ఉన్నా.. లేనట్లే...!
ABN, First Publish Date - 2022-12-15T23:29:53+05:30
రైతులను ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలలోను ఏదోస్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. పరుగుపరుగునా వస్తారని మంత్రులు, ఎమ్మెల్యేల కోసం రైతులు ఆశగా ఎదురుచూశారు. వారి వద్ద తమగోడు వినిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒక్కరు కూడా వారి వైపు కన్నెత్తిచూడకపోవటం విశేషం.
తుఫాన్ దెబ్బతో విలవిలలాడుతున్న రైతులకు దక్కని వైసీపీ నేతల ఓదార్పు
పొలం బాటపట్టిన టీడీపీ నేతలు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
జిల్లాలో ఈ ఏడాది ముందస్తు వర్షాలతో రైతులు భారీగా పంటల సాగుకి ఉపక్రమించారు. అంతో ఇంతో లాభాలు వస్తాయనుకుంటున్న దశలో మాండస్ తుఫాన్ మొత్తం పరిస్థితిని తారుమారు చేసింది. నష్టం అంచనా వందల కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలో ఆదుకునేవారి కోసం అంతకుమించి కనీస ఓదార్పు కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే పాలకవర్గం ఆశించిన రీతిలో స్పందించకపోవటం రైతుల్లో భావోద్వేగాలను కలిగించింది. తమ గోడుని సీఎం దృష్టికి తీసుకెళ్లి మరింత నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకునే నేతల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
కనిపించని పాలకపక్ష నేతలు
ఈ నేపథ్యంలో మీకు మేమున్నామంటూ రైతులను ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలలోను ఏదోస్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. పరుగుపరుగునా వస్తారని మంత్రులు, ఎమ్మెల్యేల కోసం రైతులు ఆశగా ఎదురుచూశారు. వారి వద్ద తమగోడు వినిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒక్క మంత్రి కూడా వారి వైపు కన్నెత్తిచూడకపోవటం విశేషం. పక్కనే అందులోను ఉమ్మడి జిల్లాతో కలిసి ఉన్న బాపట్ల జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖామంత్రి నాగార్జున జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు. ప్రకాశం జిల్లాకు కాదు కదా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న బాపట్ల జిల్లాలో భారీగా నష్టాలు జరిగిన పర్చూ రు, అద్దంకి వైపు కూడా ఆయన కన్నెత్తి చూడలేదు. చివరికి కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులతో సమావేశమై తగు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. కనీసం వారితో ఫోన్లోనైనా మా ట్లాడి పరిస్థితిని తెలుసుకున్న దాఖలాలు లే వు. జిల్లాలోని వైపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరోమంత్రి సురేష్ గురువారం నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన కార్యక్రమంలో తిరిగారు త ప్ప పంట నష్టపోయిన రైతుల గురించి ఆలోచించలేదు. ఆ నియోజకవర్గంలో కూడా వరి, మిరప పంటలకు భారీనష్టం జరిగి రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా యంత్రాంగంతో సమావేశమై వారిని ముందుకు నడిపే ప్రయత్నం కూడా చేయలేదు.
నాలుగురోజులుగా లేని బాలినేని
ఒంగోలు ప్రాంతంలో శనగ, పొగాకు తదితర పంటలకు భారీనష్టం జరిగింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల రైతులను కలిసి ఆ తర్వాత కలెక్టరుకి రైతులను ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నాలుగురోజులుగా నియోజకవర్గంలో కనిపించడంలేదు. ఇక కొం డపి నియోజకవర్గంలో పొగాకు, శనగ తదితర పంటలకు భారీ నష్టం జరిగింది. పొగాకు నారుమడులైతే తుడిచిపెట్టుకుపోయాయి. వర్షాలలోనే ఎమ్మెల్యే స్వామి, టీడీపీ నాయకుడు దామచర్ల సత్యలు పొలాల వెంట తిరిగి పరిస్థితి తెలుసుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మాజీ మం త్రి సోమిరెడ్డిని పిలిపించి ఆయనతోపాటు బాధిత రైతాంగాన్ని కలుసుకుని వారి సమస్యలను వెలుగెత్తి చాటి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సోమిరెడ్డితో కలిసి కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు కూడా బాధిత ప్రాంతాలలో పర్యటించారు. టీడీపీ నేతల హడావుడి చూసి కాబోలు ఒకరోజు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ వెంకయ్య, మరోరోజు ఇన్చార్జ్ అశోక్‌బాబులు వేర్వేరుగా రైతుల వద్దకు వెళ్లి మొక్కుబడి పరామర్శలు చేశారు. ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో అన్ని పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఎన్జీపాడు మండలంలో పార్టీలోని అసమ్మతి నేతలను సరిచేసుకునే పనికి ప్రాధాన్యమిచ్చారే తప్ప రైతుల ఈతి బాధలను పట్టించుకున్న దాఖలాలు లేవు. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ బుధవారం పంటలను పరిశీలించడం తోపాటు గురువారం పొగాకు రైతుల సమస్యపై ఈడీని కలిశారు.
మిగతా వారు అంతే
ఇక జిల్లాలోని ఎక్కువమంది అధికారపార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి అలాగే ఉంది. కనిగిరి నియోజకర్గంలో మినుము, మిరప పంటలు ఊడ్చుకుపోయాయి. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి వర్షాలలోనే రైతులను పరామర్శించి ఈ క్రాప్‌లో నమోదుకాని అనేకమంది రైతుల బాధలను వెలికితీశారు. హడావిడిగా ఎక్కడి నుంచో నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే బుర్రా మాత్రం నలుగురు అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ వారికి తగు ఆదేశాలు ఇచ్చారే తప్ప పొలాలకు వెళ్లి రైతులను పరామర్శించిన దాఖ లాలు లేవు. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ బుధవారం నియోజకవర్గానికి వచ్చినా దర్శిలో తన కార్యాలయంలో ఉండి సాయంత్రానికి విజయవాడ వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో మొక్కజొన్న, మిరప, శనగ పంటలు దెబ్బతిన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాపారావు, దర్శి చైర్మన్ పిచ్చయ్యలు మాత్రం రైతులను పరామర్శించారు. మార్కాపురం నియోజకవర్గం పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో మిర్చి భారీగా దెబ్బతింది. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విస్త్రతంగా పర్యటించారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాత్రం అది గమనించి కాబోలు హడావుడిగా తర్లుపాడు మండలంలో పర్యటించారు. గిద్దలూరు ఎమ్మెల్యే గత రెండురోజులుగా నియోజకవర్గంలో లేరు. మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాత్రం గురువారం కొమరోలు మండలంలోని ఒక గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడి నష్టాల వివరాలు తెలుసుకున్నారు.
అద్దంకి, పర్చూరులలో.
అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల లో కూడా పంటనష్టాలు మరింతగా ఉ న్నాయి. ఈ రెండు నియోజకవర్గాలు బాప ట్ల జిల్లాలో ఉండగా ఆ జిల్లాకు చెందిన మం త్రి నాగార్జున కనీసం ఆ నియోజకవర్గాలవైపు కూ డా వచ్చి పరిస్థితిని తెలుసుకోలేకపోవటం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ ఇన్చార్జ్ చై తన్య జేసీతో కలిసి ఒకటి రెండు గ్రామాల్లో పొలాలను పరిశీలించారు. పర్చూరులో అయితే అధికారపార్టీ నేతలు అడ్రస్ కూడా లేరు. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ మాత్రం మూడు రోజుల నుంచి పొలంబాట పట్టి రైతులతో నేరుగా మాట్లాడి ఓదార్చే పాత్ర నిర్వహిస్తున్నారు. ఇటు రవికుమార్ అటు సాంబశివరావు కూడా ప్రధానంగా నష్టపోయిన పొగాకు రైతులను ఆదుకునే విషయంపై ఉన్నతాధికారులను కూడా కలిశారు.
నేడు సీఎం వద్ద సమావేశం.. మరి ఏమి మాట్లాడతారో?
శుక్రవారం అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు సీఎం జగన్మోహనరెడ్డితో సమావేశం ఉంది. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమ సమీక్ష కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నేరుగా సీఎంతోనే సమావేశం అవుతున్నందున పంట నష్టాలను వివరించి రైతులను ఆదుకునే ప్రతిపాదనను ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం వారికి ఉంది. అలా చేయాలంటే వారు నష్టాలను పరిశీలించి రైతులతో మాట్లాడి ఉంటే పూర్తిసమాచారం వారికి లభించేది. ఆ పని చేయకపోయినా కనీసం రైతులను ఆదుకోమని అయినా సీఎంను కోరతారా లేదా అనేది చూడాల్సి ఉంది.
ఈడీని కలిసింది టీడీపీ నేతలు మాత్రమే
కాగా భారీగా దెబ్బతిన్న పొగాకు పంటలను పరిశీలించేందుకు వచ్చిన పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్‌బాబుని కలిసి రైతుల గోడు వినిపించేందుకు అధికార వైసీపీ నేతలు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు రవికుమార్, సాంబశివరావు, స్వామి, మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్, విజయకుమార్, యువ నాయకులు సత్యలు మాత్రం ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. నష్టం వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చి తమవంతు పాత్ర పోషించారు.
Updated Date - 2022-12-15T23:29:58+05:30 IST