గ్రామపంచాయతీలు వెలవెల..
ABN, First Publish Date - 2022-12-16T22:57:12+05:30
నిధులు లేక పల్లె పాలన కుంటుపడింది. గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేక ఏ పని చేపట్టాలన్నా సర్పంచ్లు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలతో పల్లెలు అపరిశుభ్రంగా మారినా ఏం చేయలేని స్థితిలో సర్పంచ్లు ఉన్నారు. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది.
వచ్చిన నిధులను జీతాలు, విద్యుత్ బకాయిలు చెల్లింపు
అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్పంచ్ల్లో ఆందోళన
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 16 : నిధులు లేక పల్లె పాలన కుంటుపడింది. గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేక ఏ పని చేపట్టాలన్నా సర్పంచ్లు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలతో పల్లెలు అపరిశుభ్రంగా మారినా ఏం చేయలేని స్థితిలో సర్పంచ్లు ఉన్నారు. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గత రెండేళ్ల నుంచి గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను ప్రభుత్వం ఏదో ఒక రూపంలో దారిమళ్లిస్తుండటంతో పంచాయతీల బ్యాంకు అకౌంట్లు జీరో బ్యాలెన్స్ చూపుతున్నాయి. గత నెలలో కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు రూ.30 కోట్లకు పైగా జిల్లాలోని పంచాయతీలకు జమ చేసింది. అయితే ఆ నిధులు వచ్చిన వెంటనే ప్రభుత్వం విద్యుత్ బకాయులతోపాటు క్లాప్ మిత్రలకు జీతాలు చెల్లించాలని ఆదేశించింది. రాష్ట్రస్థాయి నుంచి వత్తిడి నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శులు ఆ నిధులను రాత్రికిరాత్రే కరెంటు బిల్లులు చెల్లింపులు చేయడంతో పాటు క్లాప్ మిత్రలకు జీతాలు ఇచ్చారు.
చెల్లింపుల విషయంలో వార్
అయితే కొన్ని పంచాయతీల్లో సర్పంచ్లు ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనులకు చెల్లింపులు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే పంచాయతీ కార్యదర్శులు అందుకు నిరాకరించారు. దీంతో చాలా పంచాయతీల్లో సర్పంచ్లు వర్సెస్ పంచాయతీ కార్యదర్శులు తలపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని గమనించిన ఎంపీడీఓలు పంచాయతీల్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు సర్పంచ్లతో మాట్లాడి సర్దుబాటుకు ప్రయత్నించారు. అయితే కొన్నిచోట్ల మాత్రమే సయోధ్య కుదిరింది. కుదరని పంచాయతీల్లో ఇంకా కరెంటు బిల్లులు, క్లాప్ మిత్రలకు జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లాలో 225 మంది క్లాప్మిత్రలు పనిచేస్తున్నారు. వారికి గత ఆరు నెలల నుంచి జీతాలు లేని పరిస్థితి ఏర్పడింది. అయితే గత నెలలో వచ్చిన ఆర్థిక సంఘం నిధులతో రెండు నుంచి నాలుగు నెలల వరకు జీతాలు చెల్లింపులు చేయగా మరో రెండు మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి.
పంచాయతీల్లో భారీగా బకాయిలు
కాగా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు కాంట్రాక్టర్లు పలురకాల అభివృద్ధి పనులు చేపట్టారు. గత రెండేళ్ల నుంచి చేసిన పనులకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అలా సుమారు జిల్లావ్యాప్తంగా రూ.50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గత నెలలో కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయడంతో కొంతమేరకైనా బిల్లులు జమ అవుతాయి, అప్పులు తీర్చుకోవచ్చని సర్పంచ్లు, వైసీపీ నాయకలు ఆశించారు. అయితే ఆర్థిక సంఘం నిధులు వచ్చిన వెంటనే ప్రభుత్వం వత్తిడి తెచ్చిమరి జమ చేసుకోవడంతో ఇప్పటి వరకు పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్పంచ్లు లబోదిబోమంటున్నారు. కొందరు వైసీపీ నాయకులైతే బహిరంగంగానే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
Updated Date - 2022-12-16T22:57:15+05:30 IST