దొంగల ముఠా ఆటకట్టు
ABN, First Publish Date - 2022-08-04T07:08:25+05:30
ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి అందులోని రాగితీగను దొంగిలించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో నమోదైన 102 కేసులను ఛేదించారు.
102 కేసుల్లో 12 మంది అరెస్టు
320 కిలోల రాగి తీగ స్వాధీనం
వివరాలను వెల్లడించిన ఎస్పీ మలికగర్గ్
ఒంగోలు (క్రైం), ఆగస్టు 3: ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి అందులోని రాగితీగను దొంగిలించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో నమోదైన 102 కేసులను ఛేదించారు. రైతుల పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లే లక్ష్యంగా ఈ ముఠా రెండేళ్లుగా చోరీలకు పాల్పడుతోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 264 ట్రాన్స్‌ఫార్మర్లలోని వస్తువులను దొంగిలించింది. మంగ ళవారం రాత్రి 12మందిని కనిగిరి సర్కిల్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని గెలాక్సీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మలికగర్గ్ వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 34 పోలీసు స్టేషన్ల పరిధిలో 102 కేసులలో నిందితులైన 15మం ది ముఠాను పోలీసులు గుర్తించారు. వారిలో 12మం దిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాత్రుళ్లు ఆయా ప్రాంతాల్లో వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులో ఉన్న కాపర్ వైరును దొంగిలిస్తారని తెలిపారు. ఆ తీగను బయట మార్కెట్‌లో విక్రయించి వచ్చిన డబ్బుతో సరదాలు చేస్తుంటారని తెలిపారు. ఇంకా ఆ ముఠాలోని ముగ్గురు మహిళలను పట్టుకోవాల్సి ఉందన్నారు.
రూ.6లక్షల విలువైన సొత్తు స్వాధీనం
నిందితుల వద్ద 320 కిలోల కాపర్ వైరు, రెండు ఆటోలు, ఒక బైక్, చోరీకి వినియోగించే రంపపు బ్లేడ్లు, కటింగ్ ప్లైర్లు మొత్తం రూ.6లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని వారి వద్ద కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించా ల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన దర్శి డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, కనిగిరి సీఐ పాపారావు, ఎస్సైలు జి.కృష్ణపావని, డి.ప్రసాద్, విశ్వనాఽథ్‌రెడ్డి, బి.ప్రేమ్‌కుమార్‌ని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
అరెస్టు అయిన నిందితులు వీరే
ప్రస్తుతం అరెస్టు చేసిన నిందితుల్లో దోర్నాల మండలం హసనాబాద్‌కు చెందిన నల్లబోతుల పెదవెంగయ్య, నాగరాజు, వెంకటేశ్వర్లు, పిక్కిలి వెంకటేశ్వర్లు, భూసాని రాము, పిక్కిలి చిన్నమండ్ల నారాయణ, మండ్ల వెంకటేశ్వర్లు, సుందరయ్య కాలనీకి చెందిన పిక్కిలి చంటి, మండ్ల పాపయ్య, మండ్ల శ్రీను, పెద్దారవీడుకు చెందిన పిక్కిలి చిన్నలు ఉన్నారు. హసనాబాద్‌కు చెందిన నల్లబోతుల హుసేనమ్మ, సుందర య్య కాలనీకి చెందిన పిక్కిలి వెంగమ్మ, వినుకొండకు చెందిన అత్తిలి లక్ష్మి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
Updated Date - 2022-08-04T07:08:25+05:30 IST