వేధింపులను ఆపాలి
ABN, First Publish Date - 2022-10-18T05:25:18+05:30
విచారణల పేరుతో ఇంజనీరింగ్ అధికారులను వేధింపులకు గురిచేసే విధానాలను ప్రభుత్వం ఆపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
పీఆర్ ఇంజనీర్ల డిమాండ్
ఒంగోలులో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆందోళన
ఒంగోలు (కలెక్టరేట్), అక్టోబరు 17: విచారణల పేరుతో ఇంజనీరింగ్ అధికారులను వేధింపులకు గురిచేసే విధానాలను ప్రభుత్వం ఆపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ పీఆర్ ఇంజనీరింగ్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సంతపేటలోని పంచాయతీరాజ్ కార్యనిర్వహణ ఇంజనీరు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ రకాల పనులపై విచారణల పేరుతో ఇప్పటికే పలువురు ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేయగా మరికొందరికి చార్జిమెమోలు ఇస్తూ భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గంగా ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తిచేయలేదనే కారణం చూపుతూ మరింత ఇబ్బందులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులెవరని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని కారణంగా పనులు సకాలంలో పూర్తికావడం లేదన్నారు. దీనికి కూడా ఇంజనీరింగ్ అదికారులను బాధ్యులను చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఆర్.వేణుగోపాల్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ జి.ఈశ్వరరెడ్డి, ప్రతినిధులు హరిరామకృష్ణ, వై.కోటేశ్వరరావు, యల్లమంద, కె.శివరామకృష్ణ, కె.కృష్ణమోహన్, పి.రాజన్న, జె.రవిబాబు, టీఎస్‌ఎన్.కుమార్, బి.వెంకట్రావు, ఎన్‌వీ.వసంతరావు, ఎంవీ సుబ్బారెడ్డి, ఆదినారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:25:18+05:30 IST