ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టళ్లలో విద్యార్థుల ఆకలి కేకలు

ABN, First Publish Date - 2022-08-06T04:40:58+05:30

సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు ఆకలికేకలు పెడుతున్నారు. వారికి భోజనం సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ఎక్కడా అమలు కావటం లేదు.

చీమకుర్తిలో హాస్టల్‌ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న విజిలెన్స్‌ డీఎస్పీ అశోక్‌వర్ధన్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలు కాని మెనూ

ధరలు పెరగటంతో సరుకుల సరఫరాను   నిలిపివేసిన టెండర్‌దారుడు

వార్డెన్లే కొనుగోలు.. సకాలంలో అందని బిల్లులు

అప్పులు తెచ్చి మరీ నడపాల్సిన పరిస్థితి

అరకొరగానే పెట్టి సరిపెడుతున్న వైనం

సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు ఆకలికేకలు పెడుతున్నారు. వారికి భోజనం సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ఎక్కడా అమలు కావటం లేదు. విద్యార్థులకు భోజనం అందించేందుకు అవసరమైన సరుకులు వసతిగృహాలకు సరఫరా కావటం లేదు. కరోనా సమయం నుంచి సరుకుల సరఫరా నిలిచిపోయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వసతిగృహాల విద్యార్థులను అనాఽథల్లా వదిలేసింది. వార్డెన్లే స్థానికంగా సరుకులు కొనుగోలు చేసి భోజనం పెడుతున్నారు. అప్పులు చేసి సరుకులు బయట కొనుగోలు చేయడం, ప్రభుత్వం నుంచి బిల్లుల కోసం ఎదురుచూడటం పరిపాటైంది.

ఒంగోలు నగరం, ఆగస్టు 5 : సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజన కష్టాలు ఎక్కువయ్యాయి. నిత్యం అర్ధాకలితో కాలం వెళ్లబుచ్చుతున్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అన్నింటిలో మెనూ అమలుకావడం లేదు. జిల్లాలోని అన్ని వసతిగృహాలు గతనెల 5వతేదీ నుంచి పునఃప్రారంభమయ్యాయి. గతేడాదిలోనే టెండర్‌దారుడు వసతిగృహాలకు సరుకుల సరఫరాను నిలిపివేశారు. అప్పటి నుంచి  మెనూలో కోత పెట్టేస్తున్నారు. వార్డెన్లు సమకూర్చే భోజనంతోనే విద్యార్థులు సరిపెట్టుకుంటున్నారు. వారంలో మూడు నాలుగుసార్లు చికెన్‌ వండిపెట్టాల్సి ఉండగా అది ఒక్కసారికే పరిమితమైంది. కొన్ని వసతిగృహాల్లో అసలు చికెన్‌ అన్న మాటే మర్చిపోయారు. ఇక ఒక్క శనివారం తప్ప అన్నిరోజుల్లో విద్యార్థులకు ఉడికించిన గుడ్డు ఇవ్వాల్సి ఉండగా రెండు, మూడుసార్లు కూడా ఇవ్వటం లేదు. ఉదయాన్నే ఇవ్వాల్సిన రాగిజావ, పొంగలి, కిచిడి వంటివి వార్డెన్లు విద్యార్థులకు అందజేయలేక తక్కువఖర్చుతో తయారుచేసే ఉప్మా వంటి వాటినే పెడుతున్నారు. 


2018లో ఖరారు చేసిన ధరలే

రాష్ట్రప్రభుత్వం వసతిగృహాల నిర్వహణపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తోంది. వాటికి సరుకులు సరఫరా చేసే టెండర్‌ను గత ప్రభుత్వం 2018వ సంవత్సరంలో ఖరారు చేసింది. ఉప్పు, పప్పు, కారం, చింతపండు ఇతర నిత్యావసర సరుకులు సరఫరా చేసే రేటును అప్పుడే నిర్ణయించింది.  అయితే అప్పటి సరుకుల ధరలకు, ప్రస్తుతం ఉన్న రేట్లకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ధరలు బాగా పెరిగిపోయాయి. ఏటా టెండర్లను పిలిచి ఖరారు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. దీంతో తక్కువ ధరకు సరుకులను సరఫరా చేయలేక టెండర్‌దారుడు ముఖం చాటేశాడు. అతని గడువు కూడా తీరిపోవటంతో సరుకులను సరఫరా చేయలేనంటూ చేతులెత్తేశాడు. దీంతో వసతిగృహాలకు గతేడాది నుంచే సరుకుల సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ భారం వార్డెన్లే బరాయిస్తూ అరకొర మెనూతోనే నెట్టుకొస్తున్నారు. 


విజిలెన్సు తనిఖీల్లో బహిర్గతం

జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ హాస్టళ్లు 80, వెనుకబడిన తరగతులు సంక్షేమశాఖ వసతిగృహాలు 40, గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లు 25న పునఃప్రారంభమయ్యాయి. వీటిలో వారం క్రితం విజిలెన్సు అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అన్నిచోట్లా విద్యార్థులకు మెనూ అమలు కానట్లు తేలింది. ఇదే విషయాన్ని విజిలెన్సు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మెనూ అమలు చేయాలంటే వార్డెన్లు అప్పులు చేయాల్సిన దుస్థితి కూడా అధికారులు తనిఖీల్లో వెల్లడైంది.  


కరోనా తర్వాత తగ్గిన విద్యార్థుల సంఖ్య

కరోనా ప్రభావం వసతిగృహాలపై బాగా పడింది. విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అనేక హాస్టళ్లు మూతపడ్డాయి. వాటిలో కొన్ని ఇంకా తెరుచుకోలేదంటే కరోనా ప్రభావం ఎంతగా పడిందో అర్థం చేసుకోవచ్చు. కరోనాకు ముందు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో 20వేల మందికిపైనే విద్యార్థులు ఉండేవారు. కరోనా ప్రభావంతో 12వేలకు తగ్గింది. ఇప్పుడు ఆ సంఖ్య మరీ సగానికి పడిపోయింది. నలుగురు విద్యార్థులు ఉన్న హాస్టళ్లు కూడా ఉన్నాయి. దీంతో సంక్షేమ శాఖల అధికారులు తక్కువ విద్యార్ధులు ఉన్న వాటిని పక్కన ఉన్న వసతిగృహాల్లో కలిపేస్తున్నారు. కరోనాకు తోడు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన, మధ్యాహ్న భోజనం వంటి పథకాలు కూడా వసతిగృహాలపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడ ఉంటే విద్యాదీవెన కింద వచ్చే డబ్బులు రావడం లేదంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను వసతిగృహాల నుంచి మాన్పించి ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. దీంతో పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఉన్న కొద్దిమంది విద్యార్థులకు కూడా వార్డెన్లు సక్రమంగా భోజనం అందించలేకపోతున్నారు. వసతిగృహాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి వాటిని ఇంకా బలహీనపరిచే విధంగా గాలికొదిలేసింది. 


Updated Date - 2022-08-06T04:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising