మృత్యుపాశాలు
ABN, First Publish Date - 2022-11-20T23:50:04+05:30
కరెంటు వైర్లు వణికిస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో కిందకు వేలాడుతున్నాయి. కొన్నిచోట్ల చేతికి అందే ఎత్తులో ఉన్నాయి. ప్రధాన రోడ్లపక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు టెన్షన్‌పడుతున్నారు.
వాలిన స్తంభాలు
రక్షణ కంచెలు లేని ట్రాన్స్‌ఫార్మర్లు
పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
పెరుగుతున్న ప్రమాదాలు
ఏటా పదుల సంఖ్యలో మరణాలు
మూగజీవాలు మృత్యువాత
కొందరికే ఎక్స్‌గ్రేషియా
మిగిలిన వాటితో తమ
శాఖకు సంబంధం లేదంటున్న వైనం
భయాందోళనలో ప్రజలు
గిద్దలూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల జాతీయ రహదారికి పక్కనే ఉంది. అక్కడ రోడ్డు మార్జిన్‌లోనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది.
దర్శి పట్టణంలో అనేక చోట్ల విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ప్రమాదకంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రధాన రహదారిలోనే ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇవి గాలులకు తెగితే ప్రాణనష్టం జరిగే అవకాశముంది. పలుచోట్ల కాలంచెల్లిన విద్యుత్ స్తంభాలు అలాగే ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పామూరులోని కందుకూరు రోడ్డు, సీఎస్‌పురం రోడ్డులోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ప్రధానమైన ఆర్‌అండ్‌బీ రహదారి పక్కనే నాలుగు అడుగుల ఎత్తులో ఎలాంటి రక్షణ వలయం లేకుండానే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీజులు ఏర్పాటు చేశారు. నిత్యం ఆదారి నుంచి పాఠశాల విద్యార్థులు, అధికారులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈసమయంలో రోడ్డుపై ఎదురెదురుగా పెద్ద వాహనాలు వచ్చినపుడు అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్లకు తగిలితే భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది.
విద్యుత్ తీగలు యమపాశాలవుతున్నాయి. ప్రజలతోపాటు, మూగజీవాల ప్రాణాలను హరిస్తున్నాయి. ఏటా జిల్లాలో చోటుచేసుకుంటున్న సంఘటనలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. కిందకు వేలాడుతున్న తీగలు, రక్షణ కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్లు, చిన్నపాటి గాలులకే తెగిపడే వైర్లు, పుటుక్కున విరిగిపోయే పోల్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది కరెంటు కాటుకు బలవుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఆడుకుంటూ ఎర్త్‌వైర్లు తగిలి చిన్నారులు మృతి చెందిన సంఘటనలు కూడా జిల్లాలో చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇటీవల అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగె తెగిపడి నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. ఈనేపథ్యంలో జిల్లాలో పరిస్థితిని పరిశీలిస్తే నిర్వహణలో డొల్లతనం అడుగుగునా బహిర్గతమవుతోంది.
ఒంగోలు(క్రైం) , నవంబరు 20 : కరెంటు వైర్లు వణికిస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రాంతాల్లో కిందకు వేలాడుతున్నాయి. కొన్నిచోట్ల చేతికి అందే ఎత్తులో ఉన్నాయి. ప్రధాన రోడ్లపక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు టెన్షన్‌పడుతున్నారు. కొన్నిచోట్ల జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో వరిగిపోయిన కరెంటు స్తంభాలతో ఏఉపద్రవం వచ్చిపడుతుందోనని వణికిపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన పురాతన పోల్స్‌ను అలాగే ఉంచడం వలన ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనివాపోతున్నారు.
కాలం చెల్లిన తీగలు
కాలం చెల్లిన కరెంటు తీగలు ప్రజలకు ప్రాణసంకటంగా మారాయి. అయినా చర్యలు లేవు. ట్రాన్స్‌పార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు గురించి అధికారులు పట్టించుకోకపోవడం ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. ఎప్పటికప్పుడు విద్యుత్‌లైన్‌లు పరిశీలిచడంతోపాటు, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన సిబ్బంది ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. పంట పొలాల్లో స్తంభాలు ఒరిగిపోతున్నాయి. వీటితోపాటు వేలాడుతున్న తీగల గురించి పట్టించుకోకపోవడంతో రైతులు, మూగజీవాలు మృతి చెందుతున్నాయి.
ఎక్స్‌గ్రేషియా చెల్లింపులో మెలిక
విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా సక్రమంగా అందడం లేదు. అనేక కుంటిసాకులతో అధికారులు ఎక్స్‌గ్రేషియాకు అనర్హులుగా పేర్కొంటున్నారు. కొన్ని ప్రమాదాలకు విద్యుత్‌శాఖతో సంబంధం లేదని తేల్చిపారేస్తున్నారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి. ఈ ఏడాది విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మాత్రమే మృతి చెందినట్లు విద్యుశాఖ అధికారులు చెప్తున్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. దీన్ని బట్టి విద్యుదాఘాతానికి గురై మరణించిన కేసులన్నింటినీ ఆశాఖ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విషయం అర్థమవుతుంది. అనేక కేసులు తమకు సంబంధం లేదని వదిలేశారు.
విద్యుత్‌శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రమాదాలు ఇవీ..
ట్రాన్స్‌కో అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం ఈఏడాది అక్టోబర్ నాటికి 22 విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 19 ప్రమాదాల్లో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. పశువులకు సంబంధించి ఐదు ప్రమాదాలతో విద్యుత్‌శాఖకు సంబంధం లేదని తేల్చారు. మిగిలిన వాటిలో 12 ప్రమాదాలకు సంబంధించి రూ.4.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. రెండు ప్రమాదాలను పెండిగ్‌లో ఉంచారు.
దర్శిలో..
దర్శి పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డులో సుమారు 40 సంవత్సరాల క్రితం వేసిన పాత ఇనుప స్తంభాలను ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. కొన్ని విరగటంతో అతుకులు వేశారు. మరికొన్ని చోట్ల అధికసంఖ్యలో కనెక్షన్లు ఒకే స్తంభం నుంచి లాగడంతో తీగలు కిందకు వేలాడుతున్నాయి. పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం వలన అవి విరిగి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గిద్దలూరులో..
గిద్దలూరు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డు మార్జిన్‌లలోనే ట్రాన్స్‌ఫార్మర్లు ఉండడం, చాలా వాటికి రక్షణ కంచెలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్ల పక్కన వెళ్లే సందర్భాలలో వాహనాలను ఓవర్‌టేక్ చేసే సమయాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఇప్పటికే కొన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు వాహనదారులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. అయితే రోడ్ల వెంట వెళ్లే మూగజీవాలు పలు సందర్భాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫీజులు తగిలి మృతి చెందాయి. గిద్దలూరులోని విశ్వభారతి పాఠశాల వద్ద కూడా ట్రాన్స్‌ఫార్మర్‌కు ఏర్పాటు చేసిన కంచె శిథిలావస్థకు చేరుకుంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళతారేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం చాలా ట్రాన్స్‌ఫార్మర్లు తక్కువ ఎత్తులో రోడ్డు మార్జిన్లలోనే రక్షణ కంచె లేకుండా ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు చేయడమే కాకుండా దిమ్మెల ఎత్తుకూడా పెంచాలని, ఫీజులకు బాక్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
పి.సి.పల్లిలో..
మండల కేంద్రమైన పీసీపల్లిలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఉన్న రోడ్డులో విద్యుత్ స్తంభం నడి రోడ్డులో ఉంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళల్లో అటుగా వెళ్లిన పలువురు ద్విచక్ర వాహన చోదకులు రోడ్డులో ఉన్న స్తంభాన్ని గమనించక దాన్ని ఢీకొని ప్రమాదాలకు గురయ్యారు. నడిరోడ్డులో ఉన్న స్తంభాన్ని తొలగించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.
పామూరులో..
మండలంలోని పలుచోట్ల జనావాసాల మధ్య కంచెలేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల ఈ ట్రాన్స్‌ఫార్మర్లు తగిలి మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ఏ ఏడాది క్రితం కందుకూరు రోడ్డులో కంచెలేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పై మద్యం మత్తులో ఓవ్వక్తి ఎక్కాడు. వెంటనే ఫీజులు పోవడంతో అతను స్వల్స గాయాలతో బయటపడ్డాడు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ వలయాలను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2022-11-20T23:50:42+05:30 IST