు ప్రస్తావించే రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్‌ తదితర పనులు చేపట్టేందుకు ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల నిధుల మంజూరుకు ప్రభుతం ఉత్తర్వులు ఇచ్చింది. 


ఇంటింటికీ వెళ్లకపోవడంతో...

జిల్లాలో 719 సచివాలయాలు ఉండగా సుమారు రూ.143.80 కోట్లు ఈ కార్యక్రమం కింద రానున్నాయి. తాము సచివాలయ పరిధిలో పర్యటించి పనులను ఎంపీడీవో ద్వారా ప్రతిపాదిస్తే రాష్ట్ర రాజధానిలోని కంట్రోల్‌ సెంటర్‌లో సదరు సచివాలయాల్లో కార్యక్రమం జరిగిందీ లేనిది పరిశీలించి కలెక్టర్‌కు పంపేవారు. తదనుగుణంగా కలెక్టర్‌ మంజూరు చేసేవారు. అయితే చాలాచోట్ల గడపగడపకు వెళ్లకుండా గ్రామాలు, వార్డులలో ఒక రోజు లేదా ఒకపూట కొన్ని వీధుల్లో తిరిగి కార్యక్రమం పూర్తిచేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో కనీసం రెండు రోజులు పర్యటిస్తేనే ఆ సచివాలయంలో కార్యక్రమం జరిగినట్లుగా గుర్తించనున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సమీక్షలో ప్రకటించారు. అలాగే ప్రతి ఇంటికీ వెళ్లిన ఫొటోలను అప్‌లోడ్‌ చేసే బాధ్యతను సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో వలంటీర్లు చేసే విధంగా నిర్దేశించారు. ఈక్రమంలో జిల్లాలో పది రోజుల క్రితం 163 సచివాలయాల్లో కార్యక్రమం జరగ్గా రెండు రోజులు కనీసం పర్యటన నిబంధనతో ఆ సంఖ్య 140కి పడిపోయింది. సీఎం సమీక్ష తర్వాత రెండు రోజులు కనీస పర్యటన జరిగిన సచివాలయాలనే అధికారులు లెక్కలోకి తీసుకుంటున్నారు. అలా ఇప్పటివరకు 150 సచివాలయాల్లో పూర్తయినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. 


రెండు రోజులు తిరగాల్సిందే

తమకు ఆయా ప్రాంతాల నుంచి అందిన 650 పనులను పరిశీలించి వాటిలో ఇంచుమించు 600కుపైగా  మంజూరుకు ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సమయంలో తాజాగా పనుల మంజూరుపై మరో నిబంధన పెట్టారు. రెండు రోజులు కనీస పర్యటనతోపాటు సచివాలయ పరిధిలో 95శాతం ఇళ్లకు వెళ్ళినట్లు ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేసిన సచివాలయ పరిధిలో ప్రతిపాదించిన పనులను మాత్రమే మంజూరు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతేకాక గతంలో ఎంపీడీవోలు తమకు అందిన ప్రతిపాదనలను అప్‌లోడ్‌ చేస్తే రాష్ట్ర కంట్రోల్‌ రూంలో పరిశీలించేవారు. అయితే ప్రస్తుతం కనీసం రెండురోజుల కార్యక్రమం జరగడంతోపాటు 95శాతం ఇళ్లను సందర్శించినట్లు ఫొటోలు కూడా అప్‌లోడ్‌ చేసిన సచివాలయల పరిధిలో పనులను మాత్రమే ప్రతిపాదించేలా ఎంపీడీవోల లాగిన్‌లోనే మార్పులు చేశారు. ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా 95శాతం ఇళ్ల సందర్శన నిబంధన పెట్టిందన్న విమర్శలు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. 


95శాతం సందర్శన ఎలా?

చాలా ప్రాంతాల్లో వలసలు.. పట్టణాలు పల్లెల్లో తేడాలేకుండా రోజువారీ పనులకు వెళ్లే కుటుంబాలు ఉంటాయి. దీంతో నేతలు గడపగడపకు వెళ్లినప్పుడు వారి ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయి. కొన్నిచోట్ల ఇలాంటివి 15 నుంచి 20శాతం వరకు కూడా ఉంటున్నట్లు చెప్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో 95శాతం ఇళ్ల సందర్శన ఎలా సాధ్యమన్న ప్రశ్న వస్తోంది. అలాగే కొందరు వలంటీర్లు సకాలంలో ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం లేదని చెప్తున్నారు. దీని వల్ల వాస్తవంగా పర్యటన పూర్తయిన సచివాలయాల పరిధిలో పనుల మంజూరుకు బ్రేక్‌ పడే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.


మార్పులు,చేర్పులు చేయలేం

జిల్లాలో రెండురోజుల క్రితం వరకు 150 సచివాలయాల పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో 95శాతం ఫొటోలు అప్‌లోడ్‌ నిబంధన ప్రకారం చూస్తే 107 చోట్ల మాత్రమే పూర్తయినట్లు రాష్ట్ర కంట్రోల్‌ సెంటర్‌ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సచివాలయాల పరిధిలో పనులు మంజూరు ఇబ్బందికరమని చెప్తున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో తొలుత ప్రతిపాదించిన పనుల్లో మార్పులు, చేర్పులకు  ప్రజాప్రతినిధులు, నేతల నుంచి మండల, జిల్లా అధికారులకు ఒత్తిడి వస్తుండగా అలాంటి సవరణకు అవకాశం లేదని చెప్తున్నారు. దీంతో ఇస్తామంటున్న నిధులే ఏ పనికి సరిపోని పరిస్థితి కాగా వాటిపై తాజాగా సవాలక్ష ఆంక్షలు పెట్టడం పట్ల అధికారపార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

Updated Date - 2022-10-18T05:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising